న్యూఢిల్లీ: తమ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు రాయబార అనుమతిని ఇస్తామంటూ దాయాది పాకిస్థాన్ గురువారం వెల్లడించింది. ఆగస్టు 2న కులభూషణ్‌ను కలిసేందుకు భారత్ అధికారులకు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై భారత్ జవాబు ఇవ్వాల్సి ఉంది.
గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు భారత్‌కు కాన్సులర్ అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు కాన్సులర్ అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment