
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్ భార్య, తల్లి పాకిస్థాన్ జైలులో కలుసుకున్నారు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను కలిసి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. తొలుత భారత్ నుంచి పాక్ రాయబార కార్యాలయంలో ఎదురుచూసిన వారు అనంతరం ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వారితో భారత హైకమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట పాక్ జాదవ్ ను అరెస్టు చేసి జైలులో వేసిన విషయం తెలసిందే. దీంతోపాటు అతడికి ఉరి శిక్షను కూడా విధించింది.
అయితే, దీనిని వెంటనే అమలు చేయాలనుకున్న పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా పాక్‌ను నిందించేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత అసలు జాదవ్‌ను కలిసేందుకు వీలే లేదంటూ చెప్పిన పాక్ భవిష్యత్‌లో ఎదురవ్వబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెనక్కు తగ్గింది. ఇటీవలె జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత హైకమిషన్ అధికారి జేపీ సింగ్‌తో సహా జాదవ్ తల్లి, భార్య పాక్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి జాదవ్‌ను జైలులో అరగంటపాటు కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పాక్ విడుదల చేసింది. ఇదే రోజు సాయంత్రం జాదవ్ తల్లి, భార్య భారత్‌కు తిరిగి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment