
ఉరి శిక్ష వేసినా మహిళకు అసభ్య సైగలు
ముంబయి: ఒక్కోసారి ఆవేశంలో ఎలాంటి తప్పు చేసినా దానికి జీవితంలో ఒక్కసారైన పశ్చాత్తాపం కలుగుతుంది. తన పశ్చాత్తాపాన్ని బాధితులకు చెప్పలేడేమోగానీ తన అంతరాత్మతో సంభాషిస్తాడు. కానీ, ముంబయిలో ఓ అమ్మాయి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెపై యాసిడ్ కుమ్మరించి ఆమె ప్రాణాలకు పోయేందుకు కారణమైన ఆ యువకుడిలో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆఖరికి ఉరిశిక్ష వేసిన సమయంలో కూడా తానేదో గొప్పపనిచేసినట్లుగా వెకిలినవ్వు నవ్వాడు. అది చూసి అప్పటికే నిండు బాధలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు పట్టరాని కోపం వచ్చింది.
ఫలితంగా కోర్టు లోపలే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదంతా ముంబయిలోని యాసిడ్ దాడికి గురై చనిపోయిన ప్రీతి రాఠి కేసుకు సంబంధించి అక్కడి కోర్టులో జరిగిన సంఘటన. అంకుర్ పన్వార్ అనే యువకుడు 2013లో ప్రీతిపై యాసిడ్ దాడి చేయగా ఆమె ప్రాణాలుకోల్పోయింది. ఆ కేసుకు సంబంధించి గురువారం తుదివాదనలు జరిగాయి. జడ్జి ఉరిశిక్ష విధించాడు. ఆ సమయంలో బాధితుల కుటుంబ సభ్యులవైపు చూసి అతడు వెకిలి నవ్వు నవ్వాడు.
ఆ సమయంలో ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠి, ఆమె సోదరుడు హితేష్, ఓ మహిళ బంధువు కోర్టులో నుంచి అతడి ముందు వెళుతున్నారు. అది చూసి ప్రీతి సోదరుడు ఎందుకు నవ్వావని ప్రశ్నించగా వారితో ఉన్న మహిళవైపు చూసి అసభ్యకరంగా సైగలు చేశాడు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాసేపు గందరగోళం అనంతరం వివాదం సర్దుమణిగింది.