సాక్షి, న్యూఢిల్లీ : కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే) ఇచ్చిన తీర్పుతో పాకిస్తాన్ పలు సందర్భాల్లో వియన్నా తీర్మానాన్ని ఉల్లంఘించిందన్న భారత్ వాదనను న్యాయస్ధానం సమర్ధించిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు అన్ని చర్యలూ చేపడతామని 2017లో సభకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు.
జాదవ్ కేసును పునఃసమీక్షించాలని, భారత్ తరపున న్యాయవాదిని అనుమతించాలని ఐసీజే పాక్‌కు స్పష్టం చేసిందని మంత్రి గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ వివరించారు. కుల్‌భూషణ్‌ను విడుదల చేసి తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను తాము మరోసారి కోరుతున్నామని అన్నారు. కాగా అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్‌కు బుధవారం భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.
గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్ వాదించింది. గూఢచర్యం కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్ పదునైన వాదన వినిపించడంతో సానుకూల తీర్పు వెలువడింది. ఐసీజేలో ఈకేసుకు సంబంధించి 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయమూర్తులు భారత్ వాదనతో ఏకీభవించారు. కేసును పునసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్ధానం పాకిస్తాన్‌కు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment