
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్, అతని కుటుంబ సభ్యుల సమావేశం ఆద్యంతం పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పట్ల భారత్ తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ భేటీకి సంబంధించి ఇరు దేశాలు ముందుగా ఏర్పరచుకున్న అవగాహనలను, స్ఫూర్తిని పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. సమావేశాన్ని స్వేచ్ఛా వాతావరణంలో కాకుండా అడుగడుగునా కట్టదిట్టమైన నియంత్రణలతో నిర్వహించారని తెలిపింది. గూఢచర్య కేసులో పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ సోమవారం ఇస్తామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయంలో తన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ను కలిశారు. అయితే, జాధవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు, వేధింపులకు గురవుతున్నట్లు కనిపించారని భారత్ పేర్కొంది. జాధవ్ పరిస్థితిని చూస్తే ఆయన ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపిస్తోందని ఆనుమానం వ్యక్తంచేసింది.
‘పాక్ చాలా దారుణంగా వ్యవహరించింది. జాధవ్‌ను కలవడానికి వెళ్లే ముందు అతని తల్లి, భార్య మంగళసూత్రాలు, గాజులు, బొట్టును తొలగించారు. దుస్తులు మార్చుకోమన్నారు. మహిళల మత, సంప్రదాయ విలువలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. పాక్ విడుదల చేసిన వీడియోలో జాధవ్ మాట్లాడిన మాటలు కూడా ఎవరో అల్లిన కట్టుకథలా ఉన్నాయి. తాను పాక్‌లో భారత గూఢచారిగా పనిచేసినట్లు బెదిరించి ఆయనతో చెప్పించారు. జాధవ్æ భార్య, తల్లితో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలో అతని చెవి, మెడ వద్ద గాయాలు కన్పించాయి. దీన్ని బట్టి చూస్తే జాధవ్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో ఆక్షేపించింది.
‘సమావేశం జరిగిన తీరు భయానకంగా ఉంది. జాధవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అయితే వారు ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంతో, సాహసంతో ఎదుర్కొన్నారు’ అని తెలిపింది. జాధవ్ తల్లిని మాతృ భాష మరాఠీలో మాట్లాడనివ్వలేదని, ఆమెకు అడ్డుతగిలారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశం అనంతరం జాధవ్ భార్య తన బూట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియాను లోనికి అనుమతించకూడదనే నిబంధనను పాటించలేదని, పాక్ విలేకరులు పదే పదే జాధవ్ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అనవసర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని భారత్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, జాధవ్ కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను మంగళవారం కలిశారు.
భారతీయులకు అవమానం: కాంగ్రెస్
జాధవ్, అతని కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో అవలంబిస్తున్న అసంబద్ధ, ఊగిసలాట ధోరణి వల్ల అనిశ్చిత వాతావరణం నెలకొంది’ అని కాంగ్రెస్ విమర్శించింది.