పాక్ దుశ్చర్యపై ఐసీజేను ఆశ్రయిస్తాం!
- కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాధికారిని చిత్రహింసలుపెట్టి హతమార్చిన పాక్ ఆర్మీ
- సుప్రీంకోర్టు అనుమతిస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో తమకు బందీగా చిక్కిన భారతీయ సైన్యాధికారి కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ దళాలు చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన ఘటనకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించాలని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి అనుమతి కోరాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా, కామన్వెల్త్ నిబంధనల ప్రకారం.. ఆ కూటమి సభ్య దేశాలుగా భారత్, పాక్‌లు సాయుధ సంఘర్షణలు సహా ఏ విషయంపైనైనా ఐసీజేను ఆశ్రయించకూడదు. యూపీఏ ప్రభుత్వం కూడా గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కేసు విషయంలో ఐసీజే ముందుకు వెళ్లేందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది.
ఇదే విషయాన్ని గత ఏడాది ప్రస్తుత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా పార్లమెంటుకు విన్నవించారు. అయితే, కేసులోని ‘అసాధారణత్వా’న్ని పరిగణనలోకి తీసుకుని ఈ కేసును ఐసీజే ముందుకు తీసుకెళ్లే విషయంపై తీవ్రంగా చర్చించిన ప్రస్తుత కేంద్ర కేబినెట్.. సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ఐసీజే ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి అవసరమైన న్యాయపర అనుమతిపై ఆదేశాలివ్వాల్సిందిగా సుప్రీంను కోరాలని నిర్ణయించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్‌లు సోమవారం వేర్వేరుగా వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టత కోరుతూ ఆగస్ట్ 25 లోగా అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది.
కనుగుడ్లను పీకేసి, మర్మాంగాలను కోసేసి..
1999, మే 15న కశ్మీర్లోని కార్గిల్‌లో గస్తీకి వెళ్తిన కాలియా, మరో ఐదుగురు జవాన్లను సజీవంగా పట్టుకున్న పాక్ ఆర్మీ.. వారిని దారుణమైన చిత్రహింసలకు గురిచేసి, 15 రోజుల తర్వాత వారి మృతదేహాలను భారత్‌కు అప్పగించింది. కాలియా మర్మాంగాలను కోసేసి, కనుగుడ్లను పీకేసి, కాళ్లు, చేతులు నరికేసి, వేడి ఇనుప చువ్వను చెవిలో దూర్చి, దంతాలను పీకేసి.. అత్యంత పాశవికంగా చంపారు. కాలియా దేహంలోని అన్ని ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. మృతదేహాలను చూసిన భారత్‌లో పాక్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు కోరుతూ కాలియా తండ్రి ఎన్‌కే కాలియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.