కుల్‌భూషణ్ జాధవ్‌పై రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ : బిడ్డతో ఓ తల్లి, భర్తతో ఓ భార్య సమావేశాన్ని పాకిస్తాన్ విష ప్రచారానికి వినియోగించుకుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌లో జాధవ్ తల్లి, భార్య సమావేశంపై రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు. సమావేశానికి వెళ్లే ముందు జాధవ్ భార్యతో మాత్రమే కాకుండా, ఆయన తల్లితో కూడా గాజులు, మంగళసూత్రం, బొట్టులను తీయించినట్లు చెప్పారు.
జాధవ్ తల్లి అవంతితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. తొలిమాటగా నాన్న ఎలా ఉన్నారని? జాధవ్ అడిగినట్లు చెప్పారు. మంగళసూత్రం మెడలో లేకపోవడం చూసి జాధవ్ అలా అడిగినట్లు వెల్లడించారు. జాధవ్ భార్యతో తన బూట్లు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పాక్ అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఆ బూట్లలో కెమెరా ఉందంటూ పాకిస్తాన్ ప్రకటన చేయడం మరింత నీచానికి దిగజారడమేనని అన్నారు.
పాకిస్తాన్‌కు చేరుకునేందుకు జాధవ్ భార్య రెండు సార్లు విమానం ఎక్కారని చెప్పారు. బూట్లలో ఏదైనా ఉంటే ఎయిర్‌పోర్టులో పట్టుకునేవారని అన్నారు. మావవతా దృష్టితో జాధవ్‌ను కలవడానికి అంగీకరించామని చెబుతూ పాకిస్తాన్ ఇలాంటి నీచకార్యాలకు పాల్పడటం అమానుషమని అన్నారు. జాధవ్ కుటుంబసభ్యుల మానవ హక్కులు పాకిస్తాన్‌లో పదే పదే ఉల్లంఘనకు గురయ్యాయని చెప్పారు. ఓ భీతావాహ వాతావరణంలో జాధవ్‌ను కుటుంబ సభ్యులు కలిశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాధవ్ తల్లి చీర మాత్రమే కట్టుకుంటారని ఆమెతో సాల్వార్ కుర్తా వేయించారని తెలిపారు. జాధవ్‌తో ఆయన తల్లిని మరాఠీలో సంభాషించనివ్వలేదని వెల్లడించారు. అయినా ఆమె మరాఠీలో మాట్లాడేందుకు యత్నించడంతో ఇంటర్‌కామ్‌ను పాకిస్తాన్ అధికారులు ఆపివేసినట్లు తెలిపారు. జాధవ్‌ను సురక్షితంగా విడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జాధవ్ తల్లి, భార్యలతో అమర్యాదగా ప్రవర్తించడాన్ని ప్రతి భారతీయుడితో అమర్యాదగా ప్రవర్తించడంగా భావిస్తున్నట్లు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజకీయ భేధాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల పట్ల అగౌరవంగా నడుచుకుంటే సహించబోమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment