కొన్ని నిజాలు అంతే! కూర్చోనివ్వవు, నిలుచోనివ్వవు. కంటి నిండా కునుకుపట్టనివ్వవు. దేశంలోని నిజమైన పరిస్థితి మనసుకు తెలుసు కాబట్టే కావచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కూడా నిద్ర పట్టడం లేదట. ఆ మాట ఆయన ఇటీవల ప్రజలతో ప్రత్యక్ష ప్రసారంలో బాహాటంగా చెప్పారు. అధికారంలోకి వచ్చేనాటికే ఒకవైపున భారీ కరెంటు ఖాతా లోటు, ఇప్పుడు కరోనా వేళ ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో దేశానికి ఆర్థిక కష్టాలు అలా ఉన్నాయని ఆయన మాట. కొద్ది రోజుల క్రితమే... ఈ నెలలోనే భారత్ కన్నా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే బాగుందని బీరాలు పలికారాయన. తీరా ఇప్పుడిలా భావోద్వేగంతో బేలతనం చూపడం విచిత్రం.
నిద్ర పట్టడం లేదంటూనే అసలు నిజాలను ఇమ్రాన్ దాస్తున్నారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న దేశాల్లో అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్ తర్వాత 4వదైన పాక్ గురించి ప్రపంచంలోనే చౌకయిన దేశాల్లో తమది ఒకటనడం హాస్యాస్పదమే. ఇప్పటికే 500 కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఆ దేశాన్ని పీడిస్తోంది. తాజాగా సుకుక్ బాండ్ ద్వారా 100 కోట్ల డాలర్ల మేర అప్పు చేసింది. అదీ... రికార్డు 7.95 శాతం వడ్డీకి! అంతేకాక, అప్పు కోసం ఏకంగా లాహోర్ – ఇస్లామాబాద్ మోటార్ మార్గంలోని కొంత భాగాన్ని కుదువ పెట్టడానికీ ఒప్పుకుంది. అదీ వాస్తవ పరిస్థితి.
అస్తుబిస్తయిన ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వ రంగంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి జాడ్యాలు తోడయ్యాయి. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ మంగళవారం వెల్లడించిన ‘అవినీతి భావనాత్మక సూచిక’ (సీపీఐ) తాజా లెక్కలే అందుకు సాక్ష్యం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది పాకిస్తాన్ మరింత అవినీతిలో కూరుకుపోయింది. 180 దేశాల ఈ లెక్కల్లో 2020లో 124వ స్థానంలో ఉన్న పాక్ ఇప్పుడు 16 స్థానాలు మరింత దిగజారి, 140వ స్థానంలో నిలిచిందన్న తాజా వార్త నిష్ఠురసత్యం. నవాజ్ షరీఫ్ ఏలుబడిలో (అప్పటి ర్యాంకు 117) కన్నా దిగజారడం గమనార్హం. స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఇమేజ్‌కు ఇది పెద్ద దెబ్బే. తెస్తానన్న ‘నయా పాకిస్తాన్’ ఇదేనా అని ప్రశ్నిస్తుంటే, జవాబివ్వలేని పరిస్థితి వచ్చిపడింది.
86 శాతం దేశాల్లో గత పదేళ్ళలో అవినీతి స్థాయి దాదాపు యథాతథంగా ఉండగా, పాక్‌కే ఈ దుర్గతి ఎందుకు పట్టినట్టు? చట్టబద్ధ పాలన లేకపోవడం, హస్తగతం చేసుకున్న అధికారం లాంటివి పాక్ దిగజారుడుకు కారణమట! ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక, మేధావుల లాంటి వివిధ వర్గాల నుంచి సేకరించిన డేటాతో ఇచ్చే ర్యాంకు గనక దీన్ని కాకిలెక్క అనుకోలేం. గతంలో ఇదే సూచికను చూపి, అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన సంగతి ఇమ్రాన్ మర్చిపోయినా, సోషల్ మీడియా పోస్టులు మర్చిపోనివ్వడం లేదు. గత 20 ఏళ్ళ రికార్డుల్ని బద్దలుకొట్టి, ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో 5వ అత్యంత అవినీతి దేశంగా పాక్ పేరుమోసేలా చేశారని విమర్శిస్తున్నాయి.
మరోపక్క అవినీతి ఆరోపణలతో లండన్‌లో తలదాచుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వైపు సైన్యం మొగ్గుతున్నట్టు వార్త. దేశ రాజకీయాల్లో అవసరం ఉందనీ, స్వదేశానికి తిరిగొచ్చేయమనీ షరీఫ్‌కు సైన్యం కబురంపినట్టు కథనం. నిజానికి, సైన్యం, సైనిక గూఢచారి సంస్థ (ఐఎస్‌ఐ)ల దయాదాక్షిణ్యాల మీదే ఇమ్రాన్ సర్కార్ నడుస్తోందనేది లోకవిదితం. పాకిస్తానీ సైన్యం రిగ్గింగ్ వల్లనే 2018 నాటి ఎన్నికలలో ఇమ్రాన్ అధికారం చేజిక్కించుకున్నారనీ, సైన్యం చేతిలో ఆయన ఓ ‘కీలుబొమ్మ’ అనీ ప్రతిపక్షాల వాదన. అయితే, ఐఎస్‌ఐ కొత్త డైరెక్టర్ జనరల్ నియామకంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌కూ, ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వాకూ మధ్య బంధం బెడిసింది. ఈ ఏడాది నవంబర్ ఆఖరులో పదవీకాలం పూర్తయ్యాక, రావాల్సిన కొత్త సైనిక వారసుణ్ణి కాదని ప్రస్తుత ఐఎస్‌ఐ అధినేతనే కొనసాగించాలన్నది ఇమ్రాన్ భావించడంతో ఇబ్బంది తలెత్తిందని కథనం.
ఇమ్రాన్ పదవీ కాలంలో మునుపెన్నడూ లేనంతటి ద్రవ్యోల్బణంతో దేశం చిక్కుల్లో ఉంది. ధరలు వంటనూనె 130 శాతం, పెట్రోలు 55 శాతం పెరిగాయి. పాకిస్తానీ రూపాయి విలువేమో 44 శాతం పడిపోయింది. మూడేళ్ళ క్రితం రూ. 122కే డాలరైతే, ఇప్పుడు రూ. 176 పెట్టాల్సి వస్తోంది. క్రితంనెలలో ద్రవ్యోల్బణ రేటు 12.3 శాతమై, గత 21 నెలల్లోకెల్లా పతాక స్థాయికి చేరింది. అధికారిక నివాసాన్ని వదులుకొని, అద్దెకివ్వడం లాంటి కంటితుడుపుతో ఇమ్రాన్ దీనికి అడ్డుకట్ట వేయలేరు. అదేమంటే, నిరాశాపూర్వక కథనాలిస్తున్నాయంటూ ఆయన తప్పంతా మీడియాపై నెట్టేస్తుండడం విచిత్రం. అందుకే పత్రికా రచనా స్వేచ్ఛ సూచిలో పాక్‌కు 145వ స్థానమే దక్కడం వింతేమీ కాదు.
నిజానికి, దశాబ్దాలుగా పాక్ వైఖరి ప్రస్తుత సంక్షోభానికి కారణం – సైన్యంపై అతిగా ఖర్చు, దూరదృష్టి లేకుండా భారీగా అప్పులు తేవడం, పెట్టుబడుల నిర్వహణలో అసమర్థత లాంటి తప్పులెన్నో. దానికిప్పుడు కరోనా కాటు తోడైంది. ఏమైనా, అవినీతి రహిత పాలన అందిస్తానని వచ్చి, మూడేళ్ళ పైచిలుకులో ప్రతిపక్షాలతో ‘అవినీతి సమ్రాట్’ అనిపించుకొనే దశకు అప్రతిష్ఠ పాలవడం ఎవరికైనా నిద్ర పట్టనివ్వని పరిస్థితే! దాని నుంచి బయటపడాలంటే – భారత్‌తో పోలికలు మానేసి, పాలనలో ప్రక్షాళన చర్యలు చేపట్టడం, తీవ్రవాద ప్రోత్సాహక చర్యలను వదిలేయడమే మార్గం. లేదంటే, ఇప్పటికే పదవీ గండం పొంచి ఉన్న ఇమ్రాన్ వచ్చే ఎన్నికల దాకా అధికారం నిలుపుకోగలిగినా, ప్రతిపక్షాలన్నీ దగ్గరవుతూ, తీవ్రవాదులు విజృంభిస్తూ, సైన్యం శత్రువుగా మారుతున్న వేళ మళ్ళీ గెలవడం కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment