Story Of A Pennsylvania Man Gary Heidnik Who Kidnapped And Brutally Tortured 6 Women - Sakshi
Sakshi News home page

మనిషి కాదు.. నరరూప రాక్షసుడు

Published Thu, Feb 4 2021 6:23 PM | Last Updated on Fri, Feb 5 2021 7:45 AM

Pennsylvania Man Who Kidnapped Tortured Molested 6 Women Story - Sakshi

జోసెఫినా రివెరా పడుపు వృత్తితో పొట్టపోసుకునేది. జాక్వెలిన్‌ ఆస్కిన్స్‌ కూడా అంతే. రివెరాలాగే తనొక వేశ్య‌. వృత్తి ఒక్కటే కాదు.. వీరిద్దరిలో ఉన్న మరో సారూప్యత ఏమిటంటే.. ఇద్దరూ ‘హైడ్నిక్‌’ బాధితులే. అతడి చేతిలో చిత్రహింసలు అనుభవించినప్పటికీ బతికి బయటపడగలిగారు. అతడి అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు. అవును... గ్యారీ హైడ్నిక్‌ నరరూప రాక్షసుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు యువతులను అపహరించి, వారికి నరకం చూపించాడు. ప్రతిరోజూ అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడటమే గాక, వారిని హింసిస్తూ ఆనందం పొందేవాడు. అనంతరం ఒక్కొక్కరిని చంపేసి, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలు తినే ఆహారంలో కలిపి మిగతా వాళ్లకు పెట్టేవాడు. 

నవంబరు 1986 నుంచి 1987 మార్చి వరకు అతడి రాక్షసకాండ కొనసాగింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అతడికి దగ్గరైనట్లు, అతడిలాగే ఆలోచిస్తున్నట్లు నటించి, నమ్మించి రివెరా చేసిన సాహసంతో ఆమెతో పాటు ఆస్కిన్స్‌ కూడా నరకకూపం నుంచి తప్పించుకుంది. పోలీసులకు సమాచారం అందించి హైడ్నిక్‌ను అరెస్టు చేయించింది. ఈ క్రమంలో అతడిపై హత్య, లైంగికదాడి, కిడ్నాప్‌ తదితర నేరాల కింద కేసు నమోదైంది. దోషిగా తేలడంతో లీథల్‌ ఇంజక్షన్‌ ఇచ్చి హైడ్నిక్‌కు మరణశిక్ష అమలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన గురించి రివెరా, ఆస్కిన్స్‌ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అతడి దురాగతాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

గ్యారీ హైడ్నిక్‌ తనను తాను మత గురువుగా చెప్పుకొనేవాడు. అలా స్థానికుల్లో ఆధ్మాత్యిక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతడిని చూస్తే ఇన్ని నేరాలు చేశాడంటే నమ్మబుద్ధి కాదు. 1986, నవంబరు 25న అతడు రివెరాను కిడ్నాప్‌ చేశాడు. గొంతునులిమి పట్టి, చేతులకు బేడీలు వేసి బలవంతంగా ఆమెను లాక్కెళ్లాడు. తన ఇంట్లో బంధించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అలా రివెరా అతడి కామానికి బలై పోయిన తొలి బాధితురాలిగా మారింది. రివెరా తర్వాత సాండ్రా లిండ్సే(24), లీసా థామస్‌(19), డెబోరా డూడ్లీ(23), జాక్వెలిన్‌ ఆస్కిన్స్‌(18), ఆగ్నస్‌ ఆడమ్స్‌(24)ను హైడ్నిక్‌‌ కిడ్నాప్‌ చేశాడు. వాళ్లందరినీ తన ఇంటి బేస్‌మెంట్‌ ఏరియాలో బంధీలుగా చేసి హింసించేవాడు. హైడ్నిక్‌‌ నేర చరిత్ర ఆధారంగా ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ అనే సినిమాలో సీరియల్‌ కిల్లర్‌ బఫెలో బిల్‌ క్యారెక్టర్‌ను సృష్టించారు కూడా.

లిండ్సేను మా కళ్లముందే..
ఆర్నెళ్ల కాలంలో తమను హైడ్నిక్‌‌ ఏవిధంగా చిత్రహింసలు పెట్టాడో చెబుతూ రివెరా, ఆస్కిన్స్‌ ఒళ్లు గగుర్పొడిచే విషయాలు పంచుకున్నారు. లిండ్సే మణికట్టును గొలుసు వేసి, సీలింగ్‌కు ఆమెను వేలాడదీసి కొన్ని రోజులపాటు అలాగే ఉంచేశాడు హైడ్నిక్‌‌. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉండేవాడు. దీంతో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. దానికి తోడు పస్తులుంచడంతో ఆకలికి తట్టుకోలేక ఆమె మరణించింది. అయినప్పటికీ హైడ్నిక్‌‌ క్రూర మనసు శాంతించలేదు. లిండ్సే శరీరాన్ని ముక్కలుగా కోసి మాంసం వండాడు. కుక్కలు తినే ఆహారంతో దానిని కలిపి మిగతా బాధితురాళ్లకు వడ్డించాడు. అంతేగాక తన రాకపోకలకు సంబంధించిన కారు శబ్దాలు వినపడకుండా స్క్రూ డ్రైవర్‌తో వారి చెవుల్లో పొడిచి చెవిటి వాళ్లను చేసేశాడు.

ఇక డుడ్లీ విషయానికొస్తే.. ఆమెను నీటి గుంటలో నిలబెట్టి ఎలక్ట్రిక్‌ షాకిచ్చి చంపేశాడు. మిగతావారిని సైతం ఇలాగే చిత్ర విచిత్ర పద్ధతుల్లో హతమార్చాడు. ఇవన్నీ చూస్తూ భయపడిపోయిన రివెరా, హైడ్నిక్‌‌ను మచ్చిక చేసుకుని బయటపడాలని భావించింది. అందుకు తగ్గట్టుగా అతడికి మద్దతుగా ఉన్నట్లు మాట్లాడుతూ.. సంకెళ్లు విడిపించుకుంది. రివెరాను పూర్తిగా నమ్మిన హైడ్నిక్‌‌ ఆమె తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చాడు. అక్కడి నుంచి బయటపడ్డ రివెరా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైడ్నిక్‌‌ రాక్షసక్రీడ ముగిసిపోయింది. (చదవండి: 93 మందిని చంపేశాడు; ‘అందులోనే అసలైన మజా’!)

తొలుత డిన్నర్‌కు తీసుకువెళ్లాడు..
ప్రాస్టిట్యూట్‌గా ఉన్న ఆస్కిన్స్‌ దగ్గరకు వచ్చిన హైడ్నిక్‌‌ తొలుత ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి సరదాగా గడిపాడు. ఆమెతో స్నేహంగా నటిస్తూనే, వీడియో గేమ్‌ ఆడుకుంటున్న సమయంలో ఆస్కిన్స్‌ వెనుకగా వెళ్లి గొంతు నులిమి, చేతులు కట్టేసి ఈడ్చుకెళ్లి బేస్‌మెంట్‌లో పడేశాడు. దీంతో ఆస్కిన్స్‌ ఏడుపులతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. అక్కడ అప్పటికే బంధీగా ఉన్న రివెరా ఆస్కిన్స్‌కు ధైర్యం చెప్పింది. ఎలాగైనా తనను విడిపిస్తానని మాట ఇచ్చింది. అన్నట్లుగానే ఆమెను బయటకు తీసుకువచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ మిగతా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నట్టు... వీరంతా నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement