రఘునందన్‌కు ఉరే సరి | Murderer Raghunandan Yandamuri appealed to judge for the death penalty, but jury still to decide his fate | Sakshi
Sakshi News home page

రఘునందన్‌కు ఉరే సరి

Published Thu, Oct 16 2014 1:48 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

రఘునందన్‌కు ఉరే సరి - Sakshi

రఘునందన్‌కు ఉరే సరి

అమెరికాలో చిన్నారి శాన్వీని, ఆమె నాయనమ్మను హత్య చేసిన కేసులో కోర్టు తీర్పు
 
మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేయాలనుకున్న జ్యూరీ
హత్యల తీవ్రత, దోషి మానసిక స్థితి చూసి మరణశిక్ష ఖరారు

 
న్యూయార్క్: అమెరికాలోని పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వీని కిడ్నాప్ చేయడానికి యత్నించి ఆ పసికందును, ఆమె నాయనమ్మ సత్యావతిని దారుణంగా చంపేసిన కేసులో విశాఖపట్నా నికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యండమూరి రఘునందన్(28)కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ జంట హత్యలపై రెండేళ్ల విచారణ అనంతరం మాంట్‌గోమెరీ కౌంటీ కోర్టు జ్యూరీ, రఘునందనే ఈ హ త్యలు చేశాడని ఇటీవల నిర్ధారించింది. జూదానికి బానిసైన రఘునందన్ భారీగా బకాయిలు పడడంతో, వాటిని తీర్చడానికి కిడ్నాప్ ప్లాన్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌నకు అడ్డొచ్చిన చిన్నారి నాయనమ్మ వెన్న సత్యావతి(61)ని కత్తితో పొడిచి, పది నెలల పసికందు వెన్న శాన్వీని ఊపిరాడకుండా చేసి చంపేశాడని స్పష్టమైంది.

పశ్చాత్తాప పడని రఘునందన్ : ఈ కేసును ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులతో కూడిన జ్యూరీ విచారించింది. విచారణ సమయంలో, చిన్నారి హత్య జరిగిన తీరు తెలిసి, సాక్ష్యాధారాలు చూసి న్యాయమూర్తులే కన్నీళ్లు పెట్టగా.. రఘునందన్ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు. తనకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా, ఈ వాదనలన్నీ వింటూ కూర్చొనే కంటే తనకు ఉరిశిక్ష విధిస్తే దాన్ని స్వీకరిస్తానని అనడం జ్యూరీని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. శిక్ష ఖరారుపై జ్యూరీ మంగళవారం మూడున్నర గంటలపాటు చర్చించింది. రఘునందన్‌కు మొదట పెరోల్ లేని యావజ్జీవ శిక్ష వేసే అంశాన్ని పరిశీలించింది.చివరికి హత్యలో క్రూరత్వం, అతడి వాంగ్మూలం, మానసిక స్థితి, మితిమీరిన జూదం అలవాట్లు పరిశీలించాక ఉరే సరైన శిక్ష అని తేల్చింది. 45 రోజుల్లో అతడికి శిక్ష అమలు చేసే అవకాశముంది.http://img.sakshi.net/images/cms/2014-10/71413404573_Unknown.jpg

శిక్ష విన్నా.. నోట్స్ రాసుకుంటూ

 తనకు ఉరిశిక్ష విధించినట్లు జ్యూరీ ప్రకటించినా కూడా రఘునందన్‌లో ఎలాంటి స్పందనా లేదని, తలవంచుకుని ఏదో నోట్స్ రాసుకుంటూ కనిపించాడని స్థానిక మీడియా తెలిపింది. కాగా, బాధిత కుటుంబం కోరుకున్న శిక్ష ఇదేనని మాంట్‌గోమెరీ కౌంటీ మొదటి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ కెవిన్ స్టీల్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సమంతా కఫ్‌మన్ చెప్పారు. ‘‘ఈ శిక్ష వారు కోల్పోయినదాన్ని వారికి తిరిగివ్వలేదు. కానీ సాంత్వన చేకూర్చగలదంతే’’ అని పేర్కొన్నారు. విచారణ తొలి దశలో రఘునందన్ తన కేసును తానే వాదించుకున్నాడు, శిక్ష ఖరారు దశలో హెన్రీ హిలెస్‌ను తన అటార్నీగా పెట్టుకున్నాడు.

ఇదీ కేసు

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వెన్న శాన్వీ తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. పెన్సిల్వేనియాలోని ‘కింగ్ ఆఫ్ ప్రూసియా’ అనే అపార్టుమెంట్‌లో నివసించేవారు. 2012 అక్టోబరు 12న చిన్నారి శాన్వి కిడ్నాప్‌కు గురైంది. పాప నాయనమ్మ దారుణంగా హత్యకు గురైంది. ఈ క్రమంలో శాన్వీ కోసం వెతుకుతున్న పోలీసులకు అక్కడో లేఖ కనిపించింది. 50 వేల డాలర్లు ఇస్తేనే పిల్లను విడిచి పెడతానని, లేదంటే చంపేస్తానంటూ ఆ లేఖలో ఉంది. అయితే శాన్వీ తల్లిదండ్రులను బాగా తెలిసిన వాళ్లు మాత్రమే పిలిచే పేర్లను ఆ నోట్‌లో పేర్కొనడంతో పోలీసుల దర్యాప్తు సులభమైంది. దీంతో బాగా తెలిసినవాళ్లపై ఆరా తీసిన పోలీసులకు.. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ వాడే అయిన రఘునందన్‌పై అనుమానమొచ్చింది. మొదట్లో తానే హత్యలు చేశానని రఘునందన్ అంగీకరించాడు. తాను కిడ్నాప్ చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ శాన్వీ నాయనమ్మ ఉండడంతో తాను షాక్ తిన్నానని, ఆమె ను తప్పించుకునే క్రమంలో కూరగాయల కత్తితో పొడిచి చంపేశానని రఘునందన్ దర్యాప్తులో వెల్లడించాడు. తర్వాత పాప ఏడిస్తే చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోతుందన్న భయంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశానని, ఆమె చుట్టూ ఒక బట్ట చుట్టానని, తర్వాత బేస్‌మెంట్‌లోని చెత్తబుట్టలో పెట్టానని తెలిపాడు. తర్వాత పాప కోసం పాలు తీసుకొచ్చి చూడగా.. పాప మరణించిం దని వెల్లడించాడు. అయితే విచారణలో తనకేమీ తెలియదంటూ బుకాయిస్తూ వచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement