ఉదయ్‌కుమార్ తల్లి ప్రభావతి అమ్మ(పాత ఫోటో)
సాక్షి, తిరువనంతపురం: సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక యువకుడి లాకప్ డెత్ కేసులో కేరళ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు కానిస్టేబుళ్లకు మరణ శిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం అయిదుగురి పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు ఇద్దరికి మరణశిక్షను విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతోపాటు రెండు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో ఎస్‌ఐ, సీఐలకు అసిస్టెంట్ కమిషనర్లకు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేయడం గమనార‍్హం.
2005లో ఉదయ్ కుమార్ అనే యువకుడు లాకప్ హత్యకు గురయ్యాడు. అప్పట్లో తీవ్ర సంచనలం రేపిన ఈ హత్య కేసులో పోలీసు కానిస్టేబుళ్లు జితు కుమార్, శ్రీ కుమార్లను ప్రధాన నిందితులుగా తేల్చింది. అలాగే ఈ కేసులో కుట్ర నేరారోపణలు, సాక్ష్యాలను నాశనం చేయడం తదితర ఆరోపణల కింద సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ.కె. సాబుతోపాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఫోర్ట్ కే హరిదాస్‌కు కూడా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
కాగా ఒక దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఉదయకుమార్‌ను పోలీసులు తీవ్రంగా హింసించి, హత్య చేశారని ఉదయకుమార్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై, హైకోర్టు ఆదేశాల మేరకు 2007లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితుడి తల్లి ప్రభావతి అమ్మ సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదమూడేళ్ల పోరాటం ఫలించిందనీ, తన కొడుకు కోల్పోయినప్పటినుంచి తనకు కంటిమీద కునుకులేకుండా పోరాటం చేశానంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న తల్లులు , ఈ తరహా క్రూరత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment