ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ వ్యవహారంలో ఇరుదేశాలు పట్టు వీడటం లేదు. ఆయన్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించగా, జాధవ్ మరణ శిక్ష విషయంలో రాజీ పడకూడదని పాక్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు.
జాధవ్ అమాయకుడని,ఆయన పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. జాధవ్‌ను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. జాధవ్‌కు న్యాయం చేయడానికి భారత్ ఎంతవరకైనా వెళ్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.
రాజీ ఉండదు: పాక్ సైనిక ఉన్నతాధికారులు
జాధవ్‌కు ఉరిశిక్షపై వెనక్కి తగ్గకూడదని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయన్ని ఉరితీస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత్ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గురువారం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా నేతృత్వంలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలిటరీ మీడియా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.
స్పందించలేం: ఐరాస
జాధవ్‌కు పాక్ మరణశిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాక్‌లకు సూచించింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది.