భారతీయుడికి ఉరిశిక్ష
► గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్ జాధవ్‌ను దోషిగా పేర్కొన్న పాక్ మిలటరీ కోర్టు
► ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన భారత్
► ముందస్తు నిర్ణయంతో చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరిక
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అటు.. బుధవారం విడుదల కావాల్సిఉన్న పాకిస్తాన్ ఖైదీల విడుదలను భారత్ ప్రస్తుతానికి నిలిపేసింది. మరణశిక్ష నిర్ణయాన్ని చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ధ్రువీకరించారని పాకిస్తాన్ మిలటరీ సమాచార విభాగం ఐఎస్‌పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తను భారత నౌకాదళ కమాండర్ అని జాధవ్ ఒప్పుకున్నట్లు తెలిపింది. ఆర్మీ కోర్టు తీసుకున్న నిర్ణయం పాక్‌లో గూఢచర్యానికి పాల్పడే విదేశాలకు స్పష్టమైన హెచ్చరిక అని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు.
పాక్ కమిషనర్‌కు భారత్ సమన్లు
జాధవ్‌కు మరణశిక్ష విధించటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కనీస న్యాయ నిబంధనలు పాటించకుండా జాధవ్‌కు శిక్ష విధించారని ఆరోపించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్.. పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉరిశిక్ష అమలైతే.. దీన్ని ముందస్తుగా ఆలోచించి చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయాన్ని కూడా భారత కమిషన్‌కు తెలపలేదని మండిపడ్డారు.
కాగా, జాధవ్‌కు వేసిన మరణశిక్ష అమలు కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాక్ జైల్లో చనిపోయిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ‘భారత్ జైళ్లలో తీవ్రమైన నేరారోపణలతో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీయులకు అలాంటి శిక్షలే విధిస్తున్నామా? 2000లో ఎర్రకోటపై దాడికి ప్రయత్నించిన పాక్ జాతీయుడిని మనం ఉరితీశామా?’ అని ఆమె ప్రశ్నించారు.
పాక్ ఖైదీల విడుదల నిలుపుదల
జాధవ్‌కు మరణశిక్ష నేపథ్యంలో భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న పాక్ ఖైదీల విడుదలను భారత్ నిలిపివేసింది. బుధవారం కొందరిని విడుదల చేయాల్సి ఉన్నా పాక్ నిర్ణయంతో.. భారత్ నిర్ణయాన్ని మార్చుకుంది. గతేడాది మార్చి 3న పాక్ భద్రతా బలగాలు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాధవ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
జాధవ్ నేవీలో పనిచేశారని తెలిపిన భారత్.. అతను ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతనికి సంబంధం లేదని ప్రకటించింది. కాగా, గతేడాది డిసెంబర్ 7న పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆ దేశ పార్లమెంటుకు ఇచ్చిన వివరణలో.. ‘జాధవ్‌పై ఇచ్చిన పత్రాల్లో వెల్లడించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. సరైన ఆధారాలను అందించలేకపోయారు’ అని పేర్కొన్నారు.
పాక్‌కు ఆమ్నెస్టీ అక్షింతలు
పాకిస్తాన్ మిలటరీ కోర్టు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ దుయ్యబట్టింది. ‘పాకిస్తాన్ మిలటరీ కోర్టు వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా ఉల్లంఘిస్తోందో మరోసారి వెల్లడైంది. ప్రతివాదులు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవటం పాక్ మిలటరీ కోర్టులకు అలవాటు’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
వాదనలివీ
భారత్
జాధవ్ నేవీలో పనిచేసేవారు. ముందస్తు పదవీవిరమణ తీసుకుని ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు జాధవ్‌ను ఇరాన్‌లోని ఛాబహార్ పోర్టు నుంచి కిడ్నాప్ చేసి పాక్‌కు తీసుకెళ్లారు. బెలూచిస్తాన్‌లో పట్టుకున్నామని చాలాకాలంగా ఇక్కడే ఉన్నాడంటూ పాక్ చెబుతున్నా.. ఇంతవరకు దీనికి సంబంధించిన ఆధారాలివ్వలేదు. భారత గూఢచారి అని చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఒప్పించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత రాయబార కార్యాలయం పలుమార్లు ప్రయత్నించినా పాక్ అనుమతివ్వలేదు. ఆధారాల్లేకుండానే విచారణ జరిపి ఇప్పుడు మరణశిక్ష విధించినట్లు ప్రకటించారు. పాక్ తీరు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం.
పాకిస్తాన్
కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో అశాంతి నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జాధవ్‌ను పక్కా వ్యూహంతోనే భారత గూఢచార సంస్థ రా బెలూచిస్తాన్‌కు పంపించింది. జాధవ్ కూడా తను గూఢచారినని ఒప్పుకున్నారు. బెలూచిస్తాన్‌లో అస్థిరత సృష్టించేందుకే వచ్చానని చెప్పారు. ఈ వీడియోను మేం విడుదల చేశాం.