పాక్‌లో ఉరి.. భారత్‌లో ఇద్దరికి ప్రాణభిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది అరెస్టైన భారతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారతీయుడికి ఉరిశిక్ష విధించడానికి సరిగ్గా ఒకరోజు ముందే భారత తీర ప్రాంత గస్తీ దళం ఇద్దరు పాకిస్థానీ జాలర్ల ప్రాణాలను కాపాడింది. సముద్రంలో కొట్టుకుపోయిన వారిని కాపాడి మరీ వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టింది.
ఇటీవల పాకిస్థాన్ కోస్టు గార్డుకు చెందిన ఓ చిన్నబోటు తమ జలాల్లో చేపల వేటను పరిశీలిస్తూ.. పొరపాటున గుజరాత్ తీరంలోని సర్‌క్రీక్ ప్రాంతానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రధాన బోటుతో ఇది విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో బోటులో ఆరుగురు జాలర్లు ఉన్నారు. వెంటనే పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ న్యూఢిల్లీలోని భారత నేవీ అధికారులతో మాట్లాడి.. సాయం కోసం అర్థించారు. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం జాలర్ల కాపాడేందుకు పలు ఓడలతో గాలింపుచర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్ క్రీక్‌కు సమీపంలో ఇద్దరు పాకిస్థాన్ జాలర్లను కాపాడినట్టు భారత ఓడలు ఐసీజీఎస్ సామ్రాట్ షిప్‌కు సమాచారం ఇచ్చాయి. అప్పటికే నలుగురు పాకిస్థానీ జాలర్లు ప్రాణాలు విడిచారు. కొనప్రాణాలతో దొరికిన ఇద్దరు జాలర్లకు భారత కోస్ట్ గార్డు అధికారులు సరైన వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. వారి బాగోగులను చూసుకున్నారు.
ఈ క్రమంలోనే భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. జాధవ్‌కు ఉరిశిక్ష విధించాలన్న పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారత జైలులో ఉన్న 12 మంది పాకిస్థాన్ జాలర్లను విడుదలను నిలిపివేసింది.