వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్‌కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది.
ఇవీ అభియోగాలు
వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్‌లో భాగంగా 2022 అక్టోబరులో లాన్‌ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్‌లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్‌హౌస్‌ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్‌లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment