నావికా దళంలో పనిచేసి రిటైరై వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌పై భారత గూఢ చారిగా కేసు బనాయించి మూడేళ్లుగా నిర్బంధించడమే కాదు... ఆయన నేరాలు రుజువయ్యా యంటూ ‘నిర్ధారించి’ మరణశిక్ష కూడా విధించిన పాకిస్తాన్ చర్యను అందరూ ఊహించినట్టే ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది. ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికా రులను అనుమతించాల్సిందేనని తేల్చిచెప్పడంతోపాటు కుల్‌భూషణ్ మరణశిక్షను పునస్సమీక్షించ మని సూచించింది. 16మంది న్యాయమూర్తుల్లో చైనాకు చెందిన న్యాయమూర్తితోసహా 15మంది పాకిస్తాన్ చర్యను తప్పుబట్టడం అసాధారణం. నైతికంగా పాక్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ తీర్పును గుర్తించి, గౌరవిస్తే అది పాకిస్తాన్‌కే మంచిది.
కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని 2016లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తనంత తానే బయటపెట్టారు. కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పైగా కుల్ భూషణ్ ఉదంతాన్ని వెల్లడించడానికి పాకిస్తాన్ ఎంచుకున్న సమయం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై ఇరు దేశాల ఉమ్మడి దర్యాప్తు ప్రారంభం కాబోతున్న సమయంలో కావాలని ఈ గూఢచర్యం ఉదంతాన్ని పాకిస్తాన్ తెర మీదికి తీసుకొచ్చింది.
పరస్పరం శత్రుత్వం ఉన్న రెండు దేశాల్లోని పౌరులు అవతలి దేశం వెళ్లడానికి ప్రయత్నిం చినప్పుడు సహజంగానే వారిపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారో, వారి కార్యకలాపాల స్వభావం ఎటువంటిదోనన్న ఆరా ఉంటుంది. ఆ దేశంలో ప్రవేశించడానికి తగిన అనుమతులున్నా ఇవి తప్పవు. ఇలాంటివి ఏమీ లేకుండా పట్టుబడితే ఇక చెప్పనవసరం లేదు. ఆచూకీ కూడా దొరక్కుండా ఖైదు చేయడం లేదా ప్రాణం తీయడం చాలా సులభం. పాకిస్తాన్ జైళ్లలో గూఢచారుల ముద్ర పడి పలువురు భారతీయులు మగ్గుతున్నారని, అలాగే 1971 యుద్ధకాలంలో పట్టుబడిన పలువురు జవాన్లు అక్కడి జైళ్లలో ఉన్నారని మన దేశం ఆరోపించడం, దాన్ని పాకిస్తాన్ తోసి పుచ్చడం రివాజుగా సాగుతోంది.
పైగా కుల్‌భూషణ్ ఉదంతంలో అనేక అనుమానాలున్నాయి. ఆయన్ను బలూచిస్తాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతుండగా అరెస్టు చేశామని పాకిస్తాన్ చెబు తోంది. కానీ వ్యాపార పనుల నిమిత్తం ఇరాన్‌లో ఉండగా అక్కడి పాక్ ఏజెంట్లు కుల్‌భూషణ్‌ను అపహరించుకుపోయారన్నది మన దేశం ఆరోపణ. ఆయన కుటుంబసభ్యులు చెబుతున్న అంశా లను బట్టి చూసినా ఆయనను ముందే అపహరించిన సంగతి వెల్లడవుతుంది. అంతకు మూణ్ణెల్ల ముందే కుల్‌భూషణ్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని, ఆయన ఉన్నట్టుండి ఫోన్‌కు అందు బాటులో లేకుండా పోయారని కుటుంబసభ్యులు చెప్పారు.
కుల్‌భూషణ్ ఉదంతంలో పాకిస్తాన్ చెబుతున్నది విశ్వసించడానికి మొదటినుంచీ దాని చేతలే అడ్డొస్తున్నాయి. ఈ విషయంలో ఆ దేశం ప్రవర్తన పూర్తి అనుమానాస్పదంగా ఉంది. ఎవరి కార్యకలాపాలపైన అయినా సందేహాలున్నప్పుడు అదుపులోనికి తీసుకోవడం, ప్రశ్నించడం సర్వ సాధారణం. కానీ వేరే జాతీయుణ్ణి అరెస్టు చేసినప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు వియన్నా ఒడంబడికలో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒడంబడికలోని 36(1)(సి) అధికరణ ప్రకారం వేరే దేశం నిర్బంధంలో ఉన్నవారిని కలిసి మాట్లాడటం, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం దౌత్య అధికారుల హక్కని స్పష్టంగా చెబుతోంది. వాటిని సక్రమంగా పాటించి ఉంటే పాకిస్తాన్ వాదనకు ఎంతో కొంత బలం ఉండేది. బలూచిస్తాన్‌లో భారత్ గూఢచర్యానికి పాల్పడుతున్నదని, అక్కడ విధ్వంసకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న పాకిస్తాన్‌కు ఈ కేసు ఎంతో అక్కరకొచ్చేది. కానీ కుల్‌భూషణ్ ఉదంతంలో ఎన్ని కంతలున్నాయో దానికే బాగా తెలుసు.
అందుకే అపహరించుకుపోయిన మూడునెలలకుగానీ ఆ సంగతిని బయటపెట్టలేదు. ఆ తర్వాతనైనా ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించలేదు. పైగా తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ఆయనే అంగీకరించాడంటూ ఒక వీడియో విడుదల చేసింది. నిర్బం ధంలో ఉంచి, ఎవరినీ కలవనీయకుండా కట్టడి చేసి, బెదిరించి భయపెట్టి తీసుకున్న ఈ ఒప్పుదల ప్రకటనకు గడ్డిపోచ విలువైనా ఉంటుందా? ఈ వీడియోలో ‘అనేకమంది మరణానికి దారితీసిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్‌కు సంబంధం ఉన్నద’ని కుల్‌భూషణ్‌తో చెప్పించారు. కానీ నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క ఉదంతం ప్రస్తావనైనా అందులో లేదు. పైగా సైనిక కోర్టు ఆయనపై రహస్య విచారణ నిర్వహించి మరణశిక్ష విధించిన తీరు కూడా హాస్యాస్పదం.
న్యాయవాదిని నియమించుకోవడానికి, తనకు జరిగిందేమిటో వివరించి న్యాయం కోరడానికి ఆయనకు అవకాశ మీయకుండా నిర్వహించిన విచారణకు విశ్వసనీయత ఏముంటుంది? అసలు గూఢచారిగా పొరుగు దేశంలో కార్యకలాపాలు నడపడానికి వెళ్లే వ్యక్తి తన దేశానికి సంబంధించిన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుంటాడా? సాధారణంగా ఎవరినైనా వేరే దేశంలో గూఢచర్యం చేయడానికి పంపినప్పుడు గూఢచార సంస్థలు ఆ దేశం తాలూకు పాస్‌పోర్టును సమకూరుస్తాయి. లేదా మరో దేశం పాస్ పోర్టును సంపాదించి ఇస్తాయి.
తాజా తీర్పు వల్ల కుల్‌భూషణ్‌కు విముక్తి లభిస్తుందని భావించడం కష్టమే. ఈ తీర్పు ఆసరాతో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై మన దేశం మరింత ఒత్తిడి పెంచాలి. ఇలాంటి కేసులో సత్ఫలితాలు రావాలంటే రాజకీయ పరిష్కారమే మార్గం. ఇరు దేశాలమధ్యా జరిగే చర్చలే అందుకు దోహదప డతాయి. భారత్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ ఇలా తప్పుడు ఆరోపణలతో ఎదురుదాడి చేయడం వల్ల వీసమెత్తు ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కుల్‌భూషణ్ ఉదంతం వల్ల అంతిమంగా తన ప్రతిష్టే దెబ్బతిన్నదని అది తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment