పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం.. పైలట్ ఆత్మహత్య స్కెచ్!!
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది.
ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు గానీ గుర్తించలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సిగ్నల్ కోల్పోయి అదృశ్యం అయింది.
ఈ విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు.
ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా.. తోటి ప్రయాణీకులను తన ఆత్మహత్య పథకంలో భాగంగా విమానం అదృశ్యం చేసినట్లు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం అయ్యేలా పైలట్ భావించినట్లు తన పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. విమానం అదృశ్యం విషయంలో ఎఫ్‌బీఐ పరిశోధనలో కూడా దాదాపు దగ్గరా ఉన్న ఇటువంటి ఒక ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు.
విమాన అదృష్యానికి సంబంధించిన దర్యాప్తు 2017లో ముగిసింది. అయితే గతంలో హార్డీకి తన పరిశోధనను రుజువు చేసుకోవడానికి సమయం లేదని తెలిపారు. గతంలో ఎంహెచ్370 విమానం సముద్రంలో భూకంపాలు గురయ్యే ప్రాంతంలో అదృశ్యం అయినట్లు నమ్మినట్లు తెలిపారు. అదృశ్యమైన విమానం సముద్రపు అడుగుభాగంలో కప్పబడి ఉండవచ్చని హార్డీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు సైమన్ హార్డీ వెల్లండించారు.