* మలేసియా విమాన అదృశ్యంపై వీడని మిస్టరీ
* దొంగ పాస్‌పోర్టులతో ఎక్కిన ఇద్దరూ ఉగ్రవాదులని అనుమానం..
* ఆ దిశగా దర్యాప్తు
కౌలాలంపూర్/బీజింగ్: మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదృశ్యమైన బోయింగ్ విమానం ఏమైందన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా మలేసియా ప్రభుత్వం ఆదివారం అధికారులనుఆదేశించింది. 239 ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న విమానంలో ఇద్దరు దొంగిలించిన (ఒకటి ఇటలీవాసిది, రెండోది ఆస్ట్రియావాసిది) పాస్‌పోర్టులతో ఎక్కారని తేలిన నేపథ్యంలో.. ఉగ్రవాద చర్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ ఇద్దరు వ్యక్తులను సీసీటీవీల ఆధారంగా గుర్తించి వారిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా మలేసియా కోరిక మేరకు ఆ విమానం చివరి సిగ్నళ్లు అందిన ప్రాంతంలో వియత్నాం సహా ఆరు దేశాలు గాలిస్తున్నప్పటికీ రెండో రోజూ ఆచూకీ తెలియలేదు.
కూలిపోయిన విమానానివిగా భావిస్తున్న శకలాలు తమ దేశానికి చెందిన థోచు ద్వీపం వద్ద సముద్రంలో కనిపించాయని వియత్నాం సహాయక బృంద అధికారులు చెప్పారు. అయితే దీన్ని మలేసియా పౌర విమానయాన సంస్థ ఖండించింది. అదృశ్యమైన విమానానికి, ఆ శకలాలకు ఏ మాత్రం పోలికలేదని పేర్కొంది. కాగా ఈ విమానంలో ఓ రెక్క 2012లో స్వల్పంగా విరిగిపోయింది. మరమ్మతుల తర్వాత అది చాలాసార్లు ప్రయాణించిందని చెబుతున్నారు. విమానం కనిపించకుండా పోవడానికి పలు అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటంటే...
వెనక్కు వస్తూ?: కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. అంతకుముందు ఆ విమానం ఏదో కారణం చేత వెనక్కు బయల్దేరిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతికలోపం తలెత్తడం వల్ల అది వెనక్కు వస్తూ కూలిపోయి ఉండొచ్చని ఒక అంచనా.
బాంబు పేలిందా?: ఉగ్రవాదులు ఒకవేళ విమానంలో బాంబులు పెట్టి దాన్ని పేల్చేశారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.
సైనిక చర్యనా?: కొన్ని దేశాల సైన్యాలు అనుకోకుండా విమానాలను కూల్చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1988లో అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ విన్సినెస్ పొరబాటున ఇరాన్ విమానాన్ని కూల్చే యడంతో అందులోని 290 మంది మరణించారు. 1983లో కొరియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని రష్యా యుద్ధ విమానం కూడా ఇలాగే కూల్చేసింది. అలాగే ఈ విమానాన్ని కూడా ఏ దేశ సైన్యమైనా కూల్చేసి ఉండొచ్చా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, విమానం గాల్లోకి లేచాక పైలట్ ‘ఆటో పైలట్’ ను యాక్టివేట్ చేసి మర్చిపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానమూ ఉంది.