Dalveer Bhandari
-
అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్ ... ఊహించని షాక్‌లో రష్యా
Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. యూటర్న్ తీసుకున్న భారత న్యాయమూర్తి అయితే భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్ తగిలింది. (చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి) -
మానవీయ విలువలతోనే హక్కుల పరిరక్షణ
ఎస్కేయూ (అనంతపురం) : ‘మానవత్వంలోనే దైవ త్వం ఉంది. మానవీయ విలువలను కలిగి ఉంటూ మానవ హక్కులను కాపాడుకోవాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ‘మానవీయ విలువలు– చట్టబద్ధమైన ప్రపంచం’అనే అంశంపై అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవా సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సుకు జస్టిస్ దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 750 మంది న్యాయ నిపుణులు, 300 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ... ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కులను అనుభవించాలన్నారు. అహాన్ని తొలగించుకుంటేనే శాంతి లభిస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికత హేతుబద్ధంగాను, హేతుబద్ధమైన ఆధ్యాత్మికంగానూ ఉండాలన్నారు. మన రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలే కాకుండా మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుందని.. సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణ, శ్రీసత్యసాయి సేవా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు జతీందర్ చీమా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఎస్ఎస్ నాగానంద్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు నిమీశ్ పాండే, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ జడ్జీలు మధ్యవర్తిత్వం చేశారు
వాషింగ్టన్: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పనిచేసిన 13 మంది మాజీ జడ్జీలు, ఏడుగురు ప్రస్తుత జడ్జీలు వారి పదవీకాలంలో వివిధ వ్యాజ్యాల్లో మధ్యవర్తులుగా పనిచేశారని ఓ నివేదిక ఆరోపించింది. వారిలో బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ఉన్నారు. ఐసీజేలో జడ్జీగా భారత్ నుంచి ఎన్నికైన ధల్వీర్ భండారీ మధ్యవర్తిత్వం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కెనడాకు చెందిన అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సంస్థ (ఐఎస్ఎస్డీ) నివేదించింది. ఐరాస సాధారణ సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ధల్వీర్ భండారీ గెలుపొందగా, గ్రీన్వుడ్ మాత్రం వెనకే ఉండిపోయారు. బ్రిటన్‌కు చెందిన గ్రీన్వుడ్ తన పదవీ కాలంలో తొమ్మిది పెట్టుబడుల వివాదాల్లో మధ్యవర్తిగా పనిచేశారని నివేదిక పేర్కొం ది. రెండు కేసులకు ఆయన దాదాపు 4 లక్షల డాలర్లు తీసుకున్నట్లు తేలింది. అలాంటి 90 కేసుల్లో కేవలం 9 కేసులకు గాను జడ్జీలకు మొత్తం 10 లక్షల డాలర్లు ముట్టినట్లు ఐఎస్ఎస్డీ వెల్లడించింది. ప్రస్తుత ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం, ఐదుగురు మాజీ అధ్యక్షులు కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం. -
ఫలించిన భారత్ వ్యూహం
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీగా దల్వీర్ భండారీ గెలుపుతో ప్రపంచదేశాల్లో తన పలుకుబడిని భారత్ మరోసారి చాటుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ సంబంధాల్లో మరింత కీలక పాత్రను పోషించే దిశగా భారత్ సిద్ధమవుతోంది. దల్వీర్ గెలుపునకు మద్దతు కూడగట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఉన్నతాధికారుల బృందం, యూఎన్‌లోని దౌత్యాధికారుల లాబీయింగ్ మంచి ఫలితాన్నిచ్చింది. భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ బెంచ్‌లో భారత జడ్జి ఉండడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే దల్వీర్ అభ్యర్థిత్వాన్ని మళ్లీ నామినేట్ చేసినప్పటి నుంచి గెలుపుకోసం ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. గత జూలైలో జీ 20 సమావేశంలో లాబీయింగ్‌ను మోదీ ప్రారంభించారు. చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశం, మయన్మార్ తదితర దేశాల్లో ద్వైపాక్షిక పర్యటనల్లోనూ భండారీ విజయానికి మోదీ మంత్రాంగం నడిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అధికారుల బృందం ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు చెందిన 100 దేశాల ప్రతినిధుల్ని సంప్రదించినట్లు సమాచారం. ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాయబారం కొనసాగిస్తూ వచ్చారు. దౌత్యపరమైన సమావేశాల్లో భండారీ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించడంతో పాటు అవసరమైన మద్దతు సాధించడంపై సుష్మా, విదేశాంగ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. భండారీ మద్దతు కోసం మోదీ స్వయంగా పలువురు ప్రధానులకు లేఖలు రాశారని సమాచారం. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాల సందర్శన సమయంలో కసరత్తు చేశారు. బ్రిటన్‌కు గట్టి దెబ్బ అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1945లో ఐరాస అంతర్జాతీయ కోర్టు సంస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడంతో పాటు దేశీయంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. మరోవైపు దౌత్యపరంగా అంతర్జాతీయ ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో తాజా పరిణామాన్ని అవమానకర ఓటమిగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఐసీజే పదవి కోసం బ్రిటన్ చివరివరకూ అన్నిరకాల ఎత్తుగడలు, వ్యూహాలు అనుసరించినా ఫలితం దక్కలేదు. హైకోర్టు టు ఐసీజే తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది. అంతర్జాతీయ స్కాలర్షిప్ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా’ చదివేందుకు మరో స్కాలర్షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు. 2012లో తొలిసారి ఎన్నిక 1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐసీజే పోరులో భారత్ గెలుపు
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి మంగళవారం బ్రిటన్ తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ అతి పెద్ద దౌత్య విజయం సాధించినట్లైంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఐరాసలోని ఆధిపత్య దేశాలకు భండారీ విజయం గట్టి సందేశం పంపిందని, భారత్ శక్తివంతమైన దేశమనే అభిప్రాయం కలిగేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ ఏడాది ఐదు స్థానాలు ఖాళీ కాగా నాలుగింటికి ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరొకస్థానానికి దల్వీర్ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్‌లు సాధారణ సభ, భద్రతా మండలిలో 11 రౌండ్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 రౌండ్లలోను సాధారణ సభలో భండారీ మూడింట రెండింతల ఆధిక్యం సాధించగా, భద్రతా మండలిలో గ్రీన్వుడ్ మెజార్టీలో కొనసాగారు. మంగళవారం(భారత కాలమానం) 12వ రౌండ్ ఎన్నికలు జరగాల్సి ఉండగా గంట ముందు పోటీ నుంచి బ్రిటన్ వైదొలగింది. దీంతో భండారీ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు. రాజీ ప్రయత్నం విఫలం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు (అమెరికా కాలమానం) ఐరాస సాధారణ సభ, భ ద్రతా మండలిలు సమావేశం కావాల్సి ఉండ గా అనూహ్యంగా పోటీ నుంచి వైదొలుగుతు న్నట్లు బ్రిటన్ శాశ్వత ప్రతినిధి మాథ్యూ రైక్రాఫ్ట్ లేఖ రాశారు. తర్వాతి రౌండ్లలో కూడా ప్రతిష్టంభన తొలగేలా లేదని, కాలయాపన ఇష్టంలేక గ్రీన్వుడ్ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే ముందు భారత్, బ్రిటన్ మధ్య సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో పెట్టుకున్నామని, భవిష్యత్తులో కూడా అవి అలాగే కొనసాగుతాయని మాథ్యూ చెప్పారు. ఓటింగ్‌కు 3 గంటల ముందు సాధారణ సభ అధ్యక్షుడు మిరోస్లవ్ లాజ్‌కాక్, భద్రతా మండలి అధ్యక్షుడు సెబాస్టియనో కార్డిలు భారత్, బ్రిటన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గమని, ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని భారత్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఏ కారణంతో బ్రిటన్ పోటీ నుంచి వైదొలగిందనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఫలితాలు వెలువడగానే ఐరాస సాధారణ సభలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌ను ఇతర దేశాల ప్రతినిధులు అభినందించారు. ట్వీటర్లో మోదీ అభినందనలు భండారీ గెలుపు ఘనత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖకు దక్కుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ఐసీజేకు భారత్ మళ్లీ ఎన్నికయ్యేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మొత్తం విదేశాంగ శాఖ బృందానికి అభినందనలు. భండారీ ఎన్నిక దేశానికి గర్వకారణం’ అని పేర్కొన్నారు. ‘వందేమాతరం, అంతర్జాతీయ న్యాయస్థానం ఎన్నికలో భారత్ గెలుపొందింది. జైహింద్’ అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. మరోవైపు గ్రీన్‌వుడ్‌పై దల్వీర్ విజయం తమ దేశానికి అవమానకర పరిణామమని బ్రిటన్ మీడియా పేర్కొంది. హైకోర్టు టు ఐసీజే తాత, తండ్రి బాటలోనే దల్వీర్ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది. అంతర్జాతీయ స్కాలర్షిప్ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ లా’ చదివేందుకు మరో స్కాలర్షిప్ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు. 2012లో తొలిసారి ఎన్నిక 1977లో జైపూర్ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. -
ఐసీజేలో ఎన్నదగిన విజయం
ప్రపంచంలో అనేక దేశాలను కండబలంతో వలసలుగా మార్చుకుని తనది ‘రవి అస్తమించని రాజ్యమ’ని ఒకప్పుడు చెప్పుకున్న బ్రిటన్... ఆ దేశాల్లో ఒకటైన భారత్ చేతిలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. ఐసీజే న్యాయమూర్తి పదవికి మన దేశంనుంచి పోటీపడిన జస్టిస్ దల్వీర్ భండారీని ఎలాగైనా ఓడించాలని, ఆ పదవి దక్కించుకోవాలని అది శతథా ప్రయత్నించింది. కానీ పరిస్థితులు తనకు అనుకూలించడంలేదని, మొండిగా ముందుకెళ్తే భంగపాటు తప్పదని గ్రహించి తమ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌ను పోటీనుంచి తప్పించి భారత్‌కు మద్దతిచ్చింది. దాంతో జస్టిస్ భండారీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. ఇదంత సులభంగా ఏమీ కాలేదు. ఐక్యరాజ్యసమితిలో తనకు మెజారిటీ దేశాల మద్దతు లభించడం లేదని తెలిసినా... ఇలాంటి పరిస్థితుల్లో పోటీలో కొనసాగటం నైతికంగా సరికాదని అర్ధమైనా భద్రతా మండలిలో తనకున్న శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఓటింగ్‌ను ఆపించి, కాలం చెల్లిన ‘జాయింట్ కాన్ఫరెన్స్’ విధానాన్ని ప్రయోగించి గండం గట్టెక్కాలని బ్రిటన్ ఆలోచించింది. ఓటింగ్‌కు 12 రౌండ్లుంటే 11 రౌండ్ల వరకూ అది మొండిగా పోటీలో కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ఆ పదవి దక్కించుకున్నా సారాంశంలో అది ఓటమే అవుతుందనుకుందో... ‘జాయింట్ కాన్ఫరెన్స్’ ప్రతిపాదనకు అమెరికా నుంచి ఆశించిన మద్దతు లభించలేదో... బ్రెగ్జిట్ పర్యవసానంగా ఇబ్బందులు చుట్టుముట్టబోతున్న ఈ తరుణంలో భారత్ మనసు నొప్పించడం, అంత పెద్ద మార్కెట్‌కు దూరం కావడం తెలివితక్కువ చర్య అవుతుందని భావించిందో... చివరకు అది పోటీ నుంచి వైదొలగక తప్పలేదు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితిలో మన దూత సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు ఈ విజయానికి చేసిన కృషి గురించి కూడా చెప్పుకోవాలి. వారు పట్టుదలతో శ్రమించిన కారణంగానే ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 183 దేశాలు మన దేశానికి మద్దతునిచ్చాయి. భద్రతామండలిలోని 15 దేశాల ఓట్లూ లభించాయి. పోటీనుంచి తప్పుకోవడానికి ముందు భద్రతామండలిలో బ్రిటన్ హవాయే కొనసాగింది. అది మండలిలోని ఇతర శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లను కూడగట్టుకుంది. ఈ శాశ్వత సభ్య దేశాల్లో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా పదవిని చేజిక్కించుకోవడానికి, ఏ కీలక నిర్ణయాన్నయినా ఆపడానికి అవి కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. వాస్తవానికి పోటీనుంచి విరమించుకోవాలని మొన్న శుక్రవారం బ్రిటన్ నిర్ణయించినా ఇతర శాశ్వతసభ్య దేశాలు అందుకు అడ్డుతగిలాయని కథనాలు వచ్చాయి. రహస్య బ్యాలెట్ జరుగుతుంది గనుక ఎవరు ఎవరికి ఓటేశారో తెలియదుగానీ... అప్పటికి మండలి ఓటింగ్‌లో 9 దేశాలు బ్రిటన్వైపు నిలిచాయి. మనకు ఆరుగురి మద్దతు లభించింది. నిబంధనల ప్రకారం రెండింటిలోనూ మెజారిటీ కూడగట్టుకున్న దేశానికి మాత్రమే న్యాయమూర్తి పదవి దక్కాలి గనుక ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ దశలో శాశ్వతసభ్య దేశాల ముందు బ్రిటన్ ‘జాయింట్ కాన్ఫరెన్స్’ ప్రతిపాదన తీసుకొచ్చింది. దాని ప్రకారం సమితి నుంచి ముగ్గురూ, భద్రతామండలి నుంచి ముగ్గురూ సమావేశమై ఒక అభ్యర్థిని నిర్ణయించాలి. అయితే ఇది అమలు చేస్తే ఫలితం, పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. సమితి నుంచి వచ్చే ముగ్గురూ భండారీ పేరుకే కట్టుబడి ఉన్నపక్షంలో ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలన్న సందేహాలు అందరిలోనూ తలె త్తాయి. దీన్ని ఆనవాయితీగా తీసుకుని శాశ్వతసభ్య దేశాలను భవిష్యత్తులో ఎవ రైనా సవాలు చేసే పరిస్థితి ఏర్పడొచ్చు. బహుశా ఈ ఆలోచనే శాశ్వతసభ్యుల్లో పునరాలోచన కలిగించినట్టుంది. అందువల్ల దాని జోలికి పోకుండా భారత్‌కు మద్దతు పలకడమే శ్రేయస్కరమని బ్రిటన్‌కు ఆ దేశాలన్నీ నచ్చజెప్పి ఉండొచ్చు. నిజానికి సమితిలో ఆఫ్రికా దేశాలకున్నట్టు మనకంటూ ప్రత్యేక గ్రూపు లేదు. ఆర్ధికంగా, అభివృద్ధిపరంగా అవి వెనకబడిన దేశాలే కావొచ్చుగానీ ఆ 54 దేశాలూ ఏ విషయంలోనైనా కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. ఏ పదవికైనా ఎన్ని కలొచ్చినప్పుడు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయి. ఇతర దేశాల ప్రతినిధులను కూడా సమీకరించి గెలిపించుకుంటాయి. భారత్ పరిస్థితి అలా కాదు. ఒకప్పటి బ్రిటన్ వలస దేశాలు సభ్యులుగా ఉన్న కామన్వెల్త్లో ఒక్కో దేశానిది ఒక్కో దారి. ఈ సంస్థలోని యూరప్ ఖండ దేశాలు సహజంగా బ్రిటన్‌కు మద్దతునిస్తాయి. ఆసియా, పసిఫిక్, దక్షిణ అమెరికా దేశాల్లో కూడా భిన్నా భిప్రాయాలుంటాయి. అటు ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) సభ్యదేశాలు కూడా సమైక్యంగా ఉంటాయి. ఆ దేశాలు బలపర్చడంవల్ల లెబనాన్‌కు చెందిన నవాఫ్ సలాం గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని, సంఖ్యాపరంగా చెప్పాలంటే 121 ఓట్లను చేజి క్కించుకుంది. జస్టిస్ భండారీ ఎన్నికతో ఐసీజేలో ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థ 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు అందులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పైగా ఆసియా నుంచి సంస్థకు ఈసారి నలుగురు న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. అసలు భద్రతామండలిలో అయిదు అగ్రరాజ్యాలకున్న శాశ్వతసభ్యత్వమే పరమ అప్రజాస్వామికమైనది. పైగా ఆ అయిదింటికీ వీటో అధికారముంది. ఇప్పుడు ఐసీజే ఓటింగ్‌ను కూడా అవి తల్చుకుంటే నిలిపివేసేవి. కానీ సమితిలో ఇంత భారీ యెత్తున మద్దతు లభించిన నిర్ణయానికి అడ్డు తగిలితే ఆ చర్య దేనికి దారి తీస్తుందోనన్న సందేహం ఏర్పడటంవల్ల అవి వెనకడుగేశాయి. ఈ ఎన్నిక మన దేశానికి కూడా మంచి అనుభవాన్నిచ్చింది. కీలక సమయాల్లో వర్ధమాన దేశాలతో కలిసి అడుగేస్తే, సమస్యలేర్పడినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ఆ దేశాలు దృఢంగా మన వెనకుంటాయని ఈ ఎన్నిక చాటిచెప్పింది. ఆ పరిస్థితుల్లో అగ్ర రాజ్యాలు కూడా వెనకడుగేయక తప్పదని రుజువైంది. ఆ కోణంలో జస్టిస్ భండారీ విజయం ఎన్నదగినది. -
న్యాయకోవిదుడు దల్వీర్ భండారీ
రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి దల్వీర్ భండారీ ప్రయాణం నెదర్లాండ్స్ నగరం హేగ్ వరకూ సాగుతుందని ఎవరూ అనుకోలేదు. న్యాయశాస్త్ర అధ్యయనం, ఆచరణతో ఆయన న్యాయరంగంలో ఎన్నెన్నో మెట్లు ఎక్కి ఐదేళ్లు క్రితం అంతర్జాయతీయ న్యాయస్థానంలో జడ్జీ అయ్యారు. 70 ఏళ్ల క్రితం జోధ్‌పూర్‌లోని న్యాయవాదవృత్తికి అంకితమైన జైన కుటుంబంలో జన్మించిన భండారీ జోధ్‌పూర్‌లో బీఏ చదివాక లా పట్టభద్రుడయ్యారు. తాత, తండ్రులు బీసీ భండారీ, మహావీర్ చంద్ భండారీల అడుగుజాడల్లో పయనిస్తూ మొదట జైపూర్‌లోని రాజస్థాన్ హైకోర్టులో 1968-70లో వకీలుగా ప్రాక్టీసు చేశారు. 1970 జూన్‌లో ఆయనకొచ్చిన ఓ అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అమెరికా నగరమైన షికాగోలో భారత చట్టాలపై పరిశోధనపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఆరు వారాలు నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి భండారీకి ఆహ్వానం, అంతర్జాతీయ స్కాలర్షిప్ లభించాయి. షికాగోలోనే ఉన్న మరో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో మాస్టర్ ఆఫ్ లా చదవడానికి వెంటనే మరో స్కాలర్షిప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. షికాగోలో ఉన్న రోజుల్లోనే నార్త్ వెస్టర్న్ న్యాయ సహాయ క్లినిక్ తరఫున స్థానిక న్యాయస్థానాల్లో క్లినిక్ కక్షిదారుల తరఫున వాదించారు. ఇంకా అక్కడి సెంటర్ ఫర్ రిసెర్చ్ సంస్థతో కలిసి ఆయన షికాగోలో పనిచేశారు. తర్వాత 1973లో న్యాయస్థానాలు, లా కళాశాలలకు సంబంధించిన న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలనతో పాటు ప్రసంగాలు చేయడానికి భండారీకి మరో అంతర్జాతీయ ఫెలోషిప్ లభించింది. ఆయన ఈ సందర్భంగా థాయిలాండ్, మలేసియా, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, వాటి అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ఇంకా ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులో కూడా భండారీ విశేష సేవలందించారు. స్వదేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో 21 ఏళ్లు, తర్వాత హేగ్ ప్రపంచ కోర్టులో విభిన్న కేసులపై తీర్పు చెప్పడానికి ఈ అంతర్జాతీయ అనుభవం భండారీకి ఎంతగానో ఉపకరించింది. ఢిల్లీ నుంచి ముంబై -మళ్లీ ఢిల్లీకి! 1977లో లాయర్ ప్రాక్టీసును జైపూర్ నుంచి ఢిల్లీకి మార్చడంతో భండారీ దేశ రాజధాని హైకోర్టులో జడ్జీ కావడానికి పునాది పడింది. ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్ల ప్రాక్టీసు తర్వాత 1991లో అదే కోర్టులో ఆయన న్యాయమూర్తి అయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2005లో సుప్రీంకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుప్రీం న్యామూర్తిగా పనిచేసిన ఎనిమిదేళ్లలో ఆయన చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. ఆయన రాసిన అనేక తీర్పులు అనాథలు, బడుగు బలహీనవార్గలకు మేలు చేసే విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని బాగా వెనుకబడిన ఐదు జిల్లాలకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని, న్యాయవివాదాలు పరిష్కరించడానికి రాజీ కేంద్రాల ఏర్పాటుకు భండారీ ఇచ్చిన తీర్పులు ప్రజలకెంతో మేలేచేశాయి. ఇంకా ఆయన సుప్రీంకోర్టు జడ్జీగా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న పేదలకు అధిక మొత్తంలో ఆహారధాన్యాలు విడుదల చేయాలని, ఇళ్లూ వాకిళ్లూ లేని పేదలకు రాత్రిపూట బసచేయడానికి నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆయన తీర్పులిచ్చి భారత ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తుచేశారు. విడాకుల కేసులో చరిత్రాత్మక తీర్పు! సుప్రీంకోర్టు ముందుకొచ్చిన ఓ విడాకుల కేసు విచారించిన ధర్మాసనంలో ఉన్న భండారీ ఇచ్చిన తీర్పు చాలా గొప్పదనే ప్రశంసలందుకుంది. భార్యాభర్తల మధ్య ఏ మాత్రం రాజీకి అవకాశం లేదనే పరిస్థితి ఉంటే వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ఆయన తీర్పు ఇచ్చారు. ఫలితంగా కేంద్ర సర్కారు ఇందుకోసం హిందూ వివాహ చట్టం సవరించే యోచనలో ఉంది. అలాగే బాలలందరికీ ఉచిత, నిర్బధ విద్య పొందడానికి హక్కు ఉందని ఆయన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం మొదలైంది. సుప్రీంకోర్టు నుంచి ప్రపంచ న్యాయస్థానానికి... భారత సర్వోన్నత న్యాయస్థానంలో 8 ఏళ్లు సేవలందించి పదవీ విరమణ చేయడానికి కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలోని జడ్జీ రాజీనామాతో వచ్చిన ఖాళీ భర్తీచేయడానికి భారత ప్రభుత్వం భండారీ పేరు ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న జరిగిన ఎన్నికల్లో భారత్ తరఫున పోటీచేసిన భండారీ మెజారిటీ ఓట్లతో ఫిలిప్పీన్స్ ప్రత్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను ఓడించారు. న్యాయకోవిదునిగా అందించిన విశేష సేవలకుగాను భండారీకి భారత ప్రభుత్వం 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు రెండో విడత కోసం జరిగిన ఎన్నికతో 2018 ఫిబ్రవరిలో ప్రపంచ కోర్టు జడ్జీగా ఆయన రెండో పదవీకాలం మొదలవుతుంది. -
ఐసీజే జడ్జి ఎంపికలో ప్రతిష్టంభన
వాషింగ్టన్: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో జడ్జి ఎంపికలో పోటీలో ఉన్న భారత్‌కు చెందిన దల్వీర్ భండారీకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సభ్యుల నుంచి అసా దారణ మద్దతు లభించింది. అయితే భద్రతా మండలి శాశ్వత సభ్యులు మాత్రం ఇదే స్థానానికి పోటీ పడుతున్న బ్రిటన్‌కు చెందిన క్రిస్టొఫర్ గ్రీన్‌వుడ్‌కు మద్దతు తెలిపారు. దీంతో ఇద్దరిలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో జడ్జి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో తిరిగి ఎన్నికలు నిర్వహిం చాలని భండారీ, గ్రీన్వుడ్ కోరుతున్నారు. 15 మంది సభ్యులున్న ఐసీజేలో మూడేళ్లకోసారి మూడోవంతు సభ్యులు రిటైరవుతారు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహి స్తారు. ఖాళీ అయిన 5 స్థానాలకు ఆరుగురు పోటీపడగా నలుగురు ఎంపికయ్యారు. మిగి లిన స్థానానికి భండారీకి, గ్రీన్‌వుడ్‌కు మధ్య పోటీ ఉంది. వీరిలో ఒకరిని ఎన్నుకునేందుకు సోమవారం సాధారణ సభ, భద్రతా మండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి. భద్రతా మండలిలో జరిగిన ఐదు రౌండ్ల ఎన్నికల్లో ప్రతీ రౌండ్లో గ్రీన్వుడ్ 9 ఓట్లు పొందగా, భండారీకి మాత్రం ఐదు ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే కచ్చితంగా 8 ఓట్లు సాధించాలి. దీన్నిబట్టి గ్రీన్వుడ్ పైచేయి సాధించినట్లే. అయితే ఇందుకు భిన్నంగా సాధారణ సభలో జరిగిన 5 రౌండ్ల ఎన్నికల్లో భండారీ అసాధారణ మెజార్టీ సాధించారు. ఈ సభలో 97 ఓట్లు సాధించా ల్సి ఉండగా.. గురువారం జరిగిన ఎన్నికలో 115 ఓట్లు భండారీ సాధించగా.. సోమవారం ఎన్నికలో121 ఓట్లు సాధించారు. గ్రీన్‌వుడ్‌కు మాత్రం వరుసగా 76, 68 ఓట్లే వచ్చాయి. -
ఐసీజేకి తిరిగి నామినేట్ అయిన జస్టిస్ భండారీ
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్ తన అభ్యర్థిగా మరోసారి సీనియర్ న్యాయమూర్తి జిస్టిస్ దల్వీర్ భండారీని నామినేట్ చేసింది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన గెలుపొందితే ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ వద్ద భారత్ నామినేషన్ దాఖలు చేసింది. 2012లో ఐరాస అసెంబ్లీ, భద్రతా మండలిలో ఏకకాలంలో జరిగిన ఓటింగ్‌లో 69 ఏళ్ల భండారీ ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఐసీజే జడ్జిగా భండారీ పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చారు.