సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీతంగా పెరగడం మన దేశంపైనా ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు కొరత మొదలైంది. పలు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుదుత్పత్తి నిలిచిపోయి, అంధకారం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్లాంట్లలో కేవలం ఒక్క రోజుకు సరిపడానే బొగ్గు నిల్వలు ఉన్నాయని.. తక్షణమే బొగ్గు సరఫరా జరగకుంటే ఢిల్లీలో చీకట్లు అలముకుంటాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శనివారం కేంద్రానికి లేఖ రాశారు.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 110 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు లేకపోవడంతో శనివారం పలు రాష్ట్రాల్లోని 16 ప్లాంట్లలో (మొత్తం 16,880 మెగావాట్ల సామర్థ్యం) విద్యుదుత్పత్తి జరగలేదు.
సింగరేణి నుంచి తరలింపు
సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి.. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును నిల్వ ఉంచడానికి బదులు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే స్థితిలో ఉన్న ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు.
అయితే సింగరేణికి తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని.. ఇక్కడి అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఉన్నా.. రాష్ట్రంలోని ప్లాంట్లకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణలో 4 రోజులకు సరిపడానే..
బొగ్గు కొరత ప్రభావం తెలంగాణపైనా పడింది. రాష్ట్రంలోని జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ప్రస్తుతం నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 4 రోజులకే సరిపోతాయని పేర్కొంటున్నాయి.
పిట్‌హెడ్ (బొగ్గు గనులకు సమీపంలో ఉన్న) ప్లాంట్లలో 5 రోజులకన్నా తక్కువకు సరిపడా బొగ్గు నిల్వలే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని జెన్‌కో, ఎన్టీపీసీ, సింగరేణి ప్లాంట్లలో సజావుగా విద్యుదుత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. అంటే 15 రోజుల అవసరాలకు కనీసం 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 5.92 లక్షల టన్నులే ఉన్నట్టు సీఈఏ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
‘పిట్‌హెడ్’ కాబట్టి ఇబ్బంది లేదు!
బొగ్గు గనులకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. ఈ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేసేందుకయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంటు తప్పిస్తే.. మిగతా థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు రవాణా తక్కువ సమయంలో జరుగుతుంది. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, అవసరమైతే తక్షణమే బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు చెప్తున్నారు.
కొరత ఎందుకంటే?
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ల అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు పుంజుకోవడం, ఇతర రంగాలు కూడా సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనితో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగుదేశం చైనాలో వారం, పది రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు రెట్టింపునకు పైగా పెరిగాయి. మన దేశంలోనూ విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు కొరత వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment