ఆ విమానం కూలిన ప్రదేశం కోసం..
సిడ్నీ: మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 జెట్ విమానం గల్లంతై రెండేళ్లు కావొస్తున్నది. ఇంతవరకూ ఈ విమానం జాడ దొరకలేదు. హిందూ మహా సముద్రంలో ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి దూరంగా ఈ విమానం కూలిపోయినట్టు భావిస్తున్నా.. ఇప్పటివరకు ఈ విమానానికి సంబంధించిన ఒక్క శకలం కూడా లభించలేదు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 239మంది సముద్రంలో సమాధి అయినట్టు భావిస్తున్నారు.
2014 మార్చిలో గల్లంతైన ఈ విమానం ఆచూకీ కోసం గాలిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం.. తాజాగా విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించేందుకు సరికొత్త అధ్యయానాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎంహెచ్ 370 విమానం శకలాల మాదిరి నమూనా శకలాలను రూపొందించి.. వాటిని ప్రమాద జరిగిన ప్రాంతంలో సముద్రంలోకి జారవిడిచి.. అవి మునిగిపోయే క్రమాన్ని శాటిలైట్ ద్వారా అన్వేషించాలని నిర్ణయించింది. సముద్ర ప్రవాహగతికి అనుగుణంగా ఈ శకలాలు మునిగిపోయే తీరును బట్టి.. విమానం కూలిన స్థలాన్ని, దాని శకలాలను గుర్తించే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) ఈ అధ్యయానాన్ని నిర్వహించనుంది. గత 18 నెలలుగా జేఏసీసీ ఆధ్వర్యంలో విమానం గాలింపు చర్యలు సాగుతున్నాయి. తాజా అధ్యయనం నేపథ్యంలో మరింత ముమ్మరంగా హిందు మహాసముద్రంలో గాలింపు చర్యలను చేపట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.