నిలదీయటానికీ, నేరాన్ని వేలెత్తి చూపటానికీ సంపన్న రాజ్యమే కానవసరం లేదని, గుప్పెడు ధైర్యం, నిటారైన వెన్నెముక వుంటే చాలని దక్షిణాఫ్రికా నిరూపించింది. గాజా అనే ఒక చిన్న ప్రాంతాన్ని గుప్పిట బంధించి గత మూడు నెలలుగా సామూహిక జనహననం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)కు ఈడ్చి సవాలు విసిరింది. అమెరికాతో సహా అగ్రరాజ్యాల అండదండలున్న ఇజ్రాయెల్ ఈ పరిణామానికి జడిసి తన దారుణ మారణకాండను వెంటనే ఆపుతుందనుకోవటానికి లేదు.
వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ భద్రతా నిర్మాణాలను తొలగించా లని ఐసీజే 2004లో ఇచ్చిన తీర్పునే అది బేఖాతరు చేస్తోంది. కానీ వినతులతో, వేడుకోళ్లతో సరి పెడుతూ అంతకుమించి మరేమీ చేయని, మాట్లాడని ప్రపంచ దేశాలకు దక్షిణాఫ్రికా తీసుకున్న వైఖరి చెంపపెట్టు. ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందో లేదో నిర్ణయించటానికి దక్షిణాఫ్రికా వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్ సంజాయిషీని తెలుసుకుంది. అయితే విచారణ పూర్తయి తీర్పు రావటానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఈలోగా జాతిహననం, విధ్వంసం నిలిపివేయాలంటూ అత్య వసర ఉత్తర్వులివ్వాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. గత మూడు నెలలుగా గాజాపై సాగిస్తున్న ఏకపక్ష దాడుల్లో 23,000 మంది పౌరులు మరణించగా లక్షలాదిమంది గాయపడ్డారు. మృతుల్లో పదివేల మంది వరకూ మహిళలు, పసివాళ్లున్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ప్రాణాలతో మిగిలిన 20 లక్షలమంది పౌరులు నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. 70 శాతం ఇళ్లు, 50 శాతం భవంతులు బాంబు దాడుల్లో పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటికేఅంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇజ్రాయెల్, హమాస్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. జరిగిన జనహననం వెనకున్న ఉన్నత స్థాయివ్యక్తులెవరో, వారి యుద్ధ నేరాలేమిటో అది ఆరా తీస్తుంది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుత పరిష్కారం అన్వేషించటం ఐసీజే పని. ఇజ్రాయెల్ చేష్టలను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోబోదని చెప్పటమే దక్షిణాఫ్రికా చర్య వెనకున్న ఉద్దేశం.
ఇజ్రాయెల్ చరిత్ర గమనించినవారికి ఆ దేశంపై జినోసైడ్ (జాతిని తుడిచిపెట్టడం) నిందా రోపణ రావటం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే అనేక దేశాల్లో నిరాదరణకూ, ఊచకోతకూ గురై చెట్టుకొకరూ, పుట్టకొకరూ అయిన యూదులకు రెండో ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యాల చొరవతో ఇజ్రాయెల్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇప్పుడు అదే దేశంపై జనహనన ఆరోపణలు రావటం ఒక వైచిత్రి. జనవిధ్వంసానికి వ్యతిరేకంగా 1948లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికపై ఇజ్రాయెల్ కూడా సంతకం చేసింది. కానీ దాన్ని గౌరవించిన సందర్భం లేదు. నిజానికి తానే బాధిత దేశాన్నని ఇజ్రాయెల్ అంటున్నది. ఆక్టోబర్ 7న తన భూభాగంలోకి చొరబడిన హమాస్ ఉగ్ర వాదులు 1,200 మందిని కాల్చిచంపి, 240 మందిని బందీలుగా పట్టుకున్నారని, అందుకే తాము దాడులు చేయాల్సివస్తోందని ఇజ్రాయెల్ వాదన.
నిజమే... అమాయక పౌరులను భయపెట్టడం, హతమార్చటం నాగరిక ప్రపంచంలో ఏ ఒక్కరూ సమర్థించరు. తమకు అన్యాయం జరిగిందనుకుంటే శాంతియుతంగా పోరాడి సాధించుకోవాలి తప్ప హింసతో, బలప్రయోగంతో ఎదుర్కొనటం పూర్తిగా తప్పు. అలాంటి చర్యల వల్ల లక్ష్యం సిద్ధించదు సరిగదా... రాజ్యహింసకు లక్షలాదిమంది అమాయకులు బలవుతారు. అయితే హమాస్ చేతుల్లో మరణించిన పౌరులకు ప్రతిగా అవతలిపక్షం నుంచి ఎంతమందిని బలితీసుకుంటే తన దాహం చల్లారుతుందో ఇజ్రాయెల్ చెప్పగలదా? దాడు లకు కారకులైనవారిని పట్టుకోవటం, చట్టప్రకారం శిక్షించటం అనే ప్రక్రియను కాలదన్ని విచక్షణా రహితంగా యుద్ధవిమానాలతో బాంబుల మోతమోగించటం... హమాస్‌తో సంబంధం లేని సాధా రణ పౌరుల ప్రాణాలకూ, ఆస్తులకూ ముప్పు కలిగించటం ఎంతవరకూ న్యాయం? నిజానికి పాల స్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం వెదికేందుకు జరిగిన ప్రతి యత్నాన్నీ అడ్డుకున్నది ఇజ్రా యెలే.
ఒక దేశమంటూ లేకుండా, అత్యంత దుర్భరమైన బతుకులీడుస్తున్న పౌరులను దశాబ్దాలుగా అణచివేయటంవల్ల సమస్య ఉగ్రరూపం దాలుస్తుందని ఆ దేశం గ్రహించలేకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇజ్రాయెల్‌కు అండదండలందిస్తున్న అమెరికాకు దక్షిణాఫ్రికా చర్య మింగుడుపడటం లేదు. ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పి దాడులు ఆపించివుంటే అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట పెరిగేది. ఆ విషయంలో పూర్తిగా విఫలమై దక్షిణాఫ్రికాను నిందించటం అర్థరహితం.జాత్యహంకార పాలకులపై పోరాడి విముక్తి సాధించిన దక్షిణాఫ్రికాకు ఆదినుంచీ ప్రపంచ వ్యాప్తంగా బలహీనులపై బలవంతులు సాగించే దుండగాలను వ్యతిరేకించటం సంప్రదాయం. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్‌పై పిటిషన్ దాఖలు చేసింది.
రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం సాగిస్తున్న రష్యా తనకు మిత్రదేశమే అయినా దాని చర్యను దక్షిణాఫ్రికా తూర్పారబట్టింది. ప్రస్తుతం ఐసీజేలో వున్న 15 మంది న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ దక్షిణాఫ్రికా పిటిషన్‌ను విచారిస్తుంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ కొత్తగా చెరొక న్యాయమూర్తినీ నామినేట్ చేయొచ్చు. గాజాలో జరిగింది జాతి విధ్వంసమేనని నిరూపించటం ఐసీజే నిబంధనల ప్రకారంకొంత కష్టమేనని నిపుణులంటున్నారు. అయితే పిటిషన్ విచారణ క్రమంలో జాతి విధ్వంస పోకడలపై జరిగే చర్చవల్ల ప్రపంచ ప్రజానీకానికి వర్తమాన స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుంది. దోషులెవరో, శిక్ష ఎవరికి పడాలో తేటతెల్లమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment