ICJ
-
దక్షిణాఫ్రికా సాహసం!
నిలదీయటానికీ, నేరాన్ని వేలెత్తి చూపటానికీ సంపన్న రాజ్యమే కానవసరం లేదని, గుప్పెడు ధైర్యం, నిటారైన వెన్నెముక వుంటే చాలని దక్షిణాఫ్రికా నిరూపించింది. గాజా అనే ఒక చిన్న ప్రాంతాన్ని గుప్పిట బంధించి గత మూడు నెలలుగా సామూహిక జనహననం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)కు ఈడ్చి సవాలు విసిరింది. అమెరికాతో సహా అగ్రరాజ్యాల అండదండలున్న ఇజ్రాయెల్ ఈ పరిణామానికి జడిసి తన దారుణ మారణకాండను వెంటనే ఆపుతుందనుకోవటానికి లేదు. వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ భద్రతా నిర్మాణాలను తొలగించా లని ఐసీజే 2004లో ఇచ్చిన తీర్పునే అది బేఖాతరు చేస్తోంది. కానీ వినతులతో, వేడుకోళ్లతో సరి పెడుతూ అంతకుమించి మరేమీ చేయని, మాట్లాడని ప్రపంచ దేశాలకు దక్షిణాఫ్రికా తీసుకున్న వైఖరి చెంపపెట్టు. ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందో లేదో నిర్ణయించటానికి దక్షిణాఫ్రికా వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్ సంజాయిషీని తెలుసుకుంది. అయితే విచారణ పూర్తయి తీర్పు రావటానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఈలోగా జాతిహననం, విధ్వంసం నిలిపివేయాలంటూ అత్య వసర ఉత్తర్వులివ్వాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. గత మూడు నెలలుగా గాజాపై సాగిస్తున్న ఏకపక్ష దాడుల్లో 23,000 మంది పౌరులు మరణించగా లక్షలాదిమంది గాయపడ్డారు. మృతుల్లో పదివేల మంది వరకూ మహిళలు, పసివాళ్లున్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రాణాలతో మిగిలిన 20 లక్షలమంది పౌరులు నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. 70 శాతం ఇళ్లు, 50 శాతం భవంతులు బాంబు దాడుల్లో పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటికేఅంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇజ్రాయెల్, హమాస్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. జరిగిన జనహననం వెనకున్న ఉన్నత స్థాయివ్యక్తులెవరో, వారి యుద్ధ నేరాలేమిటో అది ఆరా తీస్తుంది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుత పరిష్కారం అన్వేషించటం ఐసీజే పని. ఇజ్రాయెల్ చేష్టలను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోబోదని చెప్పటమే దక్షిణాఫ్రికా చర్య వెనకున్న ఉద్దేశం. ఇజ్రాయెల్ చరిత్ర గమనించినవారికి ఆ దేశంపై జినోసైడ్ (జాతిని తుడిచిపెట్టడం) నిందా రోపణ రావటం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే అనేక దేశాల్లో నిరాదరణకూ, ఊచకోతకూ గురై చెట్టుకొకరూ, పుట్టకొకరూ అయిన యూదులకు రెండో ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యాల చొరవతో ఇజ్రాయెల్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇప్పుడు అదే దేశంపై జనహనన ఆరోపణలు రావటం ఒక వైచిత్రి. జనవిధ్వంసానికి వ్యతిరేకంగా 1948లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికపై ఇజ్రాయెల్ కూడా సంతకం చేసింది. కానీ దాన్ని గౌరవించిన సందర్భం లేదు. నిజానికి తానే బాధిత దేశాన్నని ఇజ్రాయెల్ అంటున్నది. ఆక్టోబర్ 7న తన భూభాగంలోకి చొరబడిన హమాస్ ఉగ్ర వాదులు 1,200 మందిని కాల్చిచంపి, 240 మందిని బందీలుగా పట్టుకున్నారని, అందుకే తాము దాడులు చేయాల్సివస్తోందని ఇజ్రాయెల్ వాదన. నిజమే... అమాయక పౌరులను భయపెట్టడం, హతమార్చటం నాగరిక ప్రపంచంలో ఏ ఒక్కరూ సమర్థించరు. తమకు అన్యాయం జరిగిందనుకుంటే శాంతియుతంగా పోరాడి సాధించుకోవాలి తప్ప హింసతో, బలప్రయోగంతో ఎదుర్కొనటం పూర్తిగా తప్పు. అలాంటి చర్యల వల్ల లక్ష్యం సిద్ధించదు సరిగదా... రాజ్యహింసకు లక్షలాదిమంది అమాయకులు బలవుతారు. అయితే హమాస్ చేతుల్లో మరణించిన పౌరులకు ప్రతిగా అవతలిపక్షం నుంచి ఎంతమందిని బలితీసుకుంటే తన దాహం చల్లారుతుందో ఇజ్రాయెల్ చెప్పగలదా? దాడు లకు కారకులైనవారిని పట్టుకోవటం, చట్టప్రకారం శిక్షించటం అనే ప్రక్రియను కాలదన్ని విచక్షణా రహితంగా యుద్ధవిమానాలతో బాంబుల మోతమోగించటం... హమాస్‌తో సంబంధం లేని సాధా రణ పౌరుల ప్రాణాలకూ, ఆస్తులకూ ముప్పు కలిగించటం ఎంతవరకూ న్యాయం? నిజానికి పాల స్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం వెదికేందుకు జరిగిన ప్రతి యత్నాన్నీ అడ్డుకున్నది ఇజ్రా యెలే. ఒక దేశమంటూ లేకుండా, అత్యంత దుర్భరమైన బతుకులీడుస్తున్న పౌరులను దశాబ్దాలుగా అణచివేయటంవల్ల సమస్య ఉగ్రరూపం దాలుస్తుందని ఆ దేశం గ్రహించలేకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇజ్రాయెల్‌కు అండదండలందిస్తున్న అమెరికాకు దక్షిణాఫ్రికా చర్య మింగుడుపడటం లేదు. ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పి దాడులు ఆపించివుంటే అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట పెరిగేది. ఆ విషయంలో పూర్తిగా విఫలమై దక్షిణాఫ్రికాను నిందించటం అర్థరహితం.జాత్యహంకార పాలకులపై పోరాడి విముక్తి సాధించిన దక్షిణాఫ్రికాకు ఆదినుంచీ ప్రపంచ వ్యాప్తంగా బలహీనులపై బలవంతులు సాగించే దుండగాలను వ్యతిరేకించటం సంప్రదాయం. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్‌పై పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం సాగిస్తున్న రష్యా తనకు మిత్రదేశమే అయినా దాని చర్యను దక్షిణాఫ్రికా తూర్పారబట్టింది. ప్రస్తుతం ఐసీజేలో వున్న 15 మంది న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ దక్షిణాఫ్రికా పిటిషన్‌ను విచారిస్తుంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ కొత్తగా చెరొక న్యాయమూర్తినీ నామినేట్ చేయొచ్చు. గాజాలో జరిగింది జాతి విధ్వంసమేనని నిరూపించటం ఐసీజే నిబంధనల ప్రకారంకొంత కష్టమేనని నిపుణులంటున్నారు. అయితే పిటిషన్ విచారణ క్రమంలో జాతి విధ్వంస పోకడలపై జరిగే చర్చవల్ల ప్రపంచ ప్రజానీకానికి వర్తమాన స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుంది. దోషులెవరో, శిక్ష ఎవరికి పడాలో తేటతెల్లమవుతుంది. -
తగ్గేదే లే.. ఐసీజే ఆదేశాల్ని తిరస్కరిస్తున్నాం!: రష్యా
ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ఒక ప్రకటన చేసింది. ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేయనుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు UN ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్‌లో ఉన్న తీర్పు మీదే ఉక్రెయిన్ భవితవ్యం ఆధారపడి ఉందన్నిక ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా. మరోపక్క శాంతి చర్చలపై స్పష్టత కొరవడి గందరగోళం నెలకొంది. ఇంకోవైపు రష్యా బలగాలు మెరెఫాలో స్కూల్ భవనాన్ని నాశనం చేశాయి. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. ఐసీజే ఆదేశాలివి.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. కానీ, రష్యా మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ (భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ) రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న కథనాలను మాస్కో వర్గాలు ఖండించాయి. సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న Mariupol థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తమ బలగాలు మరియూపోల్ భవనంపై దాడి చేయలేదని చెప్తున్నాయి. ఇంకోపక్క ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేలమంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ జనరల్‌స్టాఫ్ ప్రకటించారు. కొత్త గోడ ధ్వంసానికి సాయం చేయండి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ జర్మనీకి ఆసక్తికరమైన పిలుపునిచ్చారు. ఐరోపాలో రష్యా నిర్మిస్తున్న కొత్త గోడ ధ్వంసం చేయడంలో సహాయపడాలని కోరాడు. బుండెస్టాగ్ దిగువ సభ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసగించిన జెలెన్స్కీ.. భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. ఇక శాంతి చర్చలపై స్పష్టత కొరవడింది. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఊహూ అంటోంది. -
అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్ ... ఊహించని షాక్‌లో రష్యా
Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. యూటర్న్ తీసుకున్న భారత న్యాయమూర్తి అయితే భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్ తగిలింది. (చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి) -
కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో మగ్గుతన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు అతనికి అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. 2017లో.. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌పై పాక్ ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి ఆరోపణలు మోపిన పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుని భారత్ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్ చేసింది. దీంతో ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) తీర్పుకు సంబంధించి భారత ఖైదీ కులభూషణ్ జాదవ్‌కు అప్పీలు చేసుకునే హక్కును కల్పించే బిల్లును పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. 2020లో, ప్రతిపక్ష పార్టీల నిరసనలు ఉన్నప్పటికీ, కులభూషణ్ జాదవ్ విషయంలో ఐసీజే తీర్పును దృష్టిలో ఉంచుకుని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్‌ను సమర్పించింది. దీని ప్రకారం.. 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ ఆర్డినెన్స్ 2020' గతేడాది మే 20న అమల్లోకి వచ్చింది. చదవండి: చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్‌గా మార్చింది! -
‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’
ది హేగ్: మయన్మార్ సైన్యం దాడులతో బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ కోరారు. మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది. -
తగునా ఇది సూకీ!
ఉన్నట్టుండి పాత్రలు తారుమారైతే, స్వరం మారిపోతే దిగ్భ్రాంతిపడటం... కలో నిజమో తెలియక కంగారుపడటం ఎలాంటివారికైనా తప్పదు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరుకావడం, ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన మానవ హననమని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసించిన క్రౌర్యాన్ని కప్పెట్టే యత్నం చేయడం కళ్లారా చూసినవారికి అలాగే అనిపించింది. ఆంగ్‌సాన్ సూకీ సాధారణ మహిళ కాదు. పదిహేనేళ్లపాటు మయన్మార్ సైనిక దుశ్శాసకుల ఉక్కు నిర్బంధంలో మగ్గినా ఆమె మొక్కవోని పోరాట దీక్ష ప్రదర్శించారు. అలాంటి నాయకురాలు గత వారం ఐసీజే ముందు దాదాపు 30 నిమిషాలపాటు సైనిక పాలకులను సమర్థిస్తూ మాట్లాడటం ఎవరూ ఊహించలేరు. 2017లో మయన్మార్‌లో సైన్యం రోహింగ్యా తెగవారిపై విరుచుకుపడి గ్రామాలకు గ్రామాలు తగలబెట్టి, వేలాదిమందిని ఊచకోత కోసిన ఉదంతంపై దర్యాప్తు జరిపించి కారకులైనవారిని కఠినంగా దండించాలని ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం గాంబియా ఐసీజేలో దాఖలు చేసిన ఫిర్యాదుపై జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు. మయన్మార్ సైన్యంపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరమని ఆమె గట్టిగా వాదించారు. తరచు సైనికులపైనా, పౌరులపైనా సాయుధ దాడులకు పాల్పడుతున్న ఆరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(అర్సా) సంస్థను అదుపు చేసేందుకు సైన్యం తీసుకున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2017 ఆగస్టు 25న వేలాదిమంది అర్సా సాయుధులు 30 పోలీసు పోస్టులపైనా, గ్రామాలపైనా, రఖైన్‌లోని సైనిక స్థావరంపైనా దాడులు జరిపినప్పుడు సైన్యం వాటిని తిప్పికొట్టిందేతప్ప పౌరులను ఊచకోత కోసిందనడం అబద్ధమని సూకీ సెలవిచ్చారు. బాలికలపైనా, మహిళలపైనా అత్యాచారాలు జరిపిన సైనికులు, ఇళ్లల్లో చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా విసిరేశారని న్యాయమూర్తుల ముందు మహిళలు వాంగ్మూలం ఇస్తుండగా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయిన సూకీ, ఆ మర్నాడు సైన్యాన్ని గట్టిగా వెనకేసుకొస్తూ ప్రసంగించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. దాదాపు అరవైయ్యేళ్లుగా సాగుతున్న సైనిక నియంతృత్వంనుంచి 2015లో మయన్మార్ విముక్తమైనట్టు కనిపించినా ఆ దేశంలో ఇప్పటికీ సైన్యానిదే ఆధిపత్యం. ఆంగ్‌సాన్ సూకీని విడుదల చేసి ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి సైనికాధిపతులు అనుమతించినా, దేశాధినేత కాకుండా నిబంధనలు పెట్టారు. కనుక ప్రధాని పదవితో సమానమైన స్టేట్ కౌన్సిలర్ హోదాలో మాత్రమే ఆమె కొనసాగుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాల విషయంలో వారి అభీష్టాన్ని కాదంటే ఆ పదవి కూడా ఉండదన్న ఆందోళనతో సైనిక పాలకులకు సూకీ వంతపాడుతున్నారు. మయన్మార్ సైన్యం తమ దురాగతాలకు సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం గ్రామాలకు గ్రామాలను కాల్చి బూడిద చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్టు తమ సైనికులు అత్యాచారాలకు పాల్పడలేదని, పౌరుల్ని కాల్చి చంపలేదని వాదించడానికి అసలు రోహింగ్యాలు చెబుతున్నచోట గ్రామాలే లేవని బుకాయించడం కోసమే దీన్నంతటినీ సాగించారు. అయితే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జరిగిందేమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఇదే ఊచకోత మయన్మార్‌లో కాక మరోచోట జరిగుంటే అగ్రరాజ్యాలు తెగ ఆవేశపడేవి. ఆ దేశానికి సైన్యాన్ని తరలించేవి. పాలకుల్ని బెదిరించేవి. కానీ మయన్మార్ విషయంలో అది చెల్లుబాటు కాదు. దురాక్రమణకు ప్రయత్నిస్తే పొరుగునున్న చైనా దాన్నంతటినీ చూస్తూ ఊరుకోదు. ఆ దేశ పాలకులకు వత్తాసుగా ముందుకొస్తుంది. అందుకు సిద్ధపడదామనుకున్నా అదేమంత లాభసాటి కాదు. భూగోళంపై ఏమూల సహజవనరులున్నా వాలిపోయే తమ దేశంలోని కార్పొరేట్లకు రోహింగ్యాల గడ్డ రఖైన్ ఏమాత్రం పనికొచ్చే భూమి కాదు. అక్కడున్న సహజ వనరులు అతి స్వల్పం. కొద్దిమంది పౌరులకు పనికల్పించేందుకు కూడా ఆ వనరులు పనికి రావు. ఇక లాభాల మాటే లేదు. ప్రపంచంలో ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే దేశాలు చాలావున్నాయి. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియావంటి సంపన్న దేశాలున్నాయి. కండబలం ప్రదర్శించడానికి వెనకాడని టర్కీ ఉంది. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ) వంటివున్నాయి. ఎవరికీ రోహింగ్యాల వెతలు పట్టలేదు. కళ్లముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి లేదా కనీసం అది తప్పని చెప్పడానికి దండిగా డబ్బు, కండబలం ఉండక్కర్లేదు. కాస్తంత నైతికబలం ఉంటే చాలు. కనీసం ఆఫ్రికా ఖండంలో ఎక్కడుందో ఎవరికీ తెలియని గాంబియా చేసింది ఆ పనే. అది మయన్మార్‌కు 11,265 కిలోమీటర్ల దూరానుంది. అయినా స్పందించింది. కడవలకొద్దీ కన్నీళ్లు కార్చడం తప్ప, రోహింగ్యాల కోసం ఏమీ చేయని బడా దేశాలు సిగ్గుపడేలా ఈ దారుణాన్ని ఐసీజే దృష్టికి తీసుకురావాలని అది నిర్ణయించింది. ఇప్పుడు ఐసీజేలో సైనిక దురాగతాలను వెనకేసుకొచ్చిన సూకీ వారి బాటలోనే కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు. ఒకే ఒక్క సందర్భంలో... అది కూడా ‘అర్సా’ గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఆ పేరు ప్రస్తావించారు. కనీస అవసరాలైన తిండి, బట్ట, ఆవాసం, వైద్యం వంటివి లేక తరతరాలుగా రోహింగ్యాలు ఇబ్బందులు పడుతున్నారు. సైన్యం ఆగడాలతో పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పోయి అత్యంత దైన్యస్థితిలో శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది ఐసీజే విచారణ మాత్రమే. ఇందులో దోషులెవరో తేల్చడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింగ్యాలను వెనక్కి తీసుకొచ్చి, అంతా సవ్యంగా ఉందని చెప్పడం కోసం 2017 నవంబర్‌లో మయన్మార్ ఆ దేశంతో అవగాహనకొచ్చింది. అయితే కనీస హక్కులకు గ్యారెంటీ ఇస్తే తప్ప వెనక్కి వెళ్లేందుకు వారు సుముఖంగా లేరు. ఐక్యరాజ్యసమితి సంస్థల ద్వారా వారికి అండదండలందించి, వారు మనుషులుగా బతకడానికి సాయపడటం ప్రపంచ దేశాల కర్తవ్యం. -
ఐసీజేకు వెళ్లినా ప్రయోజనం లేదు: పాక్ లాయర్
ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించాలని భావిస్తున్న పాకిస్తాన్ ఆశలపై ఆ దేశ ఐసీజే న్యాయవాది ఖవార్ ఖురేషి నీళ్లు చల్లారు. జమ్మూ కశ్మీర్లో మారణహోమం జరుగుతుందన్న ఆరోపణలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. న్యాయస్థానం సాక్ష్యాధారాలనే ప్రామాణికంగా తీసుకుంటుందని.. అలాంటి పక్షంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కోర్టును ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నాటి నుంచి దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా కశ్మీర్ అంశంలో భారత్‌ను సమర్థించాయి. దీంతో కంగుతిన్న పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్ భద్రతా మండలిలో రహస్య సమావేశం జరిగేలా చేసింది. అయితే యూఎన్ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే ఇది భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేయడంతో పాక్‌కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం విదితమే. అదే విధంగా తమ వద్ద మినీ అణుబాంబులు ఉన్నాయని.. తక్కువగా అంచనా వేయొద్దని ఆ దేశ మంత్రులు బీరాలు పలుకుతున్నారు. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అణ్వాయుధ దేశాలైన భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరితే పరిస్థితి చేయి దాటి పోతుందని.. అయితే పాకిస్తాన్ మాత్రం ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించబోదని చెప్పుకొచ్చారు. -
‘కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదల చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే) ఇచ్చిన తీర్పుతో పాకిస్తాన్ పలు సందర్భాల్లో వియన్నా తీర్మానాన్ని ఉల్లంఘించిందన్న భారత్ వాదనను న్యాయస్ధానం సమర్ధించిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు అన్ని చర్యలూ చేపడతామని 2017లో సభకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. జాదవ్ కేసును పునఃసమీక్షించాలని, భారత్ తరపున న్యాయవాదిని అనుమతించాలని ఐసీజే పాక్‌కు స్పష్టం చేసిందని మంత్రి గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ వివరించారు. కుల్‌భూషణ్‌ను విడుదల చేసి తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను తాము మరోసారి కోరుతున్నామని అన్నారు. కాగా అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్‌కు బుధవారం భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్ వాదించింది. గూఢచర్యం కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్ పదునైన వాదన వినిపించడంతో సానుకూల తీర్పు వెలువడింది. ఐసీజేలో ఈకేసుకు సంబంధించి 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయమూర్తులు భారత్ వాదనతో ఏకీభవించారు. కేసును పునసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్ధానం పాకిస్తాన్‌కు సూచించింది. -
పాక్‌కు ఎదురుదెబ్బ
నావికా దళంలో పనిచేసి రిటైరై వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌పై భారత గూఢ చారిగా కేసు బనాయించి మూడేళ్లుగా నిర్బంధించడమే కాదు... ఆయన నేరాలు రుజువయ్యా యంటూ ‘నిర్ధారించి’ మరణశిక్ష కూడా విధించిన పాకిస్తాన్ చర్యను అందరూ ఊహించినట్టే ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది. ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికా రులను అనుమతించాల్సిందేనని తేల్చిచెప్పడంతోపాటు కుల్‌భూషణ్ మరణశిక్షను పునస్సమీక్షించ మని సూచించింది. 16మంది న్యాయమూర్తుల్లో చైనాకు చెందిన న్యాయమూర్తితోసహా 15మంది పాకిస్తాన్ చర్యను తప్పుబట్టడం అసాధారణం. నైతికంగా పాక్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ తీర్పును గుర్తించి, గౌరవిస్తే అది పాకిస్తాన్‌కే మంచిది. కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని 2016లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తనంత తానే బయటపెట్టారు. కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పైగా కుల్ భూషణ్ ఉదంతాన్ని వెల్లడించడానికి పాకిస్తాన్ ఎంచుకున్న సమయం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై ఇరు దేశాల ఉమ్మడి దర్యాప్తు ప్రారంభం కాబోతున్న సమయంలో కావాలని ఈ గూఢచర్యం ఉదంతాన్ని పాకిస్తాన్ తెర మీదికి తీసుకొచ్చింది. పరస్పరం శత్రుత్వం ఉన్న రెండు దేశాల్లోని పౌరులు అవతలి దేశం వెళ్లడానికి ప్రయత్నిం చినప్పుడు సహజంగానే వారిపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారో, వారి కార్యకలాపాల స్వభావం ఎటువంటిదోనన్న ఆరా ఉంటుంది. ఆ దేశంలో ప్రవేశించడానికి తగిన అనుమతులున్నా ఇవి తప్పవు. ఇలాంటివి ఏమీ లేకుండా పట్టుబడితే ఇక చెప్పనవసరం లేదు. ఆచూకీ కూడా దొరక్కుండా ఖైదు చేయడం లేదా ప్రాణం తీయడం చాలా సులభం. పాకిస్తాన్ జైళ్లలో గూఢచారుల ముద్ర పడి పలువురు భారతీయులు మగ్గుతున్నారని, అలాగే 1971 యుద్ధకాలంలో పట్టుబడిన పలువురు జవాన్లు అక్కడి జైళ్లలో ఉన్నారని మన దేశం ఆరోపించడం, దాన్ని పాకిస్తాన్ తోసి పుచ్చడం రివాజుగా సాగుతోంది. పైగా కుల్‌భూషణ్ ఉదంతంలో అనేక అనుమానాలున్నాయి. ఆయన్ను బలూచిస్తాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతుండగా అరెస్టు చేశామని పాకిస్తాన్ చెబు తోంది. కానీ వ్యాపార పనుల నిమిత్తం ఇరాన్లో ఉండగా అక్కడి పాక్ ఏజెంట్లు కుల్‌భూషణ్‌ను అపహరించుకుపోయారన్నది మన దేశం ఆరోపణ. ఆయన కుటుంబసభ్యులు చెబుతున్న అంశా లను బట్టి చూసినా ఆయనను ముందే అపహరించిన సంగతి వెల్లడవుతుంది. అంతకు మూణ్ణెల్ల ముందే కుల్‌భూషణ్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని, ఆయన ఉన్నట్టుండి ఫోన్‌కు అందు బాటులో లేకుండా పోయారని కుటుంబసభ్యులు చెప్పారు. కుల్‌భూషణ్ ఉదంతంలో పాకిస్తాన్ చెబుతున్నది విశ్వసించడానికి మొదటినుంచీ దాని చేతలే అడ్డొస్తున్నాయి. ఈ విషయంలో ఆ దేశం ప్రవర్తన పూర్తి అనుమానాస్పదంగా ఉంది. ఎవరి కార్యకలాపాలపైన అయినా సందేహాలున్నప్పుడు అదుపులోనికి తీసుకోవడం, ప్రశ్నించడం సర్వ సాధారణం. కానీ వేరే జాతీయుణ్ణి అరెస్టు చేసినప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు వియన్నా ఒడంబడికలో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒడంబడికలోని 36(1)(సి) అధికరణ ప్రకారం వేరే దేశం నిర్బంధంలో ఉన్నవారిని కలిసి మాట్లాడటం, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం దౌత్య అధికారుల హక్కని స్పష్టంగా చెబుతోంది. వాటిని సక్రమంగా పాటించి ఉంటే పాకిస్తాన్ వాదనకు ఎంతో కొంత బలం ఉండేది. బలూచిస్తాన్‌లో భారత్ గూఢచర్యానికి పాల్పడుతున్నదని, అక్కడ విధ్వంసకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న పాకిస్తాన్‌కు ఈ కేసు ఎంతో అక్కరకొచ్చేది. కానీ కుల్‌భూషణ్ ఉదంతంలో ఎన్ని కంతలున్నాయో దానికే బాగా తెలుసు. అందుకే అపహరించుకుపోయిన మూడునెలలకుగానీ ఆ సంగతిని బయటపెట్టలేదు. ఆ తర్వాతనైనా ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించలేదు. పైగా తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ఆయనే అంగీకరించాడంటూ ఒక వీడియో విడుదల చేసింది. నిర్బం ధంలో ఉంచి, ఎవరినీ కలవనీయకుండా కట్టడి చేసి, బెదిరించి భయపెట్టి తీసుకున్న ఈ ఒప్పుదల ప్రకటనకు గడ్డిపోచ విలువైనా ఉంటుందా? ఈ వీడియోలో ‘అనేకమంది మరణానికి దారితీసిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్‌కు సంబంధం ఉన్నద’ని కుల్‌భూషణ్‌తో చెప్పించారు. కానీ నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క ఉదంతం ప్రస్తావనైనా అందులో లేదు. పైగా సైనిక కోర్టు ఆయనపై రహస్య విచారణ నిర్వహించి మరణశిక్ష విధించిన తీరు కూడా హాస్యాస్పదం. న్యాయవాదిని నియమించుకోవడానికి, తనకు జరిగిందేమిటో వివరించి న్యాయం కోరడానికి ఆయనకు అవకాశ మీయకుండా నిర్వహించిన విచారణకు విశ్వసనీయత ఏముంటుంది? అసలు గూఢచారిగా పొరుగు దేశంలో కార్యకలాపాలు నడపడానికి వెళ్లే వ్యక్తి తన దేశానికి సంబంధించిన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుంటాడా? సాధారణంగా ఎవరినైనా వేరే దేశంలో గూఢచర్యం చేయడానికి పంపినప్పుడు గూఢచార సంస్థలు ఆ దేశం తాలూకు పాస్‌పోర్టును సమకూరుస్తాయి. లేదా మరో దేశం పాస్ పోర్టును సంపాదించి ఇస్తాయి. తాజా తీర్పు వల్ల కుల్‌భూషణ్‌కు విముక్తి లభిస్తుందని భావించడం కష్టమే. ఈ తీర్పు ఆసరాతో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై మన దేశం మరింత ఒత్తిడి పెంచాలి. ఇలాంటి కేసులో సత్ఫలితాలు రావాలంటే రాజకీయ పరిష్కారమే మార్గం. ఇరు దేశాలమధ్యా జరిగే చర్చలే అందుకు దోహదప డతాయి. భారత్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ ఇలా తప్పుడు ఆరోపణలతో ఎదురుదాడి చేయడం వల్ల వీసమెత్తు ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కుల్‌భూషణ్ ఉదంతం వల్ల అంతిమంగా తన ప్రతిష్టే దెబ్బతిన్నదని అది తెలుసుకోవాలి. -
జాధవ్ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కులభూషన్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్ గెలుపుపై ప్రధానితో సహ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ వేదికపై భారత్ గెలుపులో ఆ కేసును వాదించిన భారత న్యాయవాది హరీష్ సాల్వే కృషి వర్ణించలేనిది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఐసీజేని ఆశ్రయించింది. భారత పిటిషన్‌ను స్వీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం పలుమార్లు ఇరు దేశాల వాదనలను విన్నది. అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం భారత్ తరఫున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.. పాక్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. అంతేకాదు కులభూషన్ జాదవ్ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుధీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించింది. పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని తీర్పు వెలువరించింది. అయితే సాల్వే గురించి మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుష్మాస్వరాజ్ ట్విట్లో వెల్లడించారు. దీనిపై ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ఇప్పటికే సుష్మాస్వరాజ్ ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. -
జాధవ్ కేసుపై ఐసీజే తీర్పు నేడే
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన మరణ శిక్ష విషయంలో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తీర్పు వెలువరించనుంది. ఇండియాకు అనుకూలమైన తీర్పు రాగలదని మన ప్రభుత్వం భావిస్తోంది. ఐసీజే ఇచ్చే తీర్పును తాము స్వీకరిస్తామని పాకిస్తాన్ అధికారులు కూడా చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కోసం కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పాకిస్థాన్ ఆయనను బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 2016 మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. ఇరాన్లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. జాధవ్ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. పునర్విచారణ జరుగుతుందా? గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇండియాకు చెందిన సరబ్జిత్ సింగ్‌కు సైతం గతంలో పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. 22 ఏళ్ల పాటు పాక్ జైలులో మగ్గిపోయిన సింగ్ జైలులో తన తోటి ఖైదీలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబయి టెకీ అన్సారీని కూడా గతంలో ఆ దేశం లాహోర్ జైలులో నిర్బంధించింది. ఇండియా జోక్యంతో నిరుడు అతణ్ణి విడుదల చేసింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో జాధవ్ కేసుపై పునర్విచారణ జరపాల్సిందిగా ఐసీజే ఆదేశించవచ్చుననే మాటలు వినిపిస్తున్నాయి. కాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు పాకిస్థాన్ మూడుసార్లు ప్రయత్నించినట్టు ప్రముఖ భారతీయ న్యాయవాది హరీశ్ సాల్వే గతంలో తెలిపారు. ఐసీజేను ఓ నాటకశాలగా మార్చిందంటూ భారత్‌పై ఆడిపోసుకుంటున్న పాకిస్థాన్.. జాధవ్‌ను రక్షించేందుకు పెట్టిన కేసును కొట్టేయాలని వాదిస్తోంది. -
పాక్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీజే
ద హేగ్: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలన్న పాకిస్తాన్ వాదనను ద హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి పాకిస్తాన్ తరఫున తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన తస్సాదుక్ హుస్సేన్ జిలానీని పాక్ నియమించుకోగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తాము మరో తాత్కాలిక జడ్జిని నియమించుకుంటామనీ, ఆయన ఈ కేసు గురించి అధ్యయనం చేసేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ పాకిస్తాన్ అభ్యర్థించగా ఐసీజే తిరస్కరించి కేసు విచారణను కొనసాగించింది. పాక్ తన వాదన వినిపిస్తూ ఈ కేసుతో భారత్ ఐసీజేనే ‘రాజకీయ థియేటర్’గా మార్చేసిందనీ, కేసును కొట్టేయాలని కోరింది. జాధవ్ గూఢచారేననీ, పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు చేయడానికే తమ దేశానికి వచ్చాడని ఆరోపించింది. నాలుగు రోజులపాటు సాగే జాధవ్ కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభం కావడం తెలిసిందే. -
జాదవ్ కేసులో పాక్ దుష్ప్రచారం
-
జాదవ్ కేసులో పాక్ దుష్ప్రచారం
హేగ్ : కుల్ భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే)లో మంగళవారం వరుసగా రెండో రోజూ వాదనలు కొనసాగాయి. ఈ కేసులో పాక్ తన వాదనను వినిపించే క్రమంలో 2014 పెషావర్ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించింది. మరణ శిక్షకు గురై పాక్ జైల్లో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను విడుదల చేయాలని కోరుతూ ఐసీజేను భారత్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జాదవ్‌ను భారత గూఢచర్య సంస్థ రా కార్యకర్తగా పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు జాదవ్ ప్రణాళికలు రూపొందించారని పాక్ ఆరోపించింది. కాగా జాదవ్‌ను ఇరాన్లో అపహరించిన పాకిస్తాన్ ఆయనను బలిపశువును చేస్తోందని భారత్ పేర్కొంది. భారత్ జెనీవా సదస్సు తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, 2014 పెషావర్ ఉగ్రదాడిలో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ ఐసీజే ఎదుట తన వాదనలు వినిపించారు. -
ఆ జడ్జీలు మధ్యవర్తిత్వం చేశారు
వాషింగ్టన్: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పనిచేసిన 13 మంది మాజీ జడ్జీలు, ఏడుగురు ప్రస్తుత జడ్జీలు వారి పదవీకాలంలో వివిధ వ్యాజ్యాల్లో మధ్యవర్తులుగా పనిచేశారని ఓ నివేదిక ఆరోపించింది. వారిలో బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ఉన్నారు. ఐసీజేలో జడ్జీగా భారత్ నుంచి ఎన్నికైన ధల్వీర్ భండారీ మధ్యవర్తిత్వం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కెనడాకు చెందిన అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సంస్థ (ఐఎస్ఎస్డీ) నివేదించింది. ఐరాస సాధారణ సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ధల్వీర్ భండారీ గెలుపొందగా, గ్రీన్వుడ్ మాత్రం వెనకే ఉండిపోయారు. బ్రిటన్‌కు చెందిన గ్రీన్వుడ్ తన పదవీ కాలంలో తొమ్మిది పెట్టుబడుల వివాదాల్లో మధ్యవర్తిగా పనిచేశారని నివేదిక పేర్కొం ది. రెండు కేసులకు ఆయన దాదాపు 4 లక్షల డాలర్లు తీసుకున్నట్లు తేలింది. అలాంటి 90 కేసుల్లో కేవలం 9 కేసులకు గాను జడ్జీలకు మొత్తం 10 లక్షల డాలర్లు ముట్టినట్లు ఐఎస్ఎస్డీ వెల్లడించింది. ప్రస్తుత ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం, ఐదుగురు మాజీ అధ్యక్షులు కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం. -
ఫలించిన భారత్ వ్యూహం
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీగా దల్వీర్ భండారీ గెలుపుతో ప్రపంచదేశాల్లో తన పలుకుబడిని భారత్ మరోసారి చాటుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ సంబంధాల్లో మరింత కీలక పాత్రను పోషించే దిశగా భారత్ సిద్ధమవుతోంది. దల్వీర్ గెలుపునకు మద్దతు కూడగట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఉన్నతాధికారుల బృందం, యూఎన్‌లోని దౌత్యాధికారుల లాబీయింగ్ మంచి ఫలితాన్నిచ్చింది. భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ బెంచ్‌లో భారత జడ్జి ఉండడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే దల్వీర్ అభ్యర్థిత్వాన్ని మళ్లీ నామినేట్ చేసినప్పటి నుంచి గెలుపుకోసం ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. గత జూలైలో జీ 20 సమావేశంలో లాబీయింగ్‌ను మోదీ ప్రారంభించారు. చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశం, మయన్మార్ తదితర దేశాల్లో ద్వైపాక్షిక పర్యటనల్లోనూ భండారీ విజయానికి మోదీ మంత్రాంగం నడిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అధికారుల బృందం ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు చెందిన 100 దేశాల ప్రతినిధుల్ని సంప్రదించినట్లు సమాచారం. ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాయబారం కొనసాగిస్తూ వచ్చారు. దౌత్యపరమైన సమావేశాల్లో భండారీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించడంతో పాటు అవసరమైన మద్దతు సాధించడంపై సుష్మా, విదేశాంగ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. భండారీ మద్దతు కోసం మోదీ స్వయంగా పలువురు ప్రధానులకు లేఖలు రాశారని సమాచారం. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాల సందర్శన సమయంలో కసరత్తు చేశారు. బ్రిటన్‌కు గట్టి దెబ్బ అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1945లో ఐరాస అంతర్జాతీయ కోర్టు సంస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడంతో పాటు దేశీయంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. మరోవైపు దౌత్యపరంగా అంతర్జాతీయ ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో తాజా పరిణామాన్ని అవమానకర ఓటమిగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఐసీజే పదవి కోసం బ్రిటన్ చివరివరకూ అన్నిరకాల ఎత్తుగడలు, వ్యూహాలు అనుసరించినా ఫలితం దక్కలేదు. హైకోర్టు టు ఐసీజే తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది. అంతర్జాతీయ స్కాలర్షిప్ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా’ చదివేందుకు మరో స్కాలర్షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు. 2012లో తొలిసారి ఎన్నిక 1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐసీజే పోరులో భారత్ గెలుపు
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి మంగళవారం బ్రిటన్ తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ అతి పెద్ద దౌత్య విజయం సాధించినట్లైంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఐరాసలోని ఆధిపత్య దేశాలకు భండారీ విజయం గట్టి సందేశం పంపిందని, భారత్ శక్తివంతమైన దేశమనే అభిప్రాయం కలిగేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ ఏడాది ఐదు స్థానాలు ఖాళీ కాగా నాలుగింటికి ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరొకస్థానానికి దల్వీర్ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్‌లు సాధారణ సభ, భద్రతా మండలిలో 11 రౌండ్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 రౌండ్లలోను సాధారణ సభలో భండారీ మూడింట రెండింతల ఆధిక్యం సాధించగా, భద్రతా మండలిలో గ్రీన్వుడ్ మెజార్టీలో కొనసాగారు. మంగళవారం(భారత కాలమానం) 12వ రౌండ్ ఎన్నికలు జరగాల్సి ఉండగా గంట ముందు పోటీ నుంచి బ్రిటన్ వైదొలగింది. దీంతో భండారీ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు. రాజీ ప్రయత్నం విఫలం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు (అమెరికా కాలమానం) ఐరాస సాధారణ సభ, భ ద్రతా మండలిలు సమావేశం కావాల్సి ఉండ గా అనూహ్యంగా పోటీ నుంచి వైదొలుగుతు న్నట్లు బ్రిటన్ శాశ్వత ప్రతినిధి మాథ్యూ రైక్రాఫ్ట్ లేఖ రాశారు. తర్వాతి రౌండ్లలో కూడా ప్రతిష్టంభన తొలగేలా లేదని, కాలయాపన ఇష్టంలేక గ్రీన్వుడ్ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే ముందు భారత్, బ్రిటన్ మధ్య సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో పెట్టుకున్నామని, భవిష్యత్తులో కూడా అవి అలాగే కొనసాగుతాయని మాథ్యూ చెప్పారు. ఓటింగ్‌కు 3 గంటల ముందు సాధారణ సభ అధ్యక్షుడు మిరోస్లవ్ లాజ్‌కాక్, భద్రతా మండలి అధ్యక్షుడు సెబాస్టియనో కార్డిలు భారత్, బ్రిటన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గమని, ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని భారత్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఏ కారణంతో బ్రిటన్ పోటీ నుంచి వైదొలగిందనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఫలితాలు వెలువడగానే ఐరాస సాధారణ సభలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌ను ఇతర దేశాల ప్రతినిధులు అభినందించారు. ట్వీటర్లో మోదీ అభినందనలు భండారీ గెలుపు ఘనత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖకు దక్కుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ఐసీజేకు భారత్ మళ్లీ ఎన్నికయ్యేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మొత్తం విదేశాంగ శాఖ బృందానికి అభినందనలు. భండారీ ఎన్నిక దేశానికి గర్వకారణం’ అని పేర్కొన్నారు. ‘వందేమాతరం, అంతర్జాతీయ న్యాయస్థానం ఎన్నికలో భారత్ గెలుపొందింది. జైహింద్’ అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. మరోవైపు గ్రీన్‌వుడ్‌పై దల్వీర్ విజయం తమ దేశానికి అవమానకర పరిణామమని బ్రిటన్ మీడియా పేర్కొంది. హైకోర్టు టు ఐసీజే తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది. అంతర్జాతీయ స్కాలర్షిప్ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా’ చదివేందుకు మరో స్కాలర్షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు. 2012లో తొలిసారి ఎన్నిక 1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. -
ఐసీజేలో ఎన్నదగిన విజయం
ప్రపంచంలో అనేక దేశాలను కండబలంతో వలసలుగా మార్చుకుని తనది ‘రవి అస్తమించని రాజ్యమ’ని ఒకప్పుడు చెప్పుకున్న బ్రిటన్... ఆ దేశాల్లో ఒకటైన భారత్ చేతిలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. ఐసీజే న్యాయమూర్తి పదవికి మన దేశంనుంచి పోటీపడిన జస్టిస్ దల్వీర్ భండారీని ఎలాగైనా ఓడించాలని, ఆ పదవి దక్కించుకోవాలని అది శతథా ప్రయత్నించింది. కానీ పరిస్థితులు తనకు అనుకూలించడంలేదని, మొండిగా ముందుకెళ్తే భంగపాటు తప్పదని గ్రహించి తమ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌ను పోటీనుంచి తప్పించి భారత్‌కు మద్దతిచ్చింది. దాంతో జస్టిస్ భండారీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. ఇదంత సులభంగా ఏమీ కాలేదు. ఐక్యరాజ్యసమితిలో తనకు మెజారిటీ దేశాల మద్దతు లభించడం లేదని తెలిసినా... ఇలాంటి పరిస్థితుల్లో పోటీలో కొనసాగటం నైతికంగా సరికాదని అర్ధమైనా భద్రతా మండలిలో తనకున్న శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఓటింగ్‌ను ఆపించి, కాలం చెల్లిన ‘జాయింట్ కాన్ఫరెన్స్’ విధానాన్ని ప్రయోగించి గండం గట్టెక్కాలని బ్రిటన్ ఆలోచించింది. ఓటింగ్‌కు 12 రౌండ్లుంటే 11 రౌండ్ల వరకూ అది మొండిగా పోటీలో కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ఆ పదవి దక్కించుకున్నా సారాంశంలో అది ఓటమే అవుతుందనుకుందో... ‘జాయింట్ కాన్ఫరెన్స్’ ప్రతిపాదనకు అమెరికా నుంచి ఆశించిన మద్దతు లభించలేదో... బ్రెగ్జిట్ పర్యవసానంగా ఇబ్బందులు చుట్టుముట్టబోతున్న ఈ తరుణంలో భారత్ మనసు నొప్పించడం, అంత పెద్ద మార్కెట్‌కు దూరం కావడం తెలివితక్కువ చర్య అవుతుందని భావించిందో... చివరకు అది పోటీ నుంచి వైదొలగక తప్పలేదు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితిలో మన దూత సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు ఈ విజయానికి చేసిన కృషి గురించి కూడా చెప్పుకోవాలి. వారు పట్టుదలతో శ్రమించిన కారణంగానే ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 183 దేశాలు మన దేశానికి మద్దతునిచ్చాయి. భద్రతామండలిలోని 15 దేశాల ఓట్లూ లభించాయి. పోటీనుంచి తప్పుకోవడానికి ముందు భద్రతామండలిలో బ్రిటన్ హవాయే కొనసాగింది. అది మండలిలోని ఇతర శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లను కూడగట్టుకుంది. ఈ శాశ్వత సభ్య దేశాల్లో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా పదవిని చేజిక్కించుకోవడానికి, ఏ కీలక నిర్ణయాన్నయినా ఆపడానికి అవి కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. వాస్తవానికి పోటీనుంచి విరమించుకోవాలని మొన్న శుక్రవారం బ్రిటన్ నిర్ణయించినా ఇతర శాశ్వతసభ్య దేశాలు అందుకు అడ్డుతగిలాయని కథనాలు వచ్చాయి. రహస్య బ్యాలెట్ జరుగుతుంది గనుక ఎవరు ఎవరికి ఓటేశారో తెలియదుగానీ... అప్పటికి మండలి ఓటింగ్‌లో 9 దేశాలు బ్రిటన్వైపు నిలిచాయి. మనకు ఆరుగురి మద్దతు లభించింది. నిబంధనల ప్రకారం రెండింటిలోనూ మెజారిటీ కూడగట్టుకున్న దేశానికి మాత్రమే న్యాయమూర్తి పదవి దక్కాలి గనుక ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ దశలో శాశ్వతసభ్య దేశాల ముందు బ్రిటన్ ‘జాయింట్ కాన్ఫరెన్స్’ ప్రతిపాదన తీసుకొచ్చింది. దాని ప్రకారం సమితి నుంచి ముగ్గురూ, భద్రతామండలి నుంచి ముగ్గురూ సమావేశమై ఒక అభ్యర్థిని నిర్ణయించాలి. అయితే ఇది అమలు చేస్తే ఫలితం, పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. సమితి నుంచి వచ్చే ముగ్గురూ భండారీ పేరుకే కట్టుబడి ఉన్నపక్షంలో ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలన్న సందేహాలు అందరిలోనూ తలె త్తాయి. దీన్ని ఆనవాయితీగా తీసుకుని శాశ్వతసభ్య దేశాలను భవిష్యత్తులో ఎవ రైనా సవాలు చేసే పరిస్థితి ఏర్పడొచ్చు. బహుశా ఈ ఆలోచనే శాశ్వతసభ్యుల్లో పునరాలోచన కలిగించినట్టుంది. అందువల్ల దాని జోలికి పోకుండా భారత్‌కు మద్దతు పలకడమే శ్రేయస్కరమని బ్రిటన్‌కు ఆ దేశాలన్నీ నచ్చజెప్పి ఉండొచ్చు. నిజానికి సమితిలో ఆఫ్రికా దేశాలకున్నట్టు మనకంటూ ప్రత్యేక గ్రూపు లేదు. ఆర్ధికంగా, అభివృద్ధిపరంగా అవి వెనకబడిన దేశాలే కావొచ్చుగానీ ఆ 54 దేశాలూ ఏ విషయంలోనైనా కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. ఏ పదవికైనా ఎన్ని కలొచ్చినప్పుడు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయి. ఇతర దేశాల ప్రతినిధులను కూడా సమీకరించి గెలిపించుకుంటాయి. భారత్ పరిస్థితి అలా కాదు. ఒకప్పటి బ్రిటన్ వలస దేశాలు సభ్యులుగా ఉన్న కామన్వెల్త్లో ఒక్కో దేశానిది ఒక్కో దారి. ఈ సంస్థలోని యూరప్ ఖండ దేశాలు సహజంగా బ్రిటన్‌కు మద్దతునిస్తాయి. ఆసియా, పసిఫిక్, దక్షిణ అమెరికా దేశాల్లో కూడా భిన్నా భిప్రాయాలుంటాయి. అటు ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) సభ్యదేశాలు కూడా సమైక్యంగా ఉంటాయి. ఆ దేశాలు బలపర్చడంవల్ల లెబనాన్‌కు చెందిన నవాఫ్ సలాం గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని, సంఖ్యాపరంగా చెప్పాలంటే 121 ఓట్లను చేజి క్కించుకుంది. జస్టిస్ భండారీ ఎన్నికతో ఐసీజేలో ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థ 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు అందులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పైగా ఆసియా నుంచి సంస్థకు ఈసారి నలుగురు న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. అసలు భద్రతామండలిలో అయిదు అగ్రరాజ్యాలకున్న శాశ్వతసభ్యత్వమే పరమ అప్రజాస్వామికమైనది. పైగా ఆ అయిదింటికీ వీటో అధికారముంది. ఇప్పుడు ఐసీజే ఓటింగ్‌ను కూడా అవి తల్చుకుంటే నిలిపివేసేవి. కానీ సమితిలో ఇంత భారీ యెత్తున మద్దతు లభించిన నిర్ణయానికి అడ్డు తగిలితే ఆ చర్య దేనికి దారి తీస్తుందోనన్న సందేహం ఏర్పడటంవల్ల అవి వెనకడుగేశాయి. ఈ ఎన్నిక మన దేశానికి కూడా మంచి అనుభవాన్నిచ్చింది. కీలక సమయాల్లో వర్ధమాన దేశాలతో కలిసి అడుగేస్తే, సమస్యలేర్పడినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ఆ దేశాలు దృఢంగా మన వెనకుంటాయని ఈ ఎన్నిక చాటిచెప్పింది. ఆ పరిస్థితుల్లో అగ్ర రాజ్యాలు కూడా వెనకడుగేయక తప్పదని రుజువైంది. ఆ కోణంలో జస్టిస్ భండారీ విజయం ఎన్నదగినది. -
ఐసీజేకి తిరిగి నామినేట్ అయిన జస్టిస్ భండారీ
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్ తన అభ్యర్థిగా మరోసారి సీనియర్ న్యాయమూర్తి జిస్టిస్ దల్వీర్ భండారీని నామినేట్ చేసింది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన గెలుపొందితే ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ వద్ద భారత్ నామినేషన్ దాఖలు చేసింది. 2012లో ఐరాస అసెంబ్లీ, భద్రతా మండలిలో ఏకకాలంలో జరిగిన ఓటింగ్‌లో 69 ఏళ్ల భండారీ ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఐసీజే జడ్జిగా భండారీ పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. -
భారత్ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా?
ఇస్లామాబాద్: కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో భారత్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందని పాకిస్థాన్ పేర్కొంది. సెప్టెంబర్‌లోగా ప్రతిస్పందన తెలియజేయాలంటూ భారత్‌కు ఆదేశించినట్లు వెల్లడించింది. ‘నెదర్లాండ్‌లోని మా కాన్సులేట్ ద్వారా మేం తెలుసుకున్న విషయం ఏమిటంటే కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ప్రతిస్పందన తెలియజేసేందుకు డిసెంబర్ వరకు పొడిగించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించింది. సెప్టెంబర్ 13లోగా తెలియజేయాలంటూ ఆదేశించింది’ అని పాక్ అటార్నీ జనరల్ అష్తర్ ఔషఫ్ అలీ చెప్పినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి అయిన కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మరణ శిక్షను విధించడంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పాక్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. -
‘పాకిస్థాన్ ఆ పని చేయదు’
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలనుకుంటున్న పాకిస్థాన్.. కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ న్యాస్థానం(ఐసీజే) దృష్టికి తీసకెళ్లనున్నట్లు వార్తలు వినవస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక ప్రకటన చేశారు. ‘ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు. పాకిస్థాన్ సైతం ఈ విషయంలో ఐసీజేకి వెళ్లదని భావిస్తున్నాం’ అని సుష్మ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కశ్మీర్ వివాదంతోపాటు తమ(విదేశాంగ) శాఖకు సంబంధించిన పలు విషయాలను ఆమె వెల్లడించారు. ‘పాకిస్థాన్‌తో ఎల్లప్పుడూ స్నేహాన్నే కోరుకుంటాం. కానీ.. విధ్వంసం, శాంతి ఒకే గొడుగుకింద మనలేవు. ఒక వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు చర్చలంటే సాధ్యమయ్యేపనికాదు. పాక్ తన ద్వంద్వవైఖరి వీడితే చర్చలకు భారత్ సిద్ధమే’ అని సుష్మా స్వరాజ్ అన్నారు. ఎన్నారైలు గతంలో కంటే ఇప్పుడు మాతృదేశంతో బాధవ్యాన్ని కొనసాగించగలుగుతున్నారని, గడిచిన మూడేళ్లలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 37.5 శాతం పెరిగిందని, సంక్షుభిత దేశాల్లో చిక్కుకుపోయిన 80 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని సుష్మా చెప్పారు. విదేశాంగ శాఖ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంలో తనకు సహకారం అందించిన ప్రధాని మోదీ, సహాయ మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్‌లకు సుష్మా ధన్యవాదాలు తెలిపారు. -
జాధవ్ కేసులో కొత్త లాయర్లు
ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాధవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిఫుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీజేలో జాధవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వెల్లడించారు. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం జాధవ్ మరణశిక్షను నిలుపుదల చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చే వరకూ మరణశిక్షను అమలు చేయవద్దని ఐసీజే ఆదేశించింది. జాధవ్ కేసులో ఎఫ్ఓ సక్రమంగా వ్యవహరించలేదని, ఈ కేసు కోసం బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఖావర్ ఖురేషీని ఎంచుకోవడాన్ని ప్రతిపక్షాలు, నిఫుణులు తప్పుపట్టారు. కాగా, జాధవ్ కేసులో పునర్విచారణ చేపట్టాలంటూ పాక్ ఐసీజేలో శుక్రవారం పిటిషన్ వేసింది. -
‘హేగ్’లో భారత్ గెలుపు
-
‘హేగ్’లో భారత్ గెలుపు
► అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ ► కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షపై స్టే ⇒ తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాక్‌కు ఆదేశం ⇒ జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయి ⇒ ఆయనకు దౌత్యపరమైన సాయం అందలేదు ⇒ ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. వియన్నా ఒప్పందానికి వ్యతిరేకం ⇒ జాధవ్‌కు దౌత్యపర సాయం అందేందుకు వీలు కల్పించాలిæ ⇒ భారత్‌కు దౌత్య విజయం.. దేశంలో సంబరాలు ⇒ ప్రధాని మోదీ హర్షం.. సుష్మాపై రాజ్‌నాథ్ ప్రశంసలు ⇒ ఐసీజే తీర్పును అంగీకరించబోమన్న పాక్ ⇒ అయినా ఆగస్టు వరకూ మరణశిక్ష అమలు చేయబోమని హామీ ⇒ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమన్న పాక్ న్యాయవాది ది హేగ్/న్యూఢిల్లీ కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణశిక్ష కేసులో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ తీరు సరిగా లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువరించేవరకు జాధవ్‌కు మరణశిక్షను అమలు చేయరాదని ఆదేశిస్తూ.. స్టే విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాకిస్తాన్ తప్పుబట్టింది. ఈ తీర్పును తాము అంగీకరించబోవడం లేదని పేర్కొంది. అయితే ఆగస్టు వరకూ జాధవ్‌కు మరణశిక్షను అమలుచేయబోమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్థాన్ తరఫు న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఇక జాధవ్ మరణశిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. జాధవ్‌ను రక్షించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఐసీజే ధర్మాసనం తీర్పు భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)కు గూఢచర్యం కేసులో పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి. పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది. అరెస్టు పరిస్థితులూ వివాదాస్పదం.. జాధవ్ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం పేర్కొన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం (1977లో భారత్–పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) కుల్‌భూషణ్ జాధవ్‌కు భారత్ దౌత్యపరమైన సాయం చేసేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. తుది తీర్పు ఇచ్చేంతవరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించారు. ఇక దౌత్యపరమైన సాయానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాధవ్ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని స్పష్టమైందని ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ భండారి (భారత్) పేర్కొన్నారు. జాధవ్‌ను అరెస్టు చేసినప్పటినుంచి మరణశిక్ష విధించేవరకు కూడా దౌత్యపరమైన సాయానికి అనుమతించాలంటూ భారత ప్రభుత్వం 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరణకు గురైందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించారు. కోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఆగస్టు వరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుచేయమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్తాన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా.. జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతకుముందే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఐసీజే లేఖ రాసింది. సుష్మా చొరవ భేష్! ఐసీజే తీర్పుపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కీలకంగా వ్యవహరించి భారత్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్ సాల్వేను అభినందించారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను కాపాడటంలో ప్రతి చిన్న అవకాశాన్నీ వినియోగించుకుంటామని సుష్మాస్వరాజ్ ట్వీటర్లో ట్వీట్ చేయగా.. మోదీ దానిని రీట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్ తప్పు చేసినట్లు తేలిపోయింది. వియన్నా ఒప్పందం ప్రకారం వారు జాధవ్‌కు దౌత్య సాయం అందించాల్సిందే..’’అని మోదీ పేర్కొన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. భారతీయులంతా ఈ తీర్పుపై ఆనందంగా ఉన్నారని, ఈ కేసులో సుష్మా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అభినందించారు. న్యాయవ్యవస్థ పేరుతో పాక్‌లో జరుగుతున్న అపహాస్యానికి ఈ తీర్పు ఎదురుదెబ్బ అని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పాక్ ఐసీజే తీర్పును అంగీకరించబోమంటే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని... ఆ దేశం తనను తాను మరింత తప్పులోకి నెట్టేసుకున్నట్లేనని చెప్పారు. వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. ఇది భారత్‌కు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పు ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కల్పించిందని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే చెప్పారు. ‘40 ఏళ్లుగా న్యాయవాదిగా ఉన్నాను. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారో అర్థమవుతుంది. కేసు వాదిస్తున్నప్పుడే పాజిటివ్‌గా అనిపించింది. ఆ పాజిటివ్ శక్తే న్యాయమూర్తులతో అనుసంధానం చేసింది’అని పేర్కొన్నారు. జాధవ్ మిత్రుల సంబరాలు జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టే విధించటంతో జాధవ్ మిత్రులు సంబరాలు చేసుకున్నారు. ముంబైలో లోయర్ పరేల్‌లోని సిల్వర్ ఓక్ అపార్ట్మెంట్ వద్ద టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశారు. ‘125 కోట్ల భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఐసీజేకు ధన్యవాదాలు’అని జాధవ్ బాల్యమిత్రుడొకరు పేర్కొన్నారు. జాధవ్ క్షేమంగా తిరిగొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తీర్పును అంగీకరించబోం: పాక్ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను షాక్‌కు గురిచేసిందని.. తమ దేశ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో ఐసీజే తీర్పును అంగీకరించడం లేదని పేర్కొంది. జాధవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లడం ద్వారా అసలురంగు బయటపడకుండా భారత్ జాగ్రత్తపడుతోందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా విమర్శించారు. ‘‘భారత్ పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి ఆర్థికసాయం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే జాధవ్ కేసులో మానవ హక్కుల ఉల్లంఘనను తెరపైకి తెచ్చింది..’’అని వ్యాఖ్యానించారు. ఇక జాధవ్ మరణశిక్ష అమలుపై స్టే విధించే హక్కు ఐసీజేకు లేదని పాక్ న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. ఐసీజేలో పాకిస్తాన్ వాదన సరిగా లేకపోవడమే పాక్‌కు వ్యతిరేకంగా తీర్పు రావటానికి కారణమైందని పేర్కొన్నారు. ‘‘జాధవ్ కేసును వాదిస్తున్న న్యాయవాదులకు కనీస అనుభవం లేదు. కోర్టు ఇచ్చిన 90 నిమిషాల్లో సరైన వాదనలు వినిపించలేక పోయారు. పాక్ వాదనలో పసలేదు.’’అని ఆ దేశ మాజీ అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ వ్యాఖ్యానించారు. కోర్టులో విచారణ తీరు ఇలా... భారతీయ నావికాదళ మాజీ అధికారి కులభూషణ్జాధవ్ విషయంలో పాకిస్తాన్ వెలిబుచ్చిన అభ్యంతరాలను అంతర్జాతీయ న్యాయస్థానం హేతుబద్ధమైన వాదనలతో తిప్పికొట్టింది. అదెలా సాగిందంటే... ♦ అంతర్జాతీయ న్యాయస్థానం ముందుగా తనకు ఈ కేసును విచారించే పరిధి ఉందా? లేదా? అన్న అంశాన్ని చేపట్టింది. వియన్నా ఒప్పందం ఆప్షనల్ ప్రొటోకాల్ ఆర్టికల్ ఒకటి ప్రకారం... ఒప్పందం అమలులో ఏర్పడే వివాదాలపై కూడా విచారించే పరిధి ఐసీజేకు ఉంటుంది. భారత్ ఇందుకు అంగీకరిస్తే... పాక్ విభేదించింది. అయితే జాధవ్ అరెస్ట్ విషయాన్ని పాక్ తమకు తెలపలేదని, అతడితో మాట్లాడేందుకు దౌత్యవేత్తలనూ అనుమతించలేదని భారత్ చెప్పడాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ విషయంలో వివాదమున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఈ కేసును విచారించే పరిధి తమకు ఉన్నట్లేనని ఐసీజే స్పష్టం చేసింది. ♦ పాకిస్తాన్ దౌత్య పరంగా తమ హక్కులను ఉల్లంఘించిందన్న భారత్ ఆరోపణలు ఆమోదయోగ్యమైనవేనని ఐసీజే స్పష్టం చేసింది. ఇతర దేశాల పౌరులను అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని వీలైనంత తొందరగా ఆ దేశ దౌత్య కార్యాలయానికి తెలపడం, దౌత్య సిబ్బందితో మాట్లాడే అవకాశం కల్పించడం అనేవి పౌరుడిని అరెస్ట్ చేసిన దేశం బాధ్యతలు. జాధవ్ విషయంలో పాక్ వీటిని అమలు చేయకపోవడం భారత్‌కు ఉన్న హక్కులను ఉల్లంఘించడమే. ♦ జాదవ్‌కు ఉరిశిక్ష విధించారనీ, దీన్ని ఎప్పుడైనా అమలు చేయవచ్చునన్న అంశం ఈ కేసును అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని చెబుతోందని ఐసీజే తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులోపు అతడిని ఉరితీయబోమని పాకిస్తాన్ పరోక్షంగా సూచించినప్పటికీ ఆ తరువాత ఎప్పుడైనా శిక్ష అమలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసును అత్యవసరంగా విచారించి తీర్పునిస్తున్నట్లు ఐసీజే తెలిపింది. విచారణ ఆలస్యమైతే సరిదిద్దలేని అన్యాయం జరిగే అవకాశముందని అభిప్రాయపడింది. -
నేడు కుల్‌భూషణ్ కేసుపై తీర్పు