ఆకాశంలో మరో విషాదం | Indonesia asks US for help as search expands for missing AirAsia jet | Sakshi
Sakshi News home page

ఆకాశంలో మరో విషాదం

Published Tue, Dec 30 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

Indonesia asks US for help as search expands for missing AirAsia jet

మరో రెండు రోజుల్లో ముగియబోతున్న 2014 పోతూ పోతూ పెను విషాదాన్ని మిగిల్చింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం ఇండొనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో అందులో ఏడుగురు సిబ్బందిసహా 162మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది అంతర్థానం కావడం వెనక కారణాలు ఏమై ఉంటాయో అంతుచిక్కని స్థితి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...ఈ ఏడాది చోటుచేసుకున్న విమాన ప్రమాదాలన్నీ ఆగ్నేయాసియావే కావడం, పెను దుర్ఘటనలు మూడూ మలేసియాకు సంబంధించినవే కావడం గమనార్హం. తొమ్మిదినెలల క్రితం...అంటే మార్చిలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-777 విమానం 239మందితో కౌలాలంపూర్‌నుంచి చైనా వెళ్తూ మాయమైంది.
 
 ఆ విమానం ఎలాంటి ప్రమాదంలో పడిందో, ఏం జరిగిందో తెలియలేదు సరికదా... ఇంతవరకూ దానికి సంబంధించిన శకలాలే లభ్యంకాలేదు. పలు దేశాలు సమష్టిగా అత్యంతాధునాతన పరికరాల సాయంతో జల్లెడపట్టినా ఆ విమానానికి సంబంధించిన చిన్న శకలం కూడా దొరకలేదు. అటుతర్వాత మొన్నటి జూలైలో మలేసియాకు చెందిన మరో విమానం ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తుండగా క్షిపణి దాడిలో కుప్పకూలింది. ఆ ఉదంతంలో 298మంది ప్రయాణికులు దుర్మరణంపాలయ్యారు. ఆ దుండగానికి పాల్పడిందెవరన్న విషయంలో ఇంతవరకూ నిర్ధారిత సమాచారం లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రష్యానే దీనికి బాధ్యతవహించాలని అమెరికా, యూరోప్ దేశాలు అంటే... ఉక్రెయిన్ దళాలే ఈ పనిచేశాయని రష్యా ఆరోపించింది. వారి అసలు లక్ష్యం తమ అధ్యక్షుడు పుతిన్ అని కూడా ప్రకటించింది.
 
 ప్రమాదానికి ముందు ఎయిర్ ఆసియా విమానం పెలైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో మాట్లాడాడు. ప్రతికూల వాతావరణమున్నందువల్ల విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు అనుమతించమని కోరాడు. ఆ వెంటనే విమానంనుంచి సంకేతాలు ఆగిపోయాయి. ప్రమాద సమయంలో విమానం ప్రయాణిస్తున్నచోట 50,000 అడుగుల ఎత్తు వరకూ దట్టమైన మేఘాలుండటంతో పాటు ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉన్నదని అంటున్నారు. ఉపగ్రహం విడుదల చేసిన ఛాయాచిత్రాలను పరిశీలిస్తే ఆ సంగతి స్పష్టమవుతున్నది. అయితే, విమానం ప్రయాణిస్తున్న మార్గంలో అలాంటి వాతావరణం ఉన్నదని ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు ఎంతగానో విస్తరించింది.
 
 ఉపగ్రహాలు భూమండలంలో అణువణువునూ గమనిస్తూ ఎప్పటికప్పుడు సచిత్ర సమాచారాన్ని అందజేస్తున్నాయి. దానికితోడు విమానంలో అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలుంటాయి. ఇన్ని అవకాశాలున్నా ఆ మార్గం శ్రేయస్కరం కాదని ముందుగా చెప్పగల స్థితి లేకపోవడం దిగ్భ్రాంతిక రం. దీనికితోడు కల్లోల వాతావరణంలో విమానాన్ని ఒడుపుగా గమ్యానికి తీసుకెళ్లగల శిక్షణను పెలైట్లకు అన్ని దేశాలూ, అన్ని విమానయాన సంస్థలూ తప్పనిసరి చేస్తున్నాయా లేదా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. ఎయిర్‌ఆసియా చవక ధరల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్నది. మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే ఆ సంస్థ వసూలు చేసే మొత్తం తక్కువగా ఉంటుందని చాలామంది దానివైపు మొగ్గు చూపుతారు. చవకైన ధరలను అందించే విమానయాన సంస్థలు అందుకనుగుణంగా ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తాయన్న అపప్రద ఉంది. అయితే, పదమూడేళ్లుగా ఈ రంగంలో ఉంటున్న ఎయిర్‌ఆసియా చరిత్రలో ఇలాంటి దుర్ఘటన చేసుకోవడం ఇదే ప్రథమం.
 
 వర్తమాన ప్రపంచంలో జీవన వేగం పెరిగింది. ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించడం...ఉపాధికోసం, చదువు నిమిత్తం  ప్రపంచంలో ఈమూలనుంచి ఆ మూలకు ప్రయాణించడంన లక్షలాదిమందికి నిత్యావరంగా మారింది. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్యతోపాటే విమానాలూ పెరిగాయి. గగనతలంలో కూడా ఆమేరకు రద్దీ గణనీయంగానే పెరిగింది. అయితే విమానాల జీవిత కాలం, వాటికోసం వాడుతున్న విడిభాగాల నాణ్యత వగైరా విషయాలపై శ్రద్ధపెట్టవలసిన అవసరం పెరిగింది. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవమే అయినా పైలట్లు దాన్ని అందిపుచ్చుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ఎన్ని సంస్థలు ఈ విషయంలో దృష్టిపెడుతున్నాయో అనుమానమే.
 
 ఉదాహరణకు కల్లోల వాతావరణంలో విమానాలను నడపడంపై మన పైలట్లకు శిక్షణ తప్పనిసరి చేయడమేకాక...ప్రతి వర్షాకాలానికి ముందూ ఆ అంశంలో పునర్మూల్యాంకనం చేసే విధానం కూడా అమల్లో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్ని సంస్థలు భద్రత విషయంలో రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్నాయో చెప్పడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఏఓ) అనేక ప్రమాణాలను ఏర్పరిచింది. టేకాఫ్ మొదలుకొని ల్యాండింగ్ వరకూ అందులో ఎన్నో అంశాలుంటాయి.

వాటికి సంబంధించిన నిబంధనలుంటాయి. ఆ ప్రమాణాలను ఎవరెలా పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించి ఎత్తిచూపే విధానం అమల్లో ఉన్నది. ఇదిగాక ఉగ్రవాదం విస్తరించిన ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన అదనపు భద్రతా చర్యలుంటాయి. వీటన్నిటినీ దాటుకుని మరో ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 162మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఇప్పుడు అదృశ్యమైన ఎయిర్ ఆసియా విమానం ఆచూకీ త్వరగా వెల్లడై బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన లభించాలని, ఇలాంటి ప్రమాదాలకు తావులేని రీతిలో మరింత సురక్షితమైన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాలని ఆశిద్దాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement