కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?
గూఢచారిగా పేర్కొంటూ భారతీయుడైన కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించడంతో దాయాది దేశాల మధ్య సంబంధాలు మరింత జఠిలంగా, మరింత ఉద్రిక్తంగా మారాయి. జాధవ్‌కు న్యాయం చేసేందుకు అసాధారణ చర్యలకూ వెనకాడబోమని భారత్.. అన్ని ఒత్తిళ్లను తట్టుకోగలమని, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమకుందంటూ పాకిస్తాన్ వాగ్యుద్ధానికి తెరతీశాయి. ఈ నేపథ్యంలో.. భారత్ ముందు, కుల్‌భూషణ్ ముందు ఉన్న మార్గాలివీ..
దౌత్యపరంగా..
⇒ వివిధ దౌత్య మార్గాల ద్వారా పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడం. లోపభూయిష్టమైన విచారణను ఎత్తిచూపడం, గోప్యతను పాటించారని, బలమైన సాక్ష్యాలు లేవని, భారత దౌత్యాధికారులను అతన్ని కలిసేందుకు అనుమతించలేదనే విషయాన్ని వివరించాలి.
⇒ సౌదీ అరేబియా సహా పాక్‌తో సత్సంబంధాలున్న దేశాల ద్వారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మధ్యవర్తిత్వం ద్వారా జాధవ్ విడుదలకు ప్రయత్నించడం.
న్యాయపరంగా...
⇒ పాక్ ఆర్మీ యాక్ట్ ప్రకారం... శిక్ష ఖరారైనప్పటి నుంచి 60 రోజుల్లోగా జాధవ్ తనకు విధించిన మరణశిక్షపై మిలటరీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయవచ్చు.
ళీ కోర్టు మార్షల్లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సివిల్ కోర్టులో దావా వేయొచ్చు. 7.2.3 సెక్షన్ ప్రకారం మిలటరీ కోర్టులో శిక్ష పడ్డవారు సివిల్ కోర్టులో సమీక్ష కోరొచ్చు.
⇒ అప్పీలు చేసుకునేందుకున్న 60 రోజుల గడువు ముగిశాక... పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పెట్టుకునేందుకు మరో 60 రోజుల గడువు ఉంటుంది.
పాక్ ఏం చేయొచ్చు...
న్యాయ ప్రక్రియ ముగిసేందుకు సమయం పడుతుంది. ఒకవేళ అప్పీలులోనూ మరణశిక్షే ఖరారైనా.. పాక్ అతన్ని ఉరితీయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌ను బెదిరించడానికి, బేరసారాలకు అతన్ని పాక్ వాడుకుంటుందని అంచనా. గతంలోనూ ఇలాంటివి జరిగాయని వారు ఉదహరిస్తున్నారు.
వియన్నా ఒడంబడిక ఏం చెబుతోంది..!
1961లో కుదిరిన వియన్నా ఒడంబడికపై భారత్, పాక్‌లు కూడా సంతకాలు చేశాయి. ఈ ఒడంబడిక ఆర్టికల్ 36(1) ప్రకారం... ఎవరైనా విదేశీయుడిని అరెస్టు చేస్తే అతని దేశానికి చెందిన రాయబారులకు కొన్ని హక్కులు ఉంటాయి. అవి..
► నిర్బంధంలో లేదా జైలు శిక్షను అనుభవిస్తున్న తమ దేశీయుడిని సంప్రదించడానికి రాయబార కార్యాలయ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అరెస్టు అయిన వ్యక్తికీ... తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించే స్వేచ్ఛ ఉంటుంది..
► అరెస్టయిన, అభియోగాలను ఎదుర్కొంటున్న లేదా శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి కోరితే... నిర్భందించిన సమాచారాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెంటనే తెలియజేయాలి. రాయబార కార్యాలయానికి అరెస్టయిన వ్యక్తి రాసే ఉత్తరాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలి. అలాగే అరెస్టయిన వ్యక్తికి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే విషయంలో అతనికున్న హక్కులను వెంటనే చెప్పాలి.
► జైల్లో ఉన్న తమ దేశస్తుడిని కలిసే హక్కు రాయబార కార్యాలయ అధికారులకు ఉంటుంది. సదరు వ్యక్తితో మాట్లాడే, ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే, అతని తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేసే హక్కు కూడా ఉంటుంది. ఎదుర్కొంటున్న అభియోగాలేమిటనే దానితో సంబంధం లేకుండా... జైళ్లలో ఉన్న తమ దేశస్తులను ఎవరినైనా దౌత్య సిబ్బంది కలవొచ్చు.
కోర్టు మార్షల్ చేయొచ్చా!
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన వారిని న్యాయస్థానాల్లో విచారించాలి. అయితే కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ కోర్టు మార్షల్ (సైనిక న్యాయస్థానాల్లో విచారించడం) చేసింది. పాక్ ఆర్మీ యాక్ట్‌లోని సెక్షన్–59 కింద కుల్‌భూషణ్‌కు ఉరిశిక్ష విధించింది. పౌర ప్రదేశాల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడే వారిని శిక్షించే ఉద్దేశంతో 2015లో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్షన్–59ను చేర్చారు.
దీంట్లో గూఢచర్యం, దేశద్రోహానికి పాల్పడిన వారిని సైతం విచారించే వెసులుబాటు ఉంది. సైన్యానికి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టిన ఈ చట్టం తీవ్ర దుర్వినియోగమవుతోంది. మానవహక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై ప్రభుత్వం ప్రయోగిస్తోంది. దీనికింద మొత్తం 274 మందిని విచారించగా.. ఒక్కరూ నిర్దోషిగా బయటపడలేదు. 161 మందికి మరణశిక్ష విధించగా, మిగిలిన 113 మందికి జైలు శిక్ష పడింది. ఇటీవలే ఈ చట్టాన్ని మరో రెండేళ్లు పొడిగించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్