14వ సారీ.. భారత్ విన్నపాన్ని తిరస్కరించిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాక్ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్ష తీర్పు కాపీని, ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీటు కాపీలను ఇవ్వాల్సిందిగా భారత్ కోరింది. శుక్రవారం పాక్‌లో భారత హైకమీషనర్ గౌతమ్ బాంబేవాలే.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తహ్మీనా జంజ్వాను కలసి ఈ మేరకు విన్నవించారు. జాదవ్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గౌతమ్ కోరగా.. గూఢచర్యం కేసులో అనుమతి ఇవ్వడం కుదరదని తహ్మీనా నిరాకరించారు. గతంలో జాదవ్‌ను కలవాలని 13 సార్లు భారత దౌత్య వేత్తలు కోరగా, పాక్ తిరస్కరించింది.
పాకిస్థాన్ ఆర్మీ చట్టాలను పరిశీలించి, జాదవ్‌కు విధించిన మరణశిక్ష తీర్పుపై అప్పీలు చేయాలని భారత్ భావిస్తోంది. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో జాదవ్‌కు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఇటీవల సూచించారు. వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలని, వారు మోపిన నేరం సరైనదా కాదా అన్నదీ తెలుసుకోవాలని, అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుందని చెప్పారు.
జాద్‌వ్ పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్‌కు తమ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా నిర్ణయించినట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.