ఆర్టీపీపీపై సవతి ప్రేమ
- ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయండి
- సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమకు మణిహారంగా నిలుస్తున్న ఆర్టీపీపీకి అవసరమైన బొగ్గు సరఫరాలో సవతిప్రేమ చూపొద్దని, జెన్‌కో సంస్థతో చేసుకున్న అగ్రిమెంటు మేరకు బొగ్గు సరఫరా చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఎండీ సుతిత్రభట్టాచార్యకు సోమవారం లేఖ రాశారు. 1050 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేక యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.
సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆయన వివరించారు. జెన్‌కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా, ఆమేరకు బొగ్గు సరఫరా కావడం లేదని అవినాష్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు. జెన్‌కోలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ
ఆర్టీపీపీ ఏరోజుకారోజు బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపరిణామానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్‌సీసీఎల్ కారణంగా ఉత్పత్తి ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఎస్‌సీసీఎల్ ఛెర్మైన్‌కు రాసిన లేఖలో తెలిపారు.