న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన మరణ శిక్ష విషయంలో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తీర్పు వెలువరించనుంది. ఇండియాకు అనుకూలమైన తీర్పు రాగలదని మన ప్రభుత్వం భావిస్తోంది. ఐసీజే ఇచ్చే తీర్పును తాము స్వీకరిస్తామని పాకిస్తాన్ అధికారులు కూడా చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కోసం కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పాకిస్థాన్ ఆయనను బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 2016 మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది.
ఇరాన్‌లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. జాధవ్ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది.
పునర్విచారణ జరుగుతుందా?
గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇండియాకు చెందిన సరబ్జిత్ సింగ్‌కు సైతం గతంలో పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. 22 ఏళ్ల పాటు పాక్ జైలులో మగ్గిపోయిన సింగ్ జైలులో తన తోటి ఖైదీలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబయి టెకీ అన్సారీని కూడా గతంలో ఆ దేశం లాహోర్ జైలులో నిర్బంధించింది. ఇండియా జోక్యంతో నిరుడు అతణ్ణి విడుదల చేసింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో జాధవ్ కేసుపై పునర్విచారణ జరపాల్సిందిగా ఐసీజే ఆదేశించవచ్చుననే మాటలు వినిపిస్తున్నాయి. కాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు పాకిస్థాన్ మూడుసార్లు ప్రయత్నించినట్టు ప్రముఖ భారతీయ న్యాయవాది హరీశ్ సాల్వే గతంలో తెలిపారు. ఐసీజేను ఓ నాటకశాలగా మార్చిందంటూ భారత్‌పై ఆడిపోసుకుంటున్న పాకిస్థాన్.. జాధవ్‌ను రక్షించేందుకు పెట్టిన కేసును కొట్టేయాలని వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment