mohammad faisal
-
ఛలో లక్షద్వీప్.. మంచిది కాదు!
కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్‌కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన. -
పాక్‌లో నిషేధిత సంస్థల ఆస్తుల స్వాధీనం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని నిషేధిత సంస్థల ఆస్తులను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు. నిషేధిత సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను అమలుచేయడం కోసం కార్యాచరణను రూపొందించేందుకు ఓ చట్టాన్ని పాక్ సోమవారం తీసుకొచ్చిందన్నారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడులు అధికమవుతున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం ఈ చట్టం తేవడం గమనార్హం. ఫైజల్ మాట్లాడుతూ ఇకపై ఆ ఆస్తులన్నీ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయనీ, త్వరలోనే వాటి అనుబంధ సంస్థల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు. -
పుల్వామా దాడి; పాకిస్తాన్ వింత వాదన
ఇస్లామాబాద్: పొరుగు దేశం మళ్లీ పాత పాటే పాడింది. కశ్మీర్లో సాగించిన మారణహోమంలో తమ పాత్ర లేదని బుకాయించింది. భారత్ పాలకుల నిష్ఫూచీ కారణంగానే ముష్కరులు రెచ్చిపోయారంటూ వింత వాదనకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. భద్రత, నిఘా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమపై భారత్ అభాండాలు వేస్తోందని పేర్కొంది. ఉగ్రవాద దాడులు జరిగిన ప్రతిసారి తమను బూచిగా చూపడం అలవాటుగా మారిందని ఆరోపించింది. ‘పుల్వామాలో ఉగ్రదాడి వెనుక మా హస్తం ఉందని భారత్ చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. ఎటువంటి దర్యాప్తు చేపట్టకుండానే దాడి జరిగిన వెంటనే మాపై ఆరోపణలు చేయడం తగద’ని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ఆదివారం ట్వీట్ చేశారు. భారత్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భద్రత, నిఘా వైఫల్యం కారణంగానే ఉగ్రదాడి జరిగిందన్న ప్రశ్నలకు బదులివ్వాల్సిన అవసరం ఉందన్నారు. పుల్వామా దాడికి తానే కారణమంటూ సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను భారత్ విశ్వసించడాన్ని మహమ్మద్ ఫైసల్ తప్పుబట్టారు. ‘ఇండియా ద్వంద్వ వైఖరి బయటపడింది. పుల్వామా దాడి తమ పనేనని జైషే చెబుతున్నట్టుగా సోషల్‌మీడియాలో దొరికిన వీడియోను భారత్ నమ్ముతోంది. కానీ పాకిస్తాన్లో తీవ్రవాద దాడులకు ప్రయత్నించినట్టు మాకు పట్టుబడిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తనకు తానుగా మా ముందు అంగీకరించినా ఇండియా నమ్మడం లేద’ని ఫైసల్ అన్నారు. భారత్ ఆరోపణలు నిరాధారం ఘటన గురించి భారత్ దుష్ప్రచారం చేస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఆ దేశం చేస్తోన్న వ్యాఖ్యల కారణంగా శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆఫ్రికా దేశాల, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) దేశాల రాయబారులకు ఆదివారం పాక్ వివరించింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్ పాత్రపై ఇప్పటికే పలు దేశాలతో భారత్ చర్చించింది. పీ5 దేశాలు (అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్) సహా మొత్తం 25 దేశాల దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరిపి పాక్ విధానాలను ఎండగట్టింది. పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువాతో పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలపై సమావేశమై చర్చించారు. ‘భారత్ ఆరోపణలు నిరాధారమైనవి.. భారత్ వ్యాఖ్యలతో ఇక్కడి ప్రాంతాల శాంతికి ప్రమాదం కలిగే అవకాశముంది..’ అని ఫైసల్ ఎస్సీఓ దేశాల రాయబారులకు వివరించారు. ఎస్సీఓ దేశాల్లో భారత్, పాక్ సహా రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. -
జిన్నా హౌస్ ముమ్మాటికీ భారత్‌దే
న్యూఢిల్లీ: ముంబైలో 1930 దశకంలో పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివసించిన భవంతిని తమ కాన్సులేట్‌కు అప్పగించాలన్న పాక్ అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఆ ఆస్తిపై భారత్‌కే పూర్తి హక్కు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ‘అది ప్రభుత్వ ఆస్తి. దాన్ని నవీకరించే పనిలో ఉన్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. భారత్‌లో పర్యటించే ప్రముఖ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భేటీ, విందు కోసం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను వినియోగిస్తున్న తరహాలో జిన్నా హౌస్‌ను ఆధునీకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ‘ఆ భవంతి మాదే అని భారత్ గతంలోనే అంగీకరించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి. భారతసర్కారు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు’ అని ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో భారత్ గురువారం పైవిధంగా స్పందించింది. -
భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమతో చర్చలు జరిపేందుకు భారత్ సుముఖంగా లేనట్లైతే కర్తార్‌పూర్ కారిడార్ విషయాన్ని మర్చిపోవాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది... పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మాట్లాడుతూ.. ‘భారత్‌తో చర్చలకు సిద్ధమని మేము చెప్పాం. అయితే ఇంతవరకు వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. అంతేకాకుండా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవాలని భావించాం. కానీ ప్రస్తుతం చర్చల విషయమై భారత్ తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది. ఒకవేళ వాళ్లకి మాతో చర్చలు జరపడం ఇష్టం లేకపోయినట్లైతే ఈ విషయాన్ని మర్చిపోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ సాహెబ్ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారాలో గడిపారు. 1539లో అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్(భారత్- పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గురునానక్ 550వ జయంతి వేడుకల్లో భాగంగా కర్తార్‌పూర్ గురుద్వార మార్గాన్ని తెరవాలని భావిస్తున్నట్లు పాక్ అధికారుల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అదేవిధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంతో భారత్‌లోని సిక్కులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ పాక్ విదేశాంగ అధికారుల పద్ధతి చూస్తుంటే వారి ఆనందం ఆవిరయ్యేట్టుగా కన్పిస్తోంది. -
భారత్, పాక్ అధికారుల మధ్య ఆసక్తికర సీన్
హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కిన భారత్, పాకిస్థాన్ అధికారుల మధ్య ఆకర్షనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఐసీజేలో పాక్ తరుపున ఉన్న అధికారి ఒకరు అదే ఐసీజేలో ఉన్న భారత్ తరుపు అధికారికి ఎదురైన సందర్భంలో ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, భారత్ తరుపు అధికారి మాత్రం వినమ్రంగా నమస్కారం అని చెప్పి పక్కకు తప్పుకున్నారు. జాదవ్ కేసు వాదనలు ప్రారంభం కావడానికి ముందు జాదవ్ కేసు తరుపున ప్రస్తుతం భారత ప్రతినిధిగా ఉన్న దీపక్ మిట్టల్ ఐసీజేకు వెళ్లారు. అదే సమయంలో పాకిస్థాన్ తరుపున ప్రతినిధిగా ఉన్న మహ్మద్ ఫైజల్ అదే ఐసీజే ప్రాంగణంలోకి వచ్చారు. ఈ సమయంలో ఇరువురు ఎదురవడంతో ఫైజల్ చేతులు కలిపే ప్రయత్నం చేయగా వెంటనే దీపక్ మిట్టల్ నమస్తే చెప్పి పక్కకు జరిగారు. ఆ వెంటనే, పాకిస్థాన్‌కు చెందిన ఇతర అధికారులకు, పాక్ తరుపున వాదిస్తున్న న్యాయవాదికి మాత్రం మిట్టల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉద్దేశ పూర్వకంగా కక్ష పూరితంగా ఈ కేసును ఫైజల్ దగ్గరుండి ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలోనే దీపక్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.