► విద్యుత్ ఉద్యోగుల విభజన పై మళ్లీ ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఆదివారం భేటీ అయిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ మధ్యేమార్గంగా కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, తెలంగాణ అధికారులు ససేమిరా అన్నట్టు సమాచారం. దీంతో విభజన వ్యవహారంలో మళ్లీ పీఠముడి పడింది. సోమవారం కూడా మరోదఫా చర్చల అనంతరం ఎంతోకొంత పురోగతి ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఆదేశంతో ఏర్పడిన జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలోని కమిటీ గత రెండు రోజులుగా విస్తృత చర్చలు జరిపింది. ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నమూనా మార్గదర్శకాలను (డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్) రెండు రాష్ట్రాల మధ్య ఉంచినట్టు తెలిసింది.
ఇప్పటివరకూ విభజన జరిగిన రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. ఏ రాష్ట్రంలో పనిచేయాలనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. అనారోగ్య కారణాలు, భార్యాభర్త హైదరాబాద్‌లో పనిచేస్తుంటే న్యాయబద్ధంగా వారు కోరుకున్న చోటే కొనసాగించడం మంచిదని సూచించినట్టు తెలిసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో విషయాలను పక్కనబెడితే డిస్కమ్‌ల ఉద్యోగల విభజనపై ఏపీ వాదనతో ఏకీభవించినట్టు సమాచారం. వివాదం లేని ఇలాంటి విభాగాల్లో తక్షణ విభజనకు ఉపక్రమించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.
అయితే, ధర్మాధికారి కమిటీ డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌తో తెలంగాణ విద్యుత్ అధికారులు విభేదించినట్లు సమాచారం. తాము రిలీవ్ చేసిన 1,252 మందిని ఆంధ్ర విద్యుత్ సంస్థలే తీసుకోవాలని, ఇది సున్నితమైన, భావోద్వేగమైన అంశమని కమిటీ ముందు పేర్కొన్నట్టు తెలిసింది. అవసరమైతే ఏపీ సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చని మొదటి నుంచి చేస్తున్న వాదననే కమిటీకి తెలిపింది. తెలంగాణ అధికారులు సహకరించకపోవడంతో విభజనలో ఎలాంటి పురోగతి కన్పించలేదని తెలుస్తోంది.
ఏపీ సుముఖత.. తెలంగాణ విముఖత
Published Mon, May 2 2016 3:56 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM
Advertisement