పల్లెకు విద్యుత్ ‘షాక్’!
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే రాష్ట్ర ప్రజలకు చెమటలు పడుతున్నాయి. ఒకవైపు ఎండల వేడిమి... మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్రామాలైతే ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక అల్లాడుతున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా 2 నుంచి 3 గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రోజుకు 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు. అయితే ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకూ అని అధికారికంగా ఎక్కడా ప్రకటించడం లేదు. అనధికారికంగా ఇష్టమొచ్చినట్టు కోతలను అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు అక్టోబర్ మొదటివారంలో విద్యుత్ కోతలు అమలుచేసిన సందర్భం లేదు. గత ఏడాది మాత్రమే సింగరేణిలో సమ్మె కారణంగా బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడి కొద్దిమేరకు విద్యుత్ కోతలను అమలు చేశారు.
ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నప్పటికీ విద్యుత్ కోతలు ఎందుకు అమలవుతుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గృహ వినియోగదారులకు అడ్డదిడ్డంగా కోతలు అమలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను కూడా తీవ్రంగా తగ్గించింది. వ్యవసాయ ఫీడర్లకు రోజుకు 7 గంటల చొప్పున ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా 7 గంటలు సరఫరా కావడం లేదు. కేవలం 2-3 గంటల మేరకు మాత్రమే విద్యుత్ వస్తోంది. అది కూడా పదే పదే ట్రిప్ అవుతూ మూడు, నాలుగు విడతలుగా వస్తోంది. దీంతో తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేస్తే జీతాల్లో కోత విధిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా దారుణంగా పడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వ్యవసాయానికి ఏరోజైనా 7 గంటలు సరఫరా కాకపోతే... మరుసటి రోజు ఆ మేరకు అదనంగా విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది.
ఉత్పత్తి పెంచని సర్కారు!: భారీ వర్షాలతో రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. వీటితో పాటు జూరాల, సీలేరు బేసిన్‌లోని విద్యుత్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి బాగా జరుగుతోంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌టీపీసీకి చెందిన వైజాగ్‌లోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక యూనిట్‌లో బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మిగిలిన మూడు యూనిట్లలోనూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన విద్యుత్ వాటా తగ్గిపోయింది. ఈ ప్లాంట్లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు వీలుంది. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కూడా పెరుగుతుంది. అయితే ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవిని తలపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పల్లెలు తేడా లేకుండా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయని చెబుతున్నారు.