sentenced to death
-
రియల్ ఎస్టేట్ క్వీన్‌కు మరణశిక్ష.. ఈమె చేసిన నేరం ఏంటంటే..
వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్‌కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది. ఇవీ అభియోగాలు వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్‌లో భాగంగా 2022 అక్టోబరులో లాన్‌ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్‌లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్‌హౌస్‌ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. -
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని జరిగిన 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్ ముజాహిదీన్ ముష్కరులకు మరణశిక్ష పడింది. వాళ్లను చనిపోయేదాకా ఉరి తీయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్ పటేల్ ఆదేశించారు. మరో 11 మందికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన 7,000 పేజీల పై చిలుకు తీర్పు వెలువరించారు. ఒకే కేసులో ఏకంగా ఇంతమందికి మరణ శిక్ష పడటం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో 26 మందికి మరణ శిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు. ఈ పేలుళ్ల ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ తీర్పు అనంతరం మీడియాకు చెప్పారు. 2010లో నమోదు చేసిన చార్జిషీట్లో ఒక నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఆయన వివరించారు. ఈ విషయాన్ని జడ్జి తన తీర్పులో కూడా పొందుపరిచారని చెప్పారు. ‘‘పేలుళ్ల ద్వారా మోదీని కూడా చంపాలని కుట్రదారులు ప్రయత్నించారని జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. నాటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు అప్పటి మోదీ మంత్రివర్గ సహచరులు ఆనందీబెన్ పటేల్, నితిన్ పటేల్, స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్‌సింగ్ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్ అని వివరించారు’’ అని ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు విచారణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2009లో విచారణ మొదలైంది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 78 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు 2019లో అప్రూవర్‌గా మారారు 49 మందిని దోషులుగా ఫిబ్రవరి 8న కోర్టు తేల్చింది. మరో 28 మందిని వదిలేసింది. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, మరొకరికి రూ.2.88 లక్షలు జరిమానా విధించారు. మరణశిక్ష పడ్డ వాళ్లలో ప్రధాన కుట్రదారులైన మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్ నగోరీ, కమ్రుద్దీన్ నగోరీ, గుజరాత్‌కు చెందిన ఖయాముద్దీన్ కపాడియా, జహీద్ షేక్, షంషుద్దీన్ షేక్ తదితరులున్నారు. తీర్పు వెలువడ్డాక ప్రధాన కుట్రదారు సఫ్దర్ నగోరీలో పశ్చాత్తాప ఏ మాత్రమూ కన్పించలేదని పోలీసులు చెప్పారు. అతను ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని దోషుల తరఫున లాయర్లు తెలిపారు. ఏం జరిగింది? ∙2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వరుస బాంబు పేలుళ్లు వణికించాయి. ∙సాయంత్రం 6.45 నుంచి గంటంపావు పాటు 14 చోట్ల 21 పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోయింది. ∙56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మరో రెండు బాంబులు పేలలేదు. ∙ఇది తమ పనేనని సిమి కనుసన్నల్లో నడిచే ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది. ∙తర్వాత రెండు రోజుల్లో సూరత్‌లో 29 లైవ్ బాంబులు దొరకగా నిర్వీర్యం చేశారు. ∙2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు నిందితులు పేర్కొన్నారు. ∙పేలుళ్ల కుట్ర 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో అడవుల్లో ఐఎం క్యాంపులో జరిగింది. ∙దేశవ్యాప్తంగా రిక్రూట్ చేసుకున్న 50 మందికి అక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ∙పేలుళ్లకు పాల్పడుతున్నట్టు సరిగ్గా 5 నిమిషాల ముందు మీడియా సంస్థలకు ఉగ్రవాదులు ఇ–మెయిళ్లు పంపారు. విచారణ–విశేషాలు ∙అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్ఐఆర్లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్ఐఆర్లను కలిపి విచారణ చేపట్టారు. ∙ప్రస్తుత గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా సారథ్యంలో విచారణ మొదలైంది. ∙విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. బేలా త్రివేది నుంచి ఏఆర్ పటేల్ దాకా మొత్తం 9 మంది జడ్జీలు విచారణ జరిపారు. ∙నిందితుల్లో 24 మంది 213 అడుగుల సొరంగం తవ్వి పారిపోయే ప్రయత్నం చేశారు. -
దైవాన్ని దూషించిందని మహిళా ప్రిన్సిపాల్‌కు మరణ శిక్ష
ఇస్లామాబాద్: ప్రవక్త ముహమ్మద్ తర్వాత తదుపరి ప్రవక్త తానేనని ప్రకటించుకున్నందుకు పాకిస్తాన్లో ఓ మహిళకు మరణశిక్ష విధించారు.ఈ కేసులో.. ఆ మహిళ దైవదూషణకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి మన్సూర్ అహ్మద్ తుది తీర్పుని వెలువడించారు. వివరాల్లోకి వెళితే.. నిష్టార్ కాలనీలోని ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ సల్మా తన్వీర్ ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్ కాదనేలా తానే తదుపరి ప్రవక్తనంటూ ప్రకటించుకుంది. దీంతో స్థానిక మతాధికారి ఫిర్యాదుపై లాహోర్ పోలీసులు 2013లో తన్వీర్‌పై దైవదూషణ కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాది ముహమ్మద్ రంజాన్ తన క్లయింట్‌కు మతి స్థిమితం లేదని కోర్టు ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. అయితే, ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, మెడికల్ బోర్డ్ నివేదికలో.. ఆమె మానసిక స్థితిపరంగా బాగానే ఉందని తెలిపింది. దీంతో ఆమె చేసిన ప్రకటన దైవదూషణగా పరిగణిస్తూ తన్వీర్‌కు కోర్టు ఉరి శిక్ష విధించింది. దాంటోపాటు రూ.5 వేలు (పాకిస్తాన్ కరెన్సీలో) జరిమానా కూడా విధించింది. పాకిస్తాన్లో వివాదాస్పద దైవదూషణ చట్టాలు వాటికి నిర్దేశించిన శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1987 నుంచి అక్కడ దైవదూషణ చట్టం కింద కనీసం 1,472 మందిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: China: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై వందమంది చైనా సైనికులు -
నటి దారుణ హత్య.. 47 కత్తిపోట్లు: నిందితుడికి ఉరిశిక్ష
వాషింగ్టన్/కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్‌తో పాటు మరో మహిళను హత్య చేసినందుకు గాను ‘హాలీవుడ్ రిప్పర్’గా ప్రసిద్ధి చెందిన మైఖెల్ గార్గిలోకు లాస్ ఏంజిల్స్ కోర్టు మరణశిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ నేరాలతో పాటు మరో హత్యాయత్నం కేసులో 2019లోనే మైఖెల్ దోషిగా తేలాడు. ఈ క్రమంలో కోర్టు 2021, జూలైలో అతడికి మరణ శిక్ష విధించింది. నిందితుడు మైఖెల్.. హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 'హాలీవుడ్ రిప్పర్'గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22) నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన నాటి రాత్రి ఆష్లే, తన సహానటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి వెళ్లిపోయాడు కుచర్. ఆ మరసుటి రోజు ఎల్లరిన్ శవాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలో నటుడు కుచర్ ఈ కేసులో ముఖ్య సాక్షిగా మారాడు. ఆ తర్వాత మైఖెల్ 2005లో మారియా బ్రూనో(32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు. బ్రూనో హత్య జరిగిన మూడేళ్ల తర్వాత అనగా 2008, జూన్‌లో మైఖేల్ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు. ఆమె ఇంట్లో ప్రవేశించి.. కత్తితో దాడి చేసి హత్య చేయాలని భావించాడు. కానీ అదృష్టవశాత్తు మర్ఫీ తప్పించుకున్నారు. అనంతరం మర్ఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైఖెల్ నేరాలు వెలుగు చూశాయి. ఇక మర్ఫీపై దాడి తరువాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ సంఘటనా స్థలంలో మైఖేల్ రక్తం ఉండటంతో దాని ఆధారంగా శాంటమోనికా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మర్ఫీ ఈ కేసులో ప్రధాన సాక్ష్యిగా ఉన్నారు. రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైఖేల్ విచారణ సందర్భంగా తాను అమాయకుడినకని కోర్టుకు తెలిపేవాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి మైఖెల్‌కు మరణశిక్ష విధించింది. కాకపోతే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలుపై నిషేధం ఉంది. 2006 తరువాత కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైఖేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఇల్లినాయిస్లో ఈ కేసు విచారణ జరిగింది. -
11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష
పట్నా: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి స్కూల్ టీచర్ అభిషేక్ కుమార్ కూడా సహకరించాడు. కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి నేడు పాట్నా కోర్టు ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. చదవండి: యువకుడి మోసం.. మైనర్ బాలిక ప్రసవం -
రహస్య గది.., 9 హత్యలు
టోక్యో: తొమ్మిదిమంది అమాయకులను హతమార్చిన ‘ట్విటర్ కిల్లర్’ తకాహిరొ షిరాయిషికి టోక్యో కోర్టు మంగళవారం మరణ దండన విధించింది. నిందితుడి తరపు లాయర్ వాదనలు తోసిపుచ్చింది. ఒక మనిషిని ‘వారి సమ్మతితోనే ప్రాణాలు తీశాడు అనడం’అర్థ రహితమని కొట్టి పడేసింది. వివరాలు. తకాహిరొ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విటర్లో పరిచయం చేసుకున్నాడు. వారి జీవిత విశేషాలను తెలుసుకుని, సమస్యలేవైనా ఉంటే సాయం చేస్తానని చెప్పాడు. అలా జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్న తొమ్మిది మందితో స్నేహం చేశాడు. తాను కూడా జీవితాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను అని నమ్మబలికాడు. కలిసి చనిపోదామని చెప్పి.. ముందుగా వారి ప్రాణాలు తీశాడు. అలా ఒక్కొక్కరుగా 9 మందిని చంపేశాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు పోలీసుల విచారణలో తేలింది. తకాహిరొపై ఓ అత్యాచారం కేసు నమోదైంది. మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో తకాహిరొ హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. తకాహిరొ తో ఆమె తరుచూ ట్విటర్లో సంప్రదించినట్టు గుర్తించడంతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం. (చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్) చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్ వాదించాడు. అయితే, బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉండటం అంటే.. దాని అర్థం వారి సమ్మతి లేదని, బాధితులు ప్రతిఘటించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాగా, విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గది బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. కూల్ బాక్సుల్లో దాచి ఉంచిన మృత దేహాల శరీర భాగాలు, 240 ఎముకలు బయటపడ్డాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్ టాప్‌లో ఉంది. అయితే, ఇక్కడే అత్యధికంగా ప్రతయేడు 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలవరపరిచే అంశం. (చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు) -
కిరాతకుడు రఫీకి ఉరి
సాక్షి, అమరావతి: అభం, శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన మహమ్మద్ రఫీకి(25) ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు నగరంలోని పోక్సో న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పసి పిల్లలపై లైంగిక దాడులు, బాలికలపై అత్యాచారాలు, ప్రేమను అంగీకరించని వారిపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కిరాతకుడైన రఫీని ఉరి తీయాలంటూ పోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆడుకుంటున్న చిన్నారిపై... చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వెళ్లింది. భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికకు మదనపల్లెకి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రఫీ(25) ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని ఆశ చూపించి కల్యాణ మండపంలో ఉన్న బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అరవకుండా నోరు నొక్కాడు. పాశవికంగా లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక గొంతు నులిమి చంపేసి, శవాన్ని కల్యాణ మండపం పక్కన గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పట్టించిన సీసీ కెమెరా... కల్యాణ మంటపంలోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారించగా రఫీ చేసిన దారుణం బట్టబయలైంది. రఫీని 2019 నవంబర్ 16న అరెస్టు చేశారు. మదనపల్లె జూనియర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు కొన్నాళ్లు జువెనైల్ హోమ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. నేర ప్రవృత్తి మానకుండా అమానుషానికి పాల్పడిన రఫీకి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. జగన్ సర్కారు చొరవతో... తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ చిన్నారి హత్యకేసు విచారణను చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లోకనాథరెడ్డిని నియమించింది. గతేడాది డిసెంబర్ 12న విచారణ ఆరంభించిన పోక్సో కోర్టు నిందితుడు రఫీ అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష విధించింది. నిందితుడు రఫీ భార్య సైతం ఈ తీర్పును సమర్థించడం గమనార్హం. ఇలాంటి తీర్పులు వస్తే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారని, దీనివల్ల అఘాయిత్యాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష
రియాద్ : జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం అయిదుగురికి మరణశిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం 11 మందిలో, ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించిందని ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును విచారించిన రియాద్ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు హాజరయ్యారనీ, మొత్తం తొమ్మిది సెషన్లను నిర్వహించినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇదొక తప్పుడు ఆపరేషన్ అని సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్ నేడు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసి విచారించారు. వారి వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. అలాగే ఈ హత్య ముందస్తు పథకం ప్రకారం చేసింది కాదని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరిని తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేశారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హత్యలో సౌదీ పాత్ర ఉన్నట్లు అమెరికా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
-
ముషారఫ్‌కు మరణశిక్ష
ఇస్లామాబాద్: సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్ పై ఈ కేసు నమోదైంది.పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింద్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్‌ల బెంచ్ మంగళవారం వెల్లడించింది. కోర్టు తీర్పు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ముషారఫ్ అందుబాటులో లేరు. అయితే ఫిర్యాదులను, రికార్డులను, వాదనలు, కేసులోని వాస్తవాలను పరిశీలించిన మీదట ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్‌కి వ్యతిరేకంగా మెజారిటీ తీర్పుని వెల్లడించారు. 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షస్థానంలో ఉండి ముషారఫ్ సైనికాధిపతిగా వ్యవహరించడంతో ముషారఫ్ పాలనలో జనం విసిగిపోయారు. సుప్రీంకోర్టు జడ్జీలనూ ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచారు. అనేక మంది జడ్జీలను విధుల నుంచి తొలగించారు. తర్వాత 2008లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఓ రాజకీయ పార్టీ వైఫల్యంతో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ముషారఫ్‌కి ఈ శిక్ష అమలు చేయడం ఇప్పుడు సవాల్‌గా మారనుంది. దుబాయ్‌లోని ఆసుపత్రి పడకపై నుంచి ముషారఫ్ గత నెలలో ఓ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. అందులో కేసులో తనపై న్యాయమైన విచారణ జరగడంలేదని ఆరోపించారు. అలాగే ‘జాతికి సేవ చేశాను. దేశ అభ్యున్నతి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అని వీడియోలో ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుని ముషారఫ్ పై కోర్టులో చాలెంజ్ చేయొచ్చని న్యాయనిపుణులు వెల్లడించారు. అమెరికాపై నవంబర్ 9 న జరిగిన దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో ముషారఫ్ అమెరికా పక్షం వహించడం పట్ల మతపరమైన పార్టీలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ హింసకు దారితీశాయి. -
యువతి సజీవదహనం.. 16 మందికి మరణశిక్ష
ఫెని(బంగ్లాదేశ్) : ఓ యువతిని సజీవ దహనం చేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 16 మందికి మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. నుస్రత్ జహాత్ రఫీ అనే విద్యార్థిని ఓ శిక్షణ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి ప్రధాన అధ్యాపాకుడు ఆమెను లైంగిక వేధించాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీచర్.. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా రఫీపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నుస్రత్ వినకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన మరికొంత మందితో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న నుస్రత్‌ను హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 10వ తేదీన కన్నుమూశారు. నుస్రత్ మృతిపై దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నుస్రత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. బాధ్యులను తప్పకుండా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘నుస్రత్ కేసుకు సంబంధించి ప్రాథమికంగా 18 మందిని అరెస్ట్ చేశాం. నుస్రత్ కేసు ఉప సంహరించకోకుంటే ఆమెను అంతమొందించాల్సిందిగా టీచర్ వారిని ఆదేశించినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. తొలుత వారు నుస్రత్ ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె బిల్డింగ్ పై నుంచి కాలిపోతూ కిందికి రావడంతో అసుల విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో నుస్రత్ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. వారు ఆమెపై కిరోసిన్ పోసే ముందు స్కార్ఫ్‌తో ఆమె చేతులను కట్టివేశారు’ అని తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం 62 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి 16 మందికి మరణశిక్ష విధించింది. -
సీబీఐ కోర్టు సంచలన తీర్పు: పోలీసులకు మరణ శిక్ష
సాక్షి, తిరువనంతపురం: సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక యువకుడి లాకప్ డెత్ కేసులో కేరళ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు కానిస్టేబుళ్లకు మరణ శిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం అయిదుగురి పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు ఇద్దరికి మరణశిక్షను విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతోపాటు రెండు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో ఎస్ఐ, సీఐలకు అసిస్టెంట్ కమిషనర్లకు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేయడం గమనార్హం. 2005లో ఉదయ్ కుమార్ అనే యువకుడు లాకప్ హత్యకు గురయ్యాడు. అప్పట్లో తీవ్ర సంచనలం రేపిన ఈ హత్య కేసులో పోలీసు కానిస్టేబుళ్లు జితు కుమార్, శ్రీ కుమార్‌లను ప్రధాన నిందితులుగా తేల్చింది. అలాగే ఈ కేసులో కుట్ర నేరారోపణలు, సాక్ష్యాలను నాశనం చేయడం తదితర ఆరోపణల కింద సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ.కె. సాబుతోపాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఫోర్ట్ కే హరిదాస్‌కు కూడా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా ఒక దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఉదయకుమార్‌ను పోలీసులు తీవ్రంగా హింసించి, హత్య చేశారని ఉదయకుమార్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై, హైకోర్టు ఆదేశాల మేరకు 2007లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితుడి తల్లి ప్రభావతి అమ్మ సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదమూడేళ్ల పోరాటం ఫలించిందనీ, తన కొడుకు కోల్పోయినప్పటినుంచి తనకు కంటిమీద కునుకులేకుండా పోరాటం చేశానంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న తల్లులు , ఈ తరహా క్రూరత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
లాలూపై తీర్పు నేటికి వాయిదా!
రాంచీ: దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు పలువురు తనకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ గురువారం వెల్లడించారు. తాను చట్టప్రకారమే తీర్పు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాలూ, శివపాల్‌ల మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. తాను ఉంటున్న బిర్సాముండా జైలులో చలి అధికంగా ఉందని లాలూ జడ్జీకి ఫిర్యాదు చేయగా.. న్యాయమూర్తి స్పందిస్తూ ‘అయితే తబలా వాయించండి’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అనంతరం లాలూ కోర్టులో సరిగ్గా ప్రవర్తించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ‘నేను కూడా న్యాయవాదినే’ అని లాలూ ప్రతిస్పందించారు. -
పాక్ దుర్మార్గం.. కనీసం తల్లిని కూడా ముట్టుకోనివ్వలేదు
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్, ఆయన తల్లి, భార్య కోరిక తీరింది. వారు ఒకరినొకరు చూసుకొని కాస్తంత ఉపశమనం పొందారు. అన్నింటికంటే ముందు ఆయన క్షేమంగానే ఉండటాన్ని స్వయంగా చూసిన తల్లి, భార్య ధైర్యంతో తిరుగుపయనం అయ్యారు. అయితే, జాదవ్‌ను కలిసే క్రమంలో పాక్ అడుగడుగునా తన బుద్ధి చూపించుకుందనే చెప్పాలి. కనీసం జాదవ్ తల్లికి, భార్యకు మర్యాద ఇవ్వని పాక్ జాదవ్‌తో మాట్లాడే సందర్భంలో వారి మధ్య గ్లాస్‌ను ఏర్పాటుచేశారు. పైగా వారు మాట్లాడేదాన్ని మొత్తం వీడియోలో షూట్ చేయడంతోపాటు రహస్యంగా ప్రత్యేక అధికారులు ఆయన ఏం మాట్లాడుతున్నారనే దాన్ని మైక్రో స్పీకర్ల ద్వారా తమ గదుల్లోని తెరలపై చూస్తూ విన్నారు. కనీసం వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితి కనిపించింది. ఇదిలా ఉండగా పాక్ మరో వీడియో విడుదల చేసింది. గతంలో జాదవ్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా ఓ కపట వీడియోను విడుదల చేసినట్లుగానే తాజాగా కూడా మరో వీడియోను విడుదల చేసింది. అందులో ‘నాతల్లిని, భార్యను కలిసే సమావేశం ఏర్పాటుచేయాలని పాక్ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేసిన పాక్ ప్రభుత్వానికి నేను మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని జాదవ్ చెప్పినట్లుగా ఆ వీడియో ఉంది. -
ఒకరిది పేగుబంధం.. మరొకరిది కట్టుకున్న బంధం
-
కులభూషణ్ తల్లి, భార్య రియాక్షన్ చూశారా..
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్ భార్య, తల్లి పాకిస్థాన్ జైలులో కలుసుకున్నారు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను కలిసి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. తొలుత భారత్ నుంచి పాక్ రాయబార కార్యాలయంలో ఎదురుచూసిన వారు అనంతరం ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వారితో భారత హైకమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట పాక్ జాదవ్ ను అరెస్టు చేసి జైలులో వేసిన విషయం తెలసిందే. దీంతోపాటు అతడికి ఉరి శిక్షను కూడా విధించింది. అయితే, దీనిని వెంటనే అమలు చేయాలనుకున్న పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా పాక్‌ను నిందించేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత అసలు జాదవ్‌ను కలిసేందుకు వీలే లేదంటూ చెప్పిన పాక్ భవిష్యత్‌లో ఎదురవ్వబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెనక్కు తగ్గింది. ఇటీవలె జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత హైకమిషన్ అధికారి జేపీ సింగ్‌తో సహా జాదవ్ తల్లి, భార్య పాక్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి జాదవ్‌ను జైలులో అరగంటపాటు కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పాక్ విడుదల చేసింది. ఇదే రోజు సాయంత్రం జాదవ్ తల్లి, భార్య భారత్‌కు తిరిగి రానున్నారు. -
దైవదూషణ: క్రైస్తవుడికి మరణదండన!
ఇస్లామాబాద్: దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవుడికి మరణదండన విధించారు. స్నేహితుడికి వాట్సాప్‌లో ఓ పద్యాన్ని పంపడమే అతని నేరం. నదీమ్ జేమ్స్ మసిహ్ ఈ మేరకు ఉరిశిక్ష ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్‌లో తనకు ఓ పద్యాన్ని పంపించాడని, అది దైవదూషణ చేసేవిధంగా ఉందంటూ జేమ్స్‌పై అతని స్నేహితుడు యాసిర్ బషీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, డిఫెన్స్ లాయర్ మాత్రం తన క్లయింట్ అమాయకుడని, అతను ఓ ముస్లిం బాలికతో సంబంధం కలిగి ఉండటంతోనే అతనిపై తప్పుడు అభియోగాలు మోపారని తెలిపారు. అతనికి విధించిన మరణదండనను లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని సరా ఈ ఆలంజిర్‌కు చెందిన జేమ్స్‌పై దైవదూషణ ఫిర్యాదు రావడంతో ఉన్మాద మూక నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఛాందసవాదుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ జైల్లోనే అతని కోర్టు విచారణ సాగింది. న్యాయమూర్తి అతనికి మరణదండనతోపాటు రూ. మూడు లక్షలు జరిమానా విధించారు. ప్రస్తుతం జేమ్స్ కుటుంబాన్ని భద్రతాపరమైన కస్టడీలోకి తీసుకొని.. గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. పాకిస్థాన్‌లో క్రైస్తవులు..! ప్రధానంగా ముస్లింలు మెజారిటీ గల పాకిస్థాన్‌లో సుమారు 20లక్షల మంది క్రైస్తవులు ఉంటారు. దైవదూషణ ఆరోపణలతో మైనారిటీ క్రైస్తవులపై ఛాందసవాద, అతివాద గ్రూపులు, ఉగ్రవాదులు తరచూ దాడులు జరుపుతున్నారు. 2015లో ఖురాన్‌ను కించపరిచారనే ఆరోపణలతో క్రైస్తవుల దంపతులిద్దరినీ ఇటుకల బట్టీలో వేసి తగులబెట్టిన ఘటన చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలతో రెండేళ్ల కిందట లాహార్లో 125 క్రైస్తవ గృహాలను తగలబెట్టారు. -
'ఆ ఆరోపణలు అవాస్తవం, కావాలనే రాద్ధాంతం'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కుల్‌భూషణ్ జాదవ్‌పై చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి వీకే సింగ్ తోసిపుచ్చారు. జాదవ్ నిర్దోషి అని, అతని వద్ద భారత పాస్‌పోర్టు ఉందని ఆయన అన్నారు. వీకే సింగ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.... జాదవ్‌పై గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పాకిస్తాన్ కావాలనే రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాదవ్ కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాదవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాక్ జాదవ్‌కు తక్షణమే ఉరి అమలు చేయమని, క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా జాదవ్ తరఫున ఎవరు వాదించొద్దని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. మరోవైపు కుల్‌భూషణ్ అమాయకుడు అయితే అతని వద్ద రెండు పాస్‌పోర్టులు ఎందుకు ఉంటాయని, ఒకటి హిందు, మరొకటి ముస్లిం పేరుతో పాస్‌పోర్టులు ఉన్నాయని పాక్ ప్రధాని సలహాదారుడు సత్తాజ్ అజీజ్ ప్రశ్నించారు. -
జాధవ్ జాడ తెలియదు
ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ వ్యవహారంలో ఇరుదేశాలు పట్టు వీడటం లేదు. ఆయన్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించగా, జాధవ్ మరణ శిక్ష విషయంలో రాజీ పడకూడదని పాక్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. జాధవ్ అమాయకుడని,ఆయన పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. జాధవ్‌ను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. జాధవ్‌కు న్యాయం చేయడానికి భారత్ ఎంతవరకైనా వెళ్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రాజీ ఉండదు: పాక్ సైనిక ఉన్నతాధికారులు జాధవ్‌కు ఉరిశిక్షపై వెనక్కి తగ్గకూడదని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయన్ని ఉరితీస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత్ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గురువారం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా నేతృత్వంలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలిటరీ మీడియా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. స్పందించలేం: ఐరాస జాధవ్‌కు పాక్ మరణశిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాక్‌లకు సూచించింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. -
కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?
-
కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?
గూఢచారిగా పేర్కొంటూ భారతీయుడైన కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించడంతో దాయాది దేశాల మధ్య సంబంధాలు మరింత జఠిలంగా, మరింత ఉద్రిక్తంగా మారాయి. జాధవ్‌కు న్యాయం చేసేందుకు అసాధారణ చర్యలకూ వెనకాడబోమని భారత్.. అన్ని ఒత్తిళ్లను తట్టుకోగలమని, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమకుందంటూ పాకిస్తాన్ వాగ్యుద్ధానికి తెరతీశాయి. ఈ నేపథ్యంలో.. భారత్ ముందు, కుల్‌భూషణ్ ముందు ఉన్న మార్గాలివీ.. దౌత్యపరంగా.. ⇒ వివిధ దౌత్య మార్గాల ద్వారా పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడం. లోపభూయిష్టమైన విచారణను ఎత్తిచూపడం, గోప్యతను పాటించారని, బలమైన సాక్ష్యాలు లేవని, భారత దౌత్యాధికారులను అతన్ని కలిసేందుకు అనుమతించలేదనే విషయాన్ని వివరించాలి. ⇒ సౌదీ అరేబియా సహా పాక్‌తో సత్సంబంధాలున్న దేశాల ద్వారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మధ్యవర్తిత్వం ద్వారా జాధవ్ విడుదలకు ప్రయత్నించడం. న్యాయపరంగా... ⇒ పాక్ ఆర్మీ యాక్ట్ ప్రకారం... శిక్ష ఖరారైనప్పటి నుంచి 60 రోజుల్లోగా జాధవ్ తనకు విధించిన మరణశిక్షపై మిలటరీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయవచ్చు. ళీ కోర్టు మార్షల్లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సివిల్ కోర్టులో దావా వేయొచ్చు. 7.2.3 సెక్షన్ ప్రకారం మిలటరీ కోర్టులో శిక్ష పడ్డవారు సివిల్ కోర్టులో సమీక్ష కోరొచ్చు. ⇒ అప్పీలు చేసుకునేందుకున్న 60 రోజుల గడువు ముగిశాక... పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పెట్టుకునేందుకు మరో 60 రోజుల గడువు ఉంటుంది. పాక్ ఏం చేయొచ్చు... న్యాయ ప్రక్రియ ముగిసేందుకు సమయం పడుతుంది. ఒకవేళ అప్పీలులోనూ మరణశిక్షే ఖరారైనా.. పాక్ అతన్ని ఉరితీయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌ను బెదిరించడానికి, బేరసారాలకు అతన్ని పాక్ వాడుకుంటుందని అంచనా. గతంలోనూ ఇలాంటివి జరిగాయని వారు ఉదహరిస్తున్నారు. వియన్నా ఒడంబడిక ఏం చెబుతోంది..! 1961లో కుదిరిన వియన్నా ఒడంబడికపై భారత్, పాక్‌లు కూడా సంతకాలు చేశాయి. ఈ ఒడంబడిక ఆర్టికల్ 36(1) ప్రకారం... ఎవరైనా విదేశీయుడిని అరెస్టు చేస్తే అతని దేశానికి చెందిన రాయబారులకు కొన్ని హక్కులు ఉంటాయి. అవి.. ► నిర్బంధంలో లేదా జైలు శిక్షను అనుభవిస్తున్న తమ దేశీయుడిని సంప్రదించడానికి రాయబార కార్యాలయ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అరెస్టు అయిన వ్యక్తికీ... తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించే స్వేచ్ఛ ఉంటుంది.. ► అరెస్టయిన, అభియోగాలను ఎదుర్కొంటున్న లేదా శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి కోరితే... నిర్భందించిన సమాచారాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెంటనే తెలియజేయాలి. రాయబార కార్యాలయానికి అరెస్టయిన వ్యక్తి రాసే ఉత్తరాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలి. అలాగే అరెస్టయిన వ్యక్తికి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే విషయంలో అతనికున్న హక్కులను వెంటనే చెప్పాలి. ► జైల్లో ఉన్న తమ దేశస్తుడిని కలిసే హక్కు రాయబార కార్యాలయ అధికారులకు ఉంటుంది. సదరు వ్యక్తితో మాట్లాడే, ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే, అతని తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేసే హక్కు కూడా ఉంటుంది. ఎదుర్కొంటున్న అభియోగాలేమిటనే దానితో సంబంధం లేకుండా... జైళ్లలో ఉన్న తమ దేశస్తులను ఎవరినైనా దౌత్య సిబ్బంది కలవొచ్చు. కోర్టు మార్షల్ చేయొచ్చా! గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన వారిని న్యాయస్థానాల్లో విచారించాలి. అయితే కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ కోర్టు మార్షల్ (సైనిక న్యాయస్థానాల్లో విచారించడం) చేసింది. పాక్ ఆర్మీ యాక్ట్‌లోని సెక్షన్–59 కింద కుల్‌భూషణ్‌కు ఉరిశిక్ష విధించింది. పౌర ప్రదేశాల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడే వారిని శిక్షించే ఉద్దేశంతో 2015లో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్షన్–59ను చేర్చారు. దీంట్లో గూఢచర్యం, దేశద్రోహానికి పాల్పడిన వారిని సైతం విచారించే వెసులుబాటు ఉంది. సైన్యానికి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టిన ఈ చట్టం తీవ్ర దుర్వినియోగమవుతోంది. మానవహక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై ప్రభుత్వం ప్రయోగిస్తోంది. దీనికింద మొత్తం 274 మందిని విచారించగా.. ఒక్కరూ నిర్దోషిగా బయటపడలేదు. 161 మందికి మరణశిక్ష విధించగా, మిగిలిన 113 మందికి జైలు శిక్ష పడింది. ఇటీవలే ఈ చట్టాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పాక్‌లో ఉరి.. భారత్‌లో ఇద్దరికి ప్రాణభిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది అరెస్టైన భారతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారతీయుడికి ఉరిశిక్ష విధించడానికి సరిగ్గా ఒకరోజు ముందే భారత తీర ప్రాంత గస్తీ దళం ఇద్దరు పాకిస్థానీ జాలర్ల ప్రాణాలను కాపాడింది. సముద్రంలో కొట్టుకుపోయిన వారిని కాపాడి మరీ వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టింది. ఇటీవల పాకిస్థాన్ కోస్టు గార్డుకు చెందిన ఓ చిన్నబోటు తమ జలాల్లో చేపల వేటను పరిశీలిస్తూ.. పొరపాటున గుజరాత్ తీరంలోని సర్‌క్రీక్ ప్రాంతానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రధాన బోటుతో ఇది విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో బోటులో ఆరుగురు జాలర్లు ఉన్నారు. వెంటనే పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ న్యూఢిల్లీలోని భారత నేవీ అధికారులతో మాట్లాడి.. సాయం కోసం అర్థించారు. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం జాలర్ల కాపాడేందుకు పలు ఓడలతో గాలింపుచర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్ క్రీక్‌కు సమీపంలో ఇద్దరు పాకిస్థాన్ జాలర్లను కాపాడినట్టు భారత ఓడలు ఐసీజీఎస్ సామ్రాట్ షిప్‌కు సమాచారం ఇచ్చాయి. అప్పటికే నలుగురు పాకిస్థానీ జాలర్లు ప్రాణాలు విడిచారు. కొనప్రాణాలతో దొరికిన ఇద్దరు జాలర్లకు భారత కోస్ట్ గార్డు అధికారులు సరైన వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. వారి బాగోగులను చూసుకున్నారు. ఈ క్రమంలోనే భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. జాధవ్‌కు ఉరిశిక్ష విధించాలన్న పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారత జైలులో ఉన్న 12 మంది పాకిస్థాన్ జాలర్లను విడుదలను నిలిపివేసింది. -
భారతీయుడికి ఉరిశిక్ష
► గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్ జాధవ్‌ను దోషిగా పేర్కొన్న పాక్ మిలటరీ కోర్టు ► ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన భారత్ ► ముందస్తు నిర్ణయంతో చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరిక ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అటు.. బుధవారం విడుదల కావాల్సిఉన్న పాకిస్తాన్ ఖైదీల విడుదలను భారత్ ప్రస్తుతానికి నిలిపేసింది. మరణశిక్ష నిర్ణయాన్ని చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ధ్రువీకరించారని పాకిస్తాన్ మిలటరీ సమాచార విభాగం ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తను భారత నౌకాదళ కమాండర్ అని జాధవ్ ఒప్పుకున్నట్లు తెలిపింది. ఆర్మీ కోర్టు తీసుకున్న నిర్ణయం పాక్‌లో గూఢచర్యానికి పాల్పడే విదేశాలకు స్పష్టమైన హెచ్చరిక అని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. పాక్ కమిషనర్‌కు భారత్ సమన్లు జాధవ్‌కు మరణశిక్ష విధించటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కనీస న్యాయ నిబంధనలు పాటించకుండా జాధవ్‌కు శిక్ష విధించారని ఆరోపించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్.. పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉరిశిక్ష అమలైతే.. దీన్ని ముందస్తుగా ఆలోచించి చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయాన్ని కూడా భారత కమిషన్‌కు తెలపలేదని మండిపడ్డారు. కాగా, జాధవ్‌కు వేసిన మరణశిక్ష అమలు కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాక్ జైల్లో చనిపోయిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ‘భారత్ జైళ్లలో తీవ్రమైన నేరారోపణలతో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీయులకు అలాంటి శిక్షలే విధిస్తున్నామా? 2000లో ఎర్రకోటపై దాడికి ప్రయత్నించిన పాక్ జాతీయుడిని మనం ఉరితీశామా?’ అని ఆమె ప్రశ్నించారు. పాక్ ఖైదీల విడుదల నిలుపుదల జాధవ్‌కు మరణశిక్ష నేపథ్యంలో భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న పాక్ ఖైదీల విడుదలను భారత్ నిలిపివేసింది. బుధవారం కొందరిని విడుదల చేయాల్సి ఉన్నా పాక్ నిర్ణయంతో.. భారత్ నిర్ణయాన్ని మార్చుకుంది. గతేడాది మార్చి 3న పాక్ భద్రతా బలగాలు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాధవ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జాధవ్ నేవీలో పనిచేశారని తెలిపిన భారత్.. అతను ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతనికి సంబంధం లేదని ప్రకటించింది. కాగా, గతేడాది డిసెంబర్ 7న పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆ దేశ పార్లమెంటుకు ఇచ్చిన వివరణలో.. ‘జాధవ్‌పై ఇచ్చిన పత్రాల్లో వెల్లడించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. సరైన ఆధారాలను అందించలేకపోయారు’ అని పేర్కొన్నారు. పాక్‌కు ఆమ్నెస్టీ అక్షింతలు పాకిస్తాన్ మిలటరీ కోర్టు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ దుయ్యబట్టింది. ‘పాకిస్తాన్ మిలటరీ కోర్టు వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా ఉల్లంఘిస్తోందో మరోసారి వెల్లడైంది. ప్రతివాదులు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవటం పాక్ మిలటరీ కోర్టులకు అలవాటు’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. వాదనలివీ భారత్ జాధవ్ నేవీలో పనిచేసేవారు. ముందస్తు పదవీవిరమణ తీసుకుని ఇరాన్లో వ్యాపారం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు జాధవ్‌ను ఇరాన్‌లోని ఛాబహార్ పోర్టు నుంచి కిడ్నాప్ చేసి పాక్‌కు తీసుకెళ్లారు. బెలూచిస్తాన్‌లో పట్టుకున్నామని చాలాకాలంగా ఇక్కడే ఉన్నాడంటూ పాక్ చెబుతున్నా.. ఇంతవరకు దీనికి సంబంధించిన ఆధారాలివ్వలేదు. భారత గూఢచారి అని చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఒప్పించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత రాయబార కార్యాలయం పలుమార్లు ప్రయత్నించినా పాక్ అనుమతివ్వలేదు. ఆధారాల్లేకుండానే విచారణ జరిపి ఇప్పుడు మరణశిక్ష విధించినట్లు ప్రకటించారు. పాక్ తీరు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. పాకిస్తాన్ కొన్నేళ్లుగా పాకిస్తాన్లో అశాంతి నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జాధవ్‌ను పక్కా వ్యూహంతోనే భారత గూఢచార సంస్థ రా బెలూచిస్తాన్‌కు పంపించింది. జాధవ్ కూడా తను గూఢచారినని ఒప్పుకున్నారు. బెలూచిస్తాన్‌లో అస్థిరత సృష్టించేందుకే వచ్చానని చెప్పారు. ఈ వీడియోను మేం విడుదల చేశాం. -
ఎవరు ఈ కులభూషణ్? ఉరి శిక్షెందుకు?
న్యూఢిల్లీ: గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ ఎవరు? పాక్ ఆరోపిస్తున్నట్లుగా కులభూషణ్ రీసర్చ్ అండ్ అనాలసిస్ (రా)వింగ్ అధికారినా? అతడు నిజంగానే పాక్ వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగాడా? పాక్ చేస్తున్న ఆరోపణల్లో అసలు ఎంత వరకు నిజం ఉంది? ఇంతకీ ఎవరు ఈ కులభూషణ్ అని అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే.. భారత ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కులభూషణ్ జాదవ్ ఇండియన్ నేవీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. కానీ పాక్ మాత్రం ఇతడినే ఇప్పుడు 'రా' అధికారి అని ఆరోపిస్తోంది. ఇరాన్ నుంచి బలోచిస్థాన్లోకి అడుగుపెట్టగానే పాక్ పోలీసులు 2016, మార్చి 3న అరెస్టు చేసినట్లు ఊహగానాలున్నాయి. అయితే, ఇరాన్ నుంచి అతడిని అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు భారత్ ఆరోపిస్తోంది. ఏప్రిల్ 2016లో కులభూషణ్‌పై ఉగ్రవాదం, దేశ ద్రోహం చర్యలు ఆరోపించింది. జాదవ్‌ను తిరిగి పంపించేందుకు ఇస్లామాబాద్‌లోని ఎగువ సభ నిరాకరించిందంటూ ఈ ఏడాది(2017) మార్చిలో పాక్ ప్రధాని సలహాదారు, విదేశాంగ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్ ప్రకటించాడు. -
ఉరి శిక్ష వేసినా మహిళకు అసభ్య సైగలు
ముంబయి: ఒక్కోసారి ఆవేశంలో ఎలాంటి తప్పు చేసినా దానికి జీవితంలో ఒక్కసారైన పశ్చాత్తాపం కలుగుతుంది. తన పశ్చాత్తాపాన్ని బాధితులకు చెప్పలేడేమోగానీ తన అంతరాత్మతో సంభాషిస్తాడు. కానీ, ముంబయిలో ఓ అమ్మాయి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెపై యాసిడ్ కుమ్మరించి ఆమె ప్రాణాలకు పోయేందుకు కారణమైన ఆ యువకుడిలో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆఖరికి ఉరిశిక్ష వేసిన సమయంలో కూడా తానేదో గొప్పపనిచేసినట్లుగా వెకిలినవ్వు నవ్వాడు. అది చూసి అప్పటికే నిండు బాధలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు పట్టరాని కోపం వచ్చింది. ఫలితంగా కోర్టు లోపలే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదంతా ముంబయిలోని యాసిడ్ దాడికి గురై చనిపోయిన ప్రీతి రాఠి కేసుకు సంబంధించి అక్కడి కోర్టులో జరిగిన సంఘటన. అంకుర్ పన్వార్ అనే యువకుడు 2013లో ప్రీతిపై యాసిడ్ దాడి చేయగా ఆమె ప్రాణాలుకోల్పోయింది. ఆ కేసుకు సంబంధించి గురువారం తుదివాదనలు జరిగాయి. జడ్జి ఉరిశిక్ష విధించాడు. ఆ సమయంలో బాధితుల కుటుంబ సభ్యులవైపు చూసి అతడు వెకిలి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠి, ఆమె సోదరుడు హితేష్, ఓ మహిళ బంధువు కోర్టులో నుంచి అతడి ముందు వెళుతున్నారు. అది చూసి ప్రీతి సోదరుడు ఎందుకు నవ్వావని ప్రశ్నించగా వారితో ఉన్న మహిళవైపు చూసి అసభ్యకరంగా సైగలు చేశాడు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాసేపు గందరగోళం అనంతరం వివాదం సర్దుమణిగింది. -
ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష
-
ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష
ముంబయి: ప్రీతిరాఠి అనే నర్సుపై 2013లో యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలుపోయేందుకు కారణమైన నేరస్థుడు అంకుర్ లాల్ పన్వార్‌కు ప్రత్యేక మహిళల న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. అతడు ఉద్దేశ పూర్వకంగానే ముందస్తుగా ప్రణాళిక వేసుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఉరి శిక్ష విధించడానికి ఈ కేసు తగినదని పేర్కొంది. అంతేకాదు, ఇది అత్యంత అరుదుగా జరిగే దాడుల కోవాలోకి వస్తుందని న్యాయస్థానం చెప్పింది. 2013 మే 2న ముంబయిలోని బాంద్రా రైల్వే టర్మనల్లో ఓ రైలు దిగొస్తుండగా అంకుర్ ఆమెపై పెద్ద మొత్తంలో యాసిడ్ కుమ్మరించాడు. దీంతో ఆమె శరీరంలోని అంతర్భాగాలు పూర్తిగా పనిచేయడంమాని జూన్ 1న బొంబే ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో దాడికి పాల్పడిన అంకుర్ ను అరెస్టు చేశారు. ఆమె ఉద్యోగంలో ఎదుగుదలను చూసి ఓర్వలేకే తాను దాడి చేసినట్లుగా అతడు కోర్టులో అంగీకరించాడు. మరోపక్క, అంకుర్ మాత్రమే వాళ్ల కుటుంబానికి దిక్కని అతడి తరుపు న్యాయవాది చెప్పినప్పటికీ న్యాయస్థానం ఏకీభవించలేదు. చివరకు ఉరిశిక్ష ప్రకటించింది. -
ముస్లిం బ్రదర్హుడ్ చీఫ్‌కు మరణ దండన
కైరో: నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు ఈజిప్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హింస ప్రేరేపణ, హత్య తదితర కేసుల్లో ఆ సంస్థ చీఫ్ మహ్మద్ బడీతో పాటు 21 మందికి ఇక్కడి కోర్టులు మరణ దండన విధించాయి. 2013 ఆగస్టులో రబా, నహడా ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి తమ మద్దతు దారులను రెచ్చగొట్టి హింసకు పురిగొల్పడమే కాకుండా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు సృష్టించారనే కేసులో బడీతో పాటు మరో పదముగ్గురిని దోషులుగా కైరో క్రిమినల్ కోర్టు తేల్చింది. తుది తీర్పును వచ్చేనెల 11న కోర్టు వెల్లడించనుంది. హింస ప్రేరేపిత కేసుల్లోనే మన్సోరాలోని క్రిమినల్ కోర్టు మరో ఎనిమిది మంది ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులకు మరణ దండన విధించింది. ఈ తీర్పులను పునఃపరిశీలనకు ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీకి కోర్టుల నివేదించాయి. -
రఘునందన్‌కు ఉరే సరి
అమెరికాలో చిన్నారి శాన్వీని, ఆమె నాయనమ్మను హత్య చేసిన కేసులో కోర్టు తీర్పు మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేయాలనుకున్న జ్యూరీ హత్యల తీవ్రత, దోషి మానసిక స్థితి చూసి మరణశిక్ష ఖరారు న్యూయార్క్: అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నా నికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హ త్యలు చేశాడని ఇటీవల నిర్ధారించింది. జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి(61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేశాడని స్పష్టమైంది. పశ్చాత్తాప పడని రఘునందన్ : ఈ కేసును ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులతో కూడిన జ్యూరీ విచారించింది. విచారణ సమయంలో, చిన్నారి హత్య జరిగిన తీరు తెలిసి, సాక్ష్యాధారాలు చూసి న్యాయమూర్తులే కన్నీళ్లు పెట్టగా.. రఘునందన్ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు. తనకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా, ఈ వాదనలన్నీ వింటూ కూర్చొనే కంటే తనకు ఉరిశిక్ష విధిస్తే దాన్ని స్వీకరిస్తానని అనడం జ్యూరీని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. శిక్ష ఖరారుపై జ్యూరీ మంగళవారం మూడున్నర గంటలపాటు చర్చించింది. రఘునందన్‌కు మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేసే అంశాన్ని పరిశీలించింది.చివరికి హత్యలో క్రూరత్వం, అతడి వాంగ్మూలం, మానసిక స్థితి, మితిమీరిన జూదం అలవాట్లు పరిశీలించాక ఉరే సరైన శిక్ష అని తేల్చింది. 45 రోజుల్లో అతడికి శిక్ష అమలు చేసే అవకాశముంది. శిక్ష విన్నా.. నోట్స్ రాసుకుంటూ తనకు ఉరిశిక్ష విధించినట్లు జ్యూరీ ప్రకటించినా కూడా రఘునందన్‌లో ఎలాంటి స్పందనా లేదని, తలవంచుకుని ఏదో నోట్స్ రాసుకుంటూ కనిపించాడని స్థానిక మీడియా తెలిపింది. కాగా, బాధిత కుటుంబం కోరుకున్న శిక్ష ఇదేనని మాంట్గోమెరీ కౌంటీ మొదటి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ కెవిన్ స్టీల్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సమంతా కఫ్‌మన్ చెప్పారు. ‘‘ఈ శిక్ష వారు కోల్పోయినదాన్ని వారికి తిరిగివ్వలేదు. కానీ సాంత్వన చేకూర్చగలదంతే’’ అని పేర్కొన్నారు. విచారణ తొలి దశలో రఘునందన్ తన కేసును తానే వాదించుకున్నాడు, శిక్ష ఖరారు దశలో హెన్రీ హిలెస్ను తన అటార్నీగా పెట్టుకున్నాడు. ఇదీ కేసు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వెన్న శాన్వీ తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పెన్సిల్వేనియాలోని ‘కింగ్ ఆఫ్ ప్రూసియా’ అనే అపార్టుమెంట్లో నివసించేవారు. 2012 అక్టోబరు 12న చిన్నారి శాన్వి కిడ్నాప్‌కు గురైంది. పాప నాయనమ్మ దారుణంగా హత్యకు గురైంది. ఈ క్రమంలో శాన్వీ కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. 50 వేల డాలర్లు ఇస్తేనే పిల్లను విడిచి పెడతానని, లేదంటే చంపేస్తానంటూ ఆ లేఖలో ఉంది. అయితే శాన్వీ తల్లిదండ్రులను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్లో పేర్కొనడంతో పోలీసుల దర్యాప్తు సులభమైంది. దీంతో బాగా తెలిసినవాళ్లపై ఆరా తీసిన పోలీసులకు.. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ వాడే అయిన రఘునందన్‌పై అనుమానమొచ్చింది. మొదట్లో తానే హత్యలు చేశానని రఘునందన్ అంగీకరించాడు. తాను కిడ్నాప్ చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ శాన్వీ నాయనమ్మ ఉండడంతో తాను షాక్ తిన్నానని, ఆమె ను తప్పించుకునే క్రమంలో కూరగాయల కత్తితో పొడిచి చంపేశానని రఘునందన్ దర్యాప్తులో వెల్లడించాడు. తర్వాత పాప ఏడిస్తే చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోతుందన్న భయంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశానని, ఆమె చుట్టూ ఒక బట్ట చుట్టానని, తర్వాత బేస్మెంట్లోని చెత్తబుట్టలో పెట్టానని తెలిపాడు. తర్వాత పాప కోసం పాలు తీసుకొచ్చి చూడగా.. పాప మరణించిం దని వెల్లడించాడు. అయితే విచారణలో తనకేమీ తెలియదంటూ బుకాయిస్తూ వచ్చాడు. -
మానవతకు మారుపేరు జస్టిస్ చౌదరి
నివాళి: చౌదరికి న్యాయమూర్తిగా, మానవతావాదిగా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. జీవితాంతం ఆ విలువలకూ, అభిప్రాయాలకూ కట్టుబడి ఉన్నారు. ఆయన ఉరిశిక్షను వ్యతిరేకించారు. ఎవరికీ ఉరిశిక్ష విధించలేదు. ఆయన అత్యంత మౌలిక ఆలోచనాపరుడు. ఇటీవలే మరణించిన రాష్ట్ర హైకోర్టు న్యా యమూర్తి (రిటైర్డు) పీఏ చౌదరి అత్యంత మౌలిక ఆలోచనాపరుడు. ఆచరణవాది. అన్నింటికన్నా మించి మంచి విశ్లేషకుడు. స్త్రీల సమస్యల పట్ల సానుభూతిపరుడు. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని నమ్మేవారిలో ప్రథముడు. 2007లో ఆయన అప్పటిదాకా వెలువరించిన తీర్పులను ‘జస్టిస్ చౌదరీస్ విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్’ సంకలనం చేసి పుస్తకావిష్కరణ సభలో హై దరాబాద్‌లో జరగగా, అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎస్బీ సిన్హా మాట్లాడుతూ, ‘జస్టిస్ చౌదరి తీర్పు లు ఆదర్శనీయమని, ఇలాంటి ప్రతిభామూర్తి సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులు కాకపోవడం దురదృష్టకరమని’ వ్యాఖ్యానించారు. న్యాయకోవిదుడు ప్రొఫెసర్ ఎర్రబి, మా డభూషి శ్రీధర్ సంయుక్తంగా ఈ గ్రంథాన్ని వెలువరించారు. పుస్తకానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య ముందుమాట రాస్తూ, పీఏ చౌదరి సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడం ‘విధి నిర్లక్ష్యం’గా పేర్కొన్నారు. చౌదరి మాట్లాడుతూ, అక్కడ ‘విధి నిర్లక్ష్యం’ బదులు శివశంకర్ అని రాసి ఉంటే సరిపోయేదన్నారు. ఆ సభలోనే ఉన్న శివశంకర్ ఆ మాట వినగానే బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో శివశంకర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రముఖ సినీ తార సరిత కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చౌదరి తీర్పు సంచలనాత్మకమే కాదు, సాహసోపేతం కూడా. సరితకు చిన్న వయసులోనే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ మద్రాసులో కొంతకాలం కాపురం చేశారు. సినీ తారగా ఎదిగిన సరిత భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆ సమయంలో వెంకటసుబ్బ య్య తన భార్యను తనతో కాపురం చేసేటట్లు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోర్టుకెళ్లారు. ఈ కేసు కింది కోర్టు నుంచి హైకోర్టుకొచ్చింది. దీనిపై జస్టిస్ చౌదరి తీర్పు వెలువరిస్తూ, రాజ్యాంగం ప్రసాదించిన, వ్యక్తి స్వేచ్ఛ, గౌరవాలకు విరుద్ధంగా ఉన్న హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 చెల్లదని కొట్టివేశారు. ‘‘భార్య, భర్త సంపాదించిన సొంత ఆస్తి కాదు. ఆమె అంగీకారం లేకుండా ఆమె శరీరంలోని ఏ భాగం తాకి నా నేరమే అవుతుంది. ఇష్టం లేకుండా బలవంతంగా కాపురం చేస్తే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది.’’ అంటూ తీవ్ర స్వరంతో చెప్పారు. జస్టిస్ చౌదరి సామ్యవాది. సమాజంలో అన్యాయం ఎక్కడున్నా తనతీర్పుల ద్వారా సరిదిద్దడానికి ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో ఓ కార్మికుడు భార్యను వదిలేసి వెళ్ళిపోగా, భర్తకు కేటాయించిన క్వార్టర్లో భార్య ఉండసాగింది. కార్మికుడు భార్యను వదిలాడుకాని, ఉద్యోగంలోనే ఉన్నాడు. ఈ సమయంలో క్వార్టర్ ఖాళీ చేయాల్సిందిగా యాజమాన్యం కోర్టుకెళ్లింది. జస్టిస్ చౌదరి తీర్పులో ‘రాజ్యా ంగరీత్యా మనది సోషలిజం ఆదర్శంగా ఉన్న దేశం కనుక సోషలిజంలో వ్యక్తికీ, వ్యక్తికీ మధ్యన సంబంధాలు పెంపొందాలే తప్ప, యజమానికీ-ఆస్తికీ మధ్యకాదు. ఒక ఆడపడుచు, ఆమె సంతానం బజారుపాలుకావటానికి వీల్లేదని’ మానవత్వంతో తీర్పు చెప్పారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని ‘ఆస్థాన’ పదవుల్నీ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొని ఆ పదవుల్లో ఉన్న వారందర్నీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిందిగా లేఖ రాసింది. అప్పుడు ఆస్థాన కవిగా ఉన్న దాశరథి ససేమిరా తొలగనని మొండికేశారు. తనకు ఆ పదవిలో జీవితాంతం కొనసాగే హక్కు ఉందని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును చౌదరి చాలా లోతుగా పరిశీలించి, ఇంగ్లిషువారు అనుసరిస్తున్న చట్టాలను క్షుణ్ణం గా పరిశీలించి ప్రభుత్వం ‘ఆస్థాన పదవులను’ రద్దు చేయడంలో ఎలాంటి తప్పిదం చేయలేదని తీర్పు చెప్పారు. చౌదరికి న్యాయమూర్తిగా, మానవతావాదిగా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. జీవితాంతం ఆ విలువలకూ, అభిప్రాయాలకూ కట్టుబడి ఉన్నారు. ఆయన ఉరిశిక్షను వ్యతిరేకించారు. జస్టిస్ చౌదరి ఎవరికీ ఉరిశిక్ష విధించలేదు. కింది కోర్టులు విధించిన మరణశిక్షను ఖరారు చేయలేదు. పౌరహక్కుల సంఘాల పాత్ర పట్ల ఎంతో గౌరవం ఉండేది. ‘జుడిషియల్ యాక్టివిజమ్’ ఆద్యులుగా చెప్పకునే మాజీ న్యాయమూర్తులు భగవతి, కృష్ణయ్యర్, చెన్నపరెడ్డి సరసన జస్టిస్ పీఏ చౌదరిని చేర్చడం సబబనిపిస్తుంది. (వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్టు) వెనిగళ్ళ వెంకటరత్నం