భారత్, పాక్ అధికారుల మధ్య ఆసక్తికర సీన్
హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కిన భారత్, పాకిస్థాన్ అధికారుల మధ్య ఆకర్షనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఐసీజేలో పాక్ తరుపున ఉన్న అధికారి ఒకరు అదే ఐసీజేలో ఉన్న భారత్ తరుపు అధికారికి ఎదురైన సందర్భంలో ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, భారత్ తరుపు అధికారి మాత్రం వినమ్రంగా నమస్కారం అని చెప్పి పక్కకు తప్పుకున్నారు.
జాదవ్ కేసు వాదనలు ప్రారంభం కావడానికి ముందు జాదవ్ కేసు తరుపున ప్రస్తుతం భారత ప్రతినిధిగా ఉన్న దీపక్ మిట్టల్ ఐసీజేకు వెళ్లారు. అదే సమయంలో పాకిస్థాన్ తరుపున ప్రతినిధిగా ఉన్న మహ్మద్ ఫైజల్ అదే ఐసీజే ప్రాంగణంలోకి వచ్చారు. ఈ సమయంలో ఇరువురు ఎదురవడంతో ఫైజల్ చేతులు కలిపే ప్రయత్నం చేయగా వెంటనే దీపక్ మిట్టల్ నమస్తే చెప్పి పక్కకు జరిగారు. ఆ వెంటనే, పాకిస్థాన్‌కు చెందిన ఇతర అధికారులకు, పాక్ తరుపున వాదిస్తున్న న్యాయవాదికి మాత్రం మిట్టల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉద్దేశ పూర్వకంగా కక్ష పూరితంగా ఈ కేసును ఫైజల్ దగ్గరుండి ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలోనే దీపక్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.