kulbhushan jadav
-
కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో మగ్గుతన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు అతనికి అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. 2017లో.. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌పై పాక్ ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి ఆరోపణలు మోపిన పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుని భారత్ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్ చేసింది. దీంతో ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) తీర్పుకు సంబంధించి భారత ఖైదీ కులభూషణ్ జాదవ్‌కు అప్పీలు చేసుకునే హక్కును కల్పించే బిల్లును పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. 2020లో, ప్రతిపక్ష పార్టీల నిరసనలు ఉన్నప్పటికీ, కులభూషణ్ జాదవ్ విషయంలో ఐసీజే తీర్పును దృష్టిలో ఉంచుకుని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్‌ను సమర్పించింది. దీని ప్రకారం.. 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ ఆర్డినెన్స్ 2020' గతేడాది మే 20న అమల్లోకి వచ్చింది. చదవండి: చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్‌గా మార్చింది! -
‘కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదల చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే) ఇచ్చిన తీర్పుతో పాకిస్తాన్ పలు సందర్భాల్లో వియన్నా తీర్మానాన్ని ఉల్లంఘించిందన్న భారత్ వాదనను న్యాయస్ధానం సమర్ధించిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు అన్ని చర్యలూ చేపడతామని 2017లో సభకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. జాదవ్ కేసును పునఃసమీక్షించాలని, భారత్ తరపున న్యాయవాదిని అనుమతించాలని ఐసీజే పాక్‌కు స్పష్టం చేసిందని మంత్రి గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ వివరించారు. కుల్‌భూషణ్‌ను విడుదల చేసి తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను తాము మరోసారి కోరుతున్నామని అన్నారు. కాగా అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్‌కు బుధవారం భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్ వాదించింది. గూఢచర్యం కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్ పదునైన వాదన వినిపించడంతో సానుకూల తీర్పు వెలువడింది. ఐసీజేలో ఈకేసుకు సంబంధించి 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయమూర్తులు భారత్ వాదనతో ఏకీభవించారు. కేసును పునసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్ధానం పాకిస్తాన్‌కు సూచించింది. -
జాదవ్ కేసులో త్వరలో తుదితీర్పు
హేగ్ : కుల్‌భూషణ్ జాదవ్ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానం ఆగస్టులో తుది తీర్పు వెలువరించనుంది. జాదవ్ కేసులోఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. భారత్‌కు చెందిన జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఇరాన్ నుంచి అపహరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కోర్టు గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవహరించి జాదవ్‌పై గూఢచర్య అభియోగాలు మోపిందని భారత్ ఆరోపిస్తోంది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. -
'జాదవ్ కిడ్నాప్‌కు ఉగ్రవాదులకు కోట్లిచ్చారు'
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దేశ పూర్వకంగానే భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ కిడ్నాప్ చేసినట్లు మరోసారి స్పష్టమైంది. కోట్లు చెల్లించి ఆయనను పాక్ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మామా ఖదీర్ అనే బలోచిస్తాన్‌కు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు ఈ విషయం వెల్లడించారు. 'ఇరాన్ నుంచి ముల్లా ఓమర్ అనే ఉగ్రవాది కులభూషణ్ జాదవ్‌ను కిడ్నాప్ చేశాడు. పాకిస్థాన్ కోట్లలో డబ్బులు ఇవ్వడంతోపాటు ఆదేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ పనిజరిగింది. ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిన జాదవ్‌ను ఇస్లామాబాద్‌కు క్వెట్టా మీదుగా తీసుకెళ్లి తీవ్రంగా అతడిని హింసించారు. అలా ఆయనతో తమ దేశానికి అనుకూలమైన ప్రకటనలు చెప్పించడం పాక్ మొదలుపెట్టింది. బలోచిస్తాన్లో ఎవరు అదృశ్యం అయినా, హత్యకు గురైనా దాని వెనుక పాకిస్థాన్, దాని సంస్థ ఐఎస్ఐ హస్తం ఉంటుంది' అని ఆయన అన్నారు. -
జాదవ్ కేసులో సంచలన విషయం వెలుగులోకి..
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ నోటికి తాళం వేసే ఆధారాలను భారత రక్షణ విభాగం సంపాధించింది. కులభూషణ్ జాదవ్‌ను అక్రమంగా పాకిస్థాన్ తమ దేశంలో బంధించిందని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కావాల్సిన ఆధారాలను తాజాగా ప్రకటించింది. జాదవ్‌ను పాక్ ఆర్మీకి అత్యంత సన్నిహితంగా ఉండే జైషే ఉల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థ ఇరాన్లో కిడ్నాప్ చేసి పాక్‌కు అప్పగించినట్లు తమ వద్ద ఆధారాలున్నట్లు భారత్ ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం జైషే ఉల్లో పనిచేసే ముల్లా ఒమర్ అనే ఇరానీ సంతతి ఉగ్రవాది చబహార్ అనే ప్రాంతంలో జాదవ్‌ను అక్రమంగా కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీకి అప్పగించాడు. జైషే ఉల్ అదల్ అనేది జమాత్ ఉద్ దవా, లష్కరే ఈ ఖురాసన్ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించడమే కాకుండా పాక్ ఆర్మీకి సాయం చేస్తూ ఇరాన్, బహ్రెయిన్‌లోని పాక్ రాయబార కార్యాలయాల్లో డబ్బు తీసుకుంటూ పనిచేస్తుంది. ముఖ్యంగా వీరు బలుచీస్థాన్ పోరాట వీరులను అణిచివేసేందుకు పాక్ ఆర్మీతో కలిసి అతి క్రూరంగా సామాన్యులను చంపేసేవారని కూడా తెలిసింది. జాదవ్ తమకు ధన్యవాదాలు చెప్పినట్లు పాక్ మోసపూరిత వీడియోను విడుదల చేసిన రోజే భారత్ ఈ విషయాన్ని బయటపెట్టి పాక్ ఆటకట్టించినంత పనిచేసింది. -
దారుణం.. అమానవీయం!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ కుటుంబసభ్యులతో పాక్ అత్యంత అమానవీయంగా, దారుణంగా వ్యవహరించిందని భారత్ విమర్శించింది. జాధవ్‌ను కలుసుకోవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనల సంప్రదాయాలను, భావోద్వేగాలను అవమానించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. కుటుంబసభ్యులపై పాక్ తీరును గర్హిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ఒక ప్రకటన చేశారు. ‘భద్రత పేరుతో అక్కడి అధికారులు జాధవ్ తల్లి అవంతి, భార్య చేతన ధరించిన తాళి, గాజులు, బొట్టు బలవంతంగా తీసేయించారు. కెమెరాలు, చిప్‌లు ఉన్నాయనే అనుమానంతో చేతన ధరించిన చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారు. చీర బదులు సల్వార్‌కమీజ్ ధరించాలంటూ జాధవ్ తల్లిని బలవంతపెట్టారు. మంగళసూత్రం, బొట్టు, గాజులు తీయించడం ఎంత అమానవీయం. భారతీయ మహిళకు ఇంతకంటే అవమానం ఇంకేదైనా ఉంటుందా?’ అని ఆవేదనగా ప్రశ్నించారు. జాధవ్ చాలా అలసిపోయినట్లుగా, వ్యాకులతతో కనిపించారని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. తల్లితో మాతృభాష మరాఠీలో కూడా మాట్లాడనివ్వలేదన్నారు. దీనిపై ఆ దేశ అధికారులకు తీవ్ర నిరసన తెలిపామన్నారు. జాధవ్‌పై పాక్ చేసిన ఆరోపణలను తప్పని నిరూపించి అతన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. గూఢచర్యం ఆరోపణలతో జాధవ్‌ను నిర్బంధించిన పాకిస్తాన్ అతడికి మరణశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ అంశం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం తల్లి, భార్యకు ఇస్లామాబాద్‌లోని అత్యంత భద్రత ఉండే విదేశాంగ శాఖ కార్యాలయంలో మాట్లాడే అవకాశం ఇచ్చింది. హెగ్డే క్షమాపణలు.. లౌకికవాదులు, రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలుపుతూ గురువారం కేంద్ర మంత్రి హెగ్డే లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ‘కర్ణాటకలో నేను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారు. రాజ్యాంగంపై, బీఆర్ అంబేద్కర్‌పై నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలతో ఎవరైనా మనస్తాపం చెందితే వారికి క్షమాపణ చెబుతున్నా’ అంటూ ముగించారు. అయితే, హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. మంత్రి హెగ్డే లోక్‌సభలో క్షమాపణ చెప్పారని, ఆందోళనలు విరమించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్ గోయెల్ కోరినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. చివరికి ఆందోళనల మధ్యే సభ శుక్రవారానికి వాయిదాపడింది. నాన్న ఎలా ఉన్నారు? మంగళసూత్రం, బొట్టు, గాజులు లేకుండా వచ్చిన తల్లిని చూడగానే జాధవ్ ఆందోళనకు గురయ్యారని, ‘అమ్మా.. నాన్నకేమయింది’ అని ఆత్రుతగా అడిగారని అవంతి తనతో అన్నారని సుష్మా చెప్పారు. భద్రత పేరుతో ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్నీ పాక్ కుట్రపూరితంగా, ఒక ప్రచారాస్త్రంగా మలిచింది. వారి దుశ్చర్యలను వివరించేందుకు మాటల్లేవు’ అన్నారు. ఒకవేళ షూస్‌లో రికార్డర్ లేదా చిప్ ఉంటే ఢిల్లీ, దుబాయ్, పాకిస్తాన్ విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా బయటపడేవి కావా? అని సుష్మా ప్రశ్నించారు. -
ఆమె షూలో ఏదో ఉంది..!
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల విషయంలో పాకిస్థాన్ అధికారులు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి కట్టుకథలు చెప్పేందుకు పాక్ సిద్ధమైంది. తాము కావాలని జాదవ్ భార్య షూను విప్పించలేదని, ఆమె షూలో ఏదో వస్తువు ఉన్నట్లు తాము గుర్తించిన నేపథ్యంలో దానిని పరిశీలించేందుకు తీయించామని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారిక ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. ’ఆమె షూలో ఏదో ఉంది. దానిని మేం పరిశీలిస్తున్నాం. అయితే, జాదవ్ భార్యకు ఆ షూ స్థానంలో కొత్త షూ ఇచ్చాం. అలాగే ఆమె ఆభరణాలు ఇతర వస్తువులు తిరిగి ఇచ్చేశాం. ఇక జాదవ్ కుటుంబ సభ్యులను వేధించామని భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. అయిన భారత్ చేసే ఇలాంటి ఆరోపణలు మేం పట్టించుకోం’ అని ఫైజల్ అన్నారు. గూఢచర్యం కేసును మోపి అరెస్టు చేసిన కారణంగా ప్రస్తుతం భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్ పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను కలిసేందుకు భార్య, తల్లి వెళ్లగా వారి తాళి, బొట్టు, గాజులు, షూ కూడా తీయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. -
తాళి, బొట్టు తీయించారు
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్, అతని కుటుంబ సభ్యుల సమావేశం ఆద్యంతం పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పట్ల భారత్ తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ భేటీకి సంబంధించి ఇరు దేశాలు ముందుగా ఏర్పరచుకున్న అవగాహనలను, స్ఫూర్తిని పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. సమావేశాన్ని స్వేచ్ఛా వాతావరణంలో కాకుండా అడుగడుగునా కట్టదిట్టమైన నియంత్రణలతో నిర్వహించారని తెలిపింది. గూఢచర్య కేసులో పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ సోమవారం ఇస్తామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయంలో తన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ను కలిశారు. అయితే, జాధవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు, వేధింపులకు గురవుతున్నట్లు కనిపించారని భారత్ పేర్కొంది. జాధవ్ పరిస్థితిని చూస్తే ఆయన ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపిస్తోందని ఆనుమానం వ్యక్తంచేసింది. ‘పాక్ చాలా దారుణంగా వ్యవహరించింది. జాధవ్‌ను కలవడానికి వెళ్లే ముందు అతని తల్లి, భార్య మంగళసూత్రాలు, గాజులు, బొట్టును తొలగించారు. దుస్తులు మార్చుకోమన్నారు. మహిళల మత, సంప్రదాయ విలువలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. పాక్ విడుదల చేసిన వీడియోలో జాధవ్ మాట్లాడిన మాటలు కూడా ఎవరో అల్లిన కట్టుకథలా ఉన్నాయి. తాను పాక్‌లో భారత గూఢచారిగా పనిచేసినట్లు బెదిరించి ఆయనతో చెప్పించారు. జాధవ్æ భార్య, తల్లితో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలో అతని చెవి, మెడ వద్ద గాయాలు కన్పించాయి. దీన్ని బట్టి చూస్తే జాధవ్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో ఆక్షేపించింది. ‘సమావేశం జరిగిన తీరు భయానకంగా ఉంది. జాధవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అయితే వారు ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంతో, సాహసంతో ఎదుర్కొన్నారు’ అని తెలిపింది. జాధవ్ తల్లిని మాతృ భాష మరాఠీలో మాట్లాడనివ్వలేదని, ఆమెకు అడ్డుతగిలారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశం అనంతరం జాధవ్ భార్య తన బూట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియాను లోనికి అనుమతించకూడదనే నిబంధనను పాటించలేదని, పాక్ విలేకరులు పదే పదే జాధవ్ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అనవసర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని భారత్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, జాధవ్ కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను మంగళవారం కలిశారు. భారతీయులకు అవమానం: కాంగ్రెస్ జాధవ్, అతని కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో అవలంబిస్తున్న అసంబద్ధ, ఊగిసలాట ధోరణి వల్ల అనిశ్చిత వాతావరణం నెలకొంది’ అని కాంగ్రెస్ విమర్శించింది. -
ఒకరిది పేగుబంధం.. మరొకరిది కట్టుకున్న బంధం
-
కులభూషణ్ తల్లి, భార్య రియాక్షన్ చూశారా..
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్ భార్య, తల్లి పాకిస్థాన్ జైలులో కలుసుకున్నారు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను కలిసి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. తొలుత భారత్ నుంచి పాక్ రాయబార కార్యాలయంలో ఎదురుచూసిన వారు అనంతరం ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వారితో భారత హైకమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట పాక్ జాదవ్ ను అరెస్టు చేసి జైలులో వేసిన విషయం తెలసిందే. దీంతోపాటు అతడికి ఉరి శిక్షను కూడా విధించింది. అయితే, దీనిని వెంటనే అమలు చేయాలనుకున్న పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా పాక్‌ను నిందించేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత అసలు జాదవ్‌ను కలిసేందుకు వీలే లేదంటూ చెప్పిన పాక్ భవిష్యత్‌లో ఎదురవ్వబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెనక్కు తగ్గింది. ఇటీవలె జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత హైకమిషన్ అధికారి జేపీ సింగ్‌తో సహా జాదవ్ తల్లి, భార్య పాక్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి జాదవ్‌ను జైలులో అరగంటపాటు కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పాక్ విడుదల చేసింది. ఇదే రోజు సాయంత్రం జాదవ్ తల్లి, భార్య భారత్‌కు తిరిగి రానున్నారు. -
దయచూపని పాకిస్థాన్..
- జాదవ్ తల్లికి వీసాకు నో... మండిపడ్డ సుష్మా స్వరాజ్ న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ తల్లి అవంతికకు పాకిస్థాన్ వీసా నిరాకరించడంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. అవంతికా జాదవ్‌కు వీసా ఇవ్వాలని స్వయంగా తానే పాకిస్థాన్‌ను కోరినా ఆ దేశం మాత్రం స్పందించడం లేదని సుష్మ ఆదివారం విమర్శించారు. తన కుమారున్ని చూడాలనుకుంటున్న జాదవ్ తల్లికి పాక్ వీసా ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే ఓ పాకిస్థానీకి మాత్రం తాను మెడికల్ వీసా ఇప్పించినట్లు ఆమె ట్వీట్ చేశారు. మెడికల్ వీసా కోరుకుంటున్న పాకిస్థానీల పట్ల తనకు సానుభూతి ఉందని, పాక్ మాత్రం ఇదే విధంగా స్పందించడం లేదన్నారు. పాక్ విదేశాంగమంత్రి సర్తాజ్ అజీజ్‌కు లేఖ రాసినా ఆయన కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. గత ఏడాది జాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేయడం తెలిసిందే. దేశద్రోహం కేసులో పాక్ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్‌కు చెందిన ఫైజా తన్వీర్ అనే తనకు మెడికల్ వీసా ఇప్పించాలని ట్విటర్ ద్వారా సుష్మ కోరారు. ఇందుకు ఆమె అనుకూలంగా స్పందించారు. ఏటా ఏడాది దాదాపు 500 మంది పాకిస్థానీలు వైద్యం కోసం భారత్ వస్తున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని నౌగాం సెక్టార్ నుంచి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపింది. ఆదివారం రాత్రి నౌగాం సెక్టార్ అనుమానిత కదలికలను గుర్తించామని సైనిక విభాగం అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు. , భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మరణించారని చెప్పారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకుగాను అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సమస్యలూ పరిష్కారం కావాలి : పాక్ ఇస్లామాబాద్: కశ్మీర్ సహా అన్ని అంశాలపై భారత్‌తో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరీలు స్వాతంత్య్రం పొందే వరకు వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అం దిస్తామని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ప్రకటించారు. ఆదివారం ఆయన ఒక వార్తా చానెల్‌తో మాట్లాడుతూ కశ్మీరీ లకు భారత్ విముక్తి కల్పించాలని సూచించారు. గత ఏడాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మృతి తరువాత కశ్మీరీలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయం టూ అజీజ్ భారత్‌పై మండిపడ్డారు.