కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్‌కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన.
లక్షద్వీప్‌కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన.
లక్షద్వీప్‌లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన.
Comments
Please login to add a commentAdd a comment