ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటేస్తున్న ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీగా దల్వీర్ భండారీ గెలుపుతో ప్రపంచదేశాల్లో తన పలుకుబడిని భారత్ మరోసారి చాటుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ సంబంధాల్లో మరింత కీలక పాత్రను పోషించే దిశగా భారత్ సిద్ధమవుతోంది. దల్వీర్ గెలుపునకు మద్దతు కూడగట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఉన్నతాధికారుల బృందం, యూఎన్‌లోని దౌత్యాధికారుల లాబీయింగ్ మంచి ఫలితాన్నిచ్చింది.
భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ బెంచ్‌లో భారత జడ్జి ఉండడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే దల్వీర్ అభ్యర్థిత్వాన్ని మళ్లీ నామినేట్ చేసినప్పటి నుంచి గెలుపుకోసం ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. గత జూలైలో జీ 20 సమావేశంలో లాబీయింగ్‌ను మోదీ ప్రారంభించారు. చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశం, మయన్మార్ తదితర దేశాల్లో ద్వైపాక్షిక పర్యటనల్లోనూ భండారీ విజయానికి మోదీ మంత్రాంగం నడిపారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అధికారుల బృందం ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు చెందిన 100 దేశాల ప్రతినిధుల్ని సంప్రదించినట్లు సమాచారం. ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాయబారం కొనసాగిస్తూ వచ్చారు. దౌత్యపరమైన సమావేశాల్లో భండారీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించడంతో పాటు అవసరమైన మద్దతు సాధించడంపై సుష్మా, విదేశాంగ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. భండారీ మద్దతు కోసం మోదీ స్వయంగా పలువురు ప్రధానులకు లేఖలు రాశారని సమాచారం. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాల సందర్శన సమయంలో కసరత్తు చేశారు.
బ్రిటన్‌కు గట్టి దెబ్బ
అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1945లో ఐరాస అంతర్జాతీయ కోర్టు సంస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడంతో పాటు దేశీయంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. మరోవైపు దౌత్యపరంగా అంతర్జాతీయ ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో తాజా పరిణామాన్ని అవమానకర ఓటమిగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఐసీజే పదవి కోసం బ్రిటన్ చివరివరకూ అన్నిరకాల ఎత్తుగడలు, వ్యూహాలు అనుసరించినా ఫలితం దక్కలేదు.
హైకోర్టు టు ఐసీజే
తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది.
అంతర్జాతీయ స్కాలర్‌షిప్ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా’ చదివేందుకు మరో స్కాలర్‌షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు.
2012లో తొలిసారి ఎన్నిక
1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment