plane accidents
-
వార్ విత్ వింగ్స్
సాక్షి, సిటీబ్యూరో /శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల బెడద పట్టుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకోలేదు.. కానీ చుట్టుపక్కల ఉన్న జనావాసాలు, చెరువులు, అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా విమానాశ్రయానికి పక్షుల తాకిడి పెరిగింది. ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎస్వీ 744 విమానం లాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొని ఏకంగా ముందు భాగానికి సొట్ట ఏర్పడడం పక్షుల బెడద తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగకపోయినా పక్షుల సమస్యను ఎత్తి చూపుతోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో పక్షులు సంచరించకుండా, క్రిమికీటకాలు,దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉన్నారు. విమానాశ్రయం చుట్టూ నెలకొన్న వాతావరణం వల్ల పక్షులు యధేచ్చగా సంచరిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా చుటుపక్కల పల్లెల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పెరిగిన చెత్త, వ్యర్ధ పదార్ధాల వల్ల పక్షుల సంచారం కూడా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఆశ్రయిస్తున్నాయి.... సుమారు 5 వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించింది. రెండు రన్‌వేలతో ఉన్న సువిశాలమైన ఎయిర్‌పోర్టులో ప్రతి రోజూ 400 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 75 వేలమంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 7, 8 కిలోమీటర్ల దూరంలో నివాసప్రాంతాలు ఉన్నాయి. శంషాబాద్ టౌన్‌తో పాటు, మామిడిపల్లి, రషీద్‌గూడ, గొల్లపల్లి, తొండపల్లి, తదితర గ్రామాల్లోని అడవులు,నివాస సముదాయాలు, చెరువులు, చిన్న చిన్న నీటి కుంటలు కొంగలు, కాకులు, డేగలు, తదితర పక్షులకు ఆలవాలంగా ఉన్నాయి. క్రిమి కీటకాలను ఏరుకొనేందుకు, పల్లెల్లో అన్నం, ఇతర వ్యర్థపదార్ధాలను ఆరగించేందుకు కాకులు వచ్చి వాలుతున్నాయి. మరోవైపు గొల్లపల్లి, మామిడిపల్లి,తొండుపల్లిలోని చెరువులతో పాటు, విమానాశ్రయంలోను జలవనరుల సంరక్షణ కోసం కొత్తగా ఒక చెరువును ఏర్పాటు చేశారు. కొంగలే కాకుండా ఇతర పక్షులు కూడా తరచుగా ఈ చెరువుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పక్షుల సంచారం సర్వసాధారణమైపోయింది.ఇటీవల కాలంలో పావురాలు కూడా బాగా సంచరిస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇలా విమానాశ్రయంలోకి వచ్చిన పావురాళ్లను పట్టుకొని దూరంగా వదిలి వచ్చారు. పేరుకుపోతున్న చెత్త చుట్టుపక్కల పల్లెల్లో చెత్త వేసేందుకు ఎలాంటి డంపింగ్ యార్డులు లేవు. దీంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీన్ని తొలగించి కాల్చి వేయాల్సిన పారిశుధ్య సిబ్బంది 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో, చెత్త, వ్యర్థపదార్ధాల నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. విమానాశ్రయం రక్షణ కోసం కేవలం విమానాశ్రయంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లోనూ రక్షణ చర్యలు చేపడతారు.అయితే ఈ సమ్మె కారణంగా పరిశుభ్రతకు ఆటంకం ఏర్పడింది. దీంతో పక్షులు, ఇతర క్రిమికీటకాల సంచారం బాగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.‘‘ ‘‘ఒక్క పక్షులపైన మాత్రమే కాదు. దోమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిరంతరం అమ్రపత్తత పాటిస్తాం. ఎయిర్‌పోర్టుతో పాటు చుట్టుక్కల గ్రామాల్లోను పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ఎంతో ముఖ్యం.ఎందుకంటే జాతీయ,అంతర్జాతీయ ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం ఈ పరిసరాలపైనే ఆధారపడి ఉంది...’’ అని విమానాశ్రయంలో పెస్ట్ కంట్రోల్ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. వైద్య ఆరోగ్య విభాగం అధికారులు వారానికి ఒకసారి దోమల నివారణపైన సర్వేలెన్స్ నిర్వహించి డిఫినోథిన్ స్ప్రే చేస్తారు. పక్షి తాకితే... ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కాదు. అన్ని చోట్ల ఇలాంటి పక్షుల సంచారం సహజమే. వీటిని అరికట్టడం ఒక్కటే పరిష్కారం. అందుకోసం విమానాశ్రయంలో తరచుగా బాణాసంచా పేల్చడం ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా పక్షులను పారదోలుతారు. శంషాబాద్‌లోనూ ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉంది.పక్షుల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు. కానీ గంటకు 525 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చే విమానానికి ఏ చిన్న పక్షి తాకినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అదీ ఒకవేళ విమానం రెక్కల కింద ఉన్న ఇంజిన్లోకి పక్షి వెళ్లినపుడు ఒక్కోసారి ఇంజన్ ఆగిపోతుంది. అటువంటి సమయంలో విమానాన్ని వెంటనే దగ్గరలోఉన్న విమానాశ్రయంలో దింపి మరమ్మతు చేస్తారు. ఒక్కోసారి దానికి రెండు వైపులా ఉండే ఇంజన్లలో మంటలు తలెత్తవచ్చు.అప్పుడు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. -
ఆకాశంలో మరో విషాదం
మరో రెండు రోజుల్లో ముగియబోతున్న 2014 పోతూ పోతూ పెను విషాదాన్ని మిగిల్చింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం ఇండొనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో అందులో ఏడుగురు సిబ్బందిసహా 162మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది అంతర్థానం కావడం వెనక కారణాలు ఏమై ఉంటాయో అంతుచిక్కని స్థితి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...ఈ ఏడాది చోటుచేసుకున్న విమాన ప్రమాదాలన్నీ ఆగ్నేయాసియావే కావడం, పెను దుర్ఘటనలు మూడూ మలేసియాకు సంబంధించినవే కావడం గమనార్హం. తొమ్మిదినెలల క్రితం...అంటే మార్చిలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-777 విమానం 239మందితో కౌలాలంపూర్‌నుంచి చైనా వెళ్తూ మాయమైంది. ఆ విమానం ఎలాంటి ప్రమాదంలో పడిందో, ఏం జరిగిందో తెలియలేదు సరికదా... ఇంతవరకూ దానికి సంబంధించిన శకలాలే లభ్యంకాలేదు. పలు దేశాలు సమష్టిగా అత్యంతాధునాతన పరికరాల సాయంతో జల్లెడపట్టినా ఆ విమానానికి సంబంధించిన చిన్న శకలం కూడా దొరకలేదు. అటుతర్వాత మొన్నటి జూలైలో మలేసియాకు చెందిన మరో విమానం ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తుండగా క్షిపణి దాడిలో కుప్పకూలింది. ఆ ఉదంతంలో 298మంది ప్రయాణికులు దుర్మరణంపాలయ్యారు. ఆ దుండగానికి పాల్పడిందెవరన్న విషయంలో ఇంతవరకూ నిర్ధారిత సమాచారం లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రష్యానే దీనికి బాధ్యతవహించాలని అమెరికా, యూరోప్ దేశాలు అంటే... ఉక్రెయిన్ దళాలే ఈ పనిచేశాయని రష్యా ఆరోపించింది. వారి అసలు లక్ష్యం తమ అధ్యక్షుడు పుతిన్ అని కూడా ప్రకటించింది. ప్రమాదానికి ముందు ఎయిర్ ఆసియా విమానం పెలైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో మాట్లాడాడు. ప్రతికూల వాతావరణమున్నందువల్ల విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు అనుమతించమని కోరాడు. ఆ వెంటనే విమానంనుంచి సంకేతాలు ఆగిపోయాయి. ప్రమాద సమయంలో విమానం ప్రయాణిస్తున్నచోట 50,000 అడుగుల ఎత్తు వరకూ దట్టమైన మేఘాలుండటంతో పాటు ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉన్నదని అంటున్నారు. ఉపగ్రహం విడుదల చేసిన ఛాయాచిత్రాలను పరిశీలిస్తే ఆ సంగతి స్పష్టమవుతున్నది. అయితే, విమానం ప్రయాణిస్తున్న మార్గంలో అలాంటి వాతావరణం ఉన్నదని ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు ఎంతగానో విస్తరించింది. ఉపగ్రహాలు భూమండలంలో అణువణువునూ గమనిస్తూ ఎప్పటికప్పుడు సచిత్ర సమాచారాన్ని అందజేస్తున్నాయి. దానికితోడు విమానంలో అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలుంటాయి. ఇన్ని అవకాశాలున్నా ఆ మార్గం శ్రేయస్కరం కాదని ముందుగా చెప్పగల స్థితి లేకపోవడం దిగ్భ్రాంతిక రం. దీనికితోడు కల్లోల వాతావరణంలో విమానాన్ని ఒడుపుగా గమ్యానికి తీసుకెళ్లగల శిక్షణను పెలైట్లకు అన్ని దేశాలూ, అన్ని విమానయాన సంస్థలూ తప్పనిసరి చేస్తున్నాయా లేదా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. ఎయిర్ఆసియా చవక ధరల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్నది. మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే ఆ సంస్థ వసూలు చేసే మొత్తం తక్కువగా ఉంటుందని చాలామంది దానివైపు మొగ్గు చూపుతారు. చవకైన ధరలను అందించే విమానయాన సంస్థలు అందుకనుగుణంగా ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తాయన్న అపప్రద ఉంది. అయితే, పదమూడేళ్లుగా ఈ రంగంలో ఉంటున్న ఎయిర్ఆసియా చరిత్రలో ఇలాంటి దుర్ఘటన చేసుకోవడం ఇదే ప్రథమం. వర్తమాన ప్రపంచంలో జీవన వేగం పెరిగింది. ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించడం...ఉపాధికోసం, చదువు నిమిత్తం ప్రపంచంలో ఈమూలనుంచి ఆ మూలకు ప్రయాణించడంన లక్షలాదిమందికి నిత్యావరంగా మారింది. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్యతోపాటే విమానాలూ పెరిగాయి. గగనతలంలో కూడా ఆమేరకు రద్దీ గణనీయంగానే పెరిగింది. అయితే విమానాల జీవిత కాలం, వాటికోసం వాడుతున్న విడిభాగాల నాణ్యత వగైరా విషయాలపై శ్రద్ధపెట్టవలసిన అవసరం పెరిగింది. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవమే అయినా పైలట్లు దాన్ని అందిపుచ్చుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ఎన్ని సంస్థలు ఈ విషయంలో దృష్టిపెడుతున్నాయో అనుమానమే. ఉదాహరణకు కల్లోల వాతావరణంలో విమానాలను నడపడంపై మన పైలట్లకు శిక్షణ తప్పనిసరి చేయడమేకాక...ప్రతి వర్షాకాలానికి ముందూ ఆ అంశంలో పునర్మూల్యాంకనం చేసే విధానం కూడా అమల్లో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్ని సంస్థలు భద్రత విషయంలో రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్నాయో చెప్పడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఏఓ) అనేక ప్రమాణాలను ఏర్పరిచింది. టేకాఫ్ మొదలుకొని ల్యాండింగ్ వరకూ అందులో ఎన్నో అంశాలుంటాయి. వాటికి సంబంధించిన నిబంధనలుంటాయి. ఆ ప్రమాణాలను ఎవరెలా పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించి ఎత్తిచూపే విధానం అమల్లో ఉన్నది. ఇదిగాక ఉగ్రవాదం విస్తరించిన ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన అదనపు భద్రతా చర్యలుంటాయి. వీటన్నిటినీ దాటుకుని మరో ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 162మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఇప్పుడు అదృశ్యమైన ఎయిర్ ఆసియా విమానం ఆచూకీ త్వరగా వెల్లడై బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన లభించాలని, ఇలాంటి ప్రమాదాలకు తావులేని రీతిలో మరింత సురక్షితమైన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాలని ఆశిద్దాం.