
దైవదూషణ: క్రైస్తవుడికి మరణదండన!
ఇస్లామాబాద్: దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవుడికి మరణదండన విధించారు. స్నేహితుడికి వాట్సాప్‌లో ఓ పద్యాన్ని పంపడమే అతని నేరం. నదీమ్ జేమ్స్ మసిహ్ ఈ మేరకు ఉరిశిక్ష ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్‌లో తనకు ఓ పద్యాన్ని పంపించాడని, అది దైవదూషణ చేసేవిధంగా ఉందంటూ జేమ్స్‌పై అతని స్నేహితుడు యాసిర్ బషీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, డిఫెన్స్ లాయర్ మాత్రం తన క్లయింట్ అమాయకుడని, అతను ఓ ముస్లిం బాలికతో సంబంధం కలిగి ఉండటంతోనే అతనిపై తప్పుడు అభియోగాలు మోపారని తెలిపారు. అతనికి విధించిన మరణదండనను లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని సరా ఈ ఆలంజిర్‌కు చెందిన జేమ్స్‌పై దైవదూషణ ఫిర్యాదు రావడంతో ఉన్మాద మూక నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఛాందసవాదుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ జైల్లోనే అతని కోర్టు విచారణ సాగింది. న్యాయమూర్తి అతనికి మరణదండనతోపాటు రూ. మూడు లక్షలు జరిమానా విధించారు. ప్రస్తుతం జేమ్స్ కుటుంబాన్ని భద్రతాపరమైన కస్టడీలోకి తీసుకొని.. గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు.
పాకిస్థాన్‌లో క్రైస్తవులు..!
ప్రధానంగా ముస్లింలు మెజారిటీ గల పాకిస్థాన్‌లో సుమారు 20లక్షల మంది క్రైస్తవులు ఉంటారు. దైవదూషణ ఆరోపణలతో మైనారిటీ క్రైస్తవులపై ఛాందసవాద, అతివాద గ్రూపులు, ఉగ్రవాదులు తరచూ దాడులు జరుపుతున్నారు. 2015లో ఖురాన్‌ను కించపరిచారనే ఆరోపణలతో క్రైస్తవుల దంపతులిద్దరినీ ఇటుకల బట్టీలో వేసి తగులబెట్టిన ఘటన చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలతో రెండేళ్ల కిందట లాహార్‌లో 125 క్రైస్తవ గృహాలను తగలబెట్టారు.