విద్యుత్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 30 | 30 percent fitment for electricity employees | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 30

Published Wed, Dec 3 2014 1:45 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

విద్యుత్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 30 - Sakshi

విద్యుత్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 30

 వేతన సవరణకు సీఎం కేసీఆర్ నిర్ణయం
 15 ఏళ్ల సర్వీసు నిండితే 3 ఇంక్రిమెంట్లు
 15 ఏళ్ల లోపు ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు
 కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి 30 వేలు పెరిగే చాన్స్
 పింఛన్‌దారులకు కూడా 30 శాతం ఫిట్‌మెంట్
 టీ సర్కారుపై రూ.600 కోట్ల అదనపు భారం
 

 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగుల వేతన సవరణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. 15 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. విద్యుత్ శాఖలోని పెన్షనర్లకు కూడా 30 శాతం ఫిట్‌మెంట్‌తో పింఛన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ వేతన సవరణ వర్తించనుంది. ఇటీవలే సమ్మె నోటీసు ఇచ్చిన విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి సచివాలయంలో సమీక్ష జరిగింది. టీఎస్‌జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.కె.జోషీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు సుధాకర్‌రావు, శివాజీ, రామరెడ్డి, మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులతో పాటు ఉద్యోగ సంఘాల నేతల ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందన్నారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వటం సముచితమని పేర్కొన్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగులపై ఎంతో నమ్మకం ఉందని.. అందుకే విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించినట్లు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో కూడా మెరుగుదల చూపాలని సూచించారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకొని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రతిష్టను పెంచాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చూపిన చొరవ, చైతన్యాన్ని పునర్నిర్మాణంలో కూడా చూపించాలన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలన్నారు.
 
 రూ.600 కోట్ల భారం..
 
 తాజా వేతన సవరణ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.600 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం విద్యుత్ శాఖలోని అన్ని విభాగాల్లో మొత్తం 26,894 మంది ఉద్యోగులున్నారు. వీరికి ఏటా ప్రభుత్వం రూ.1,233 కోట్ల జీతాలు చెల్లిస్తోంది. తాజా ఫిట్‌మెంట్ ప్రకారం రూ.500 కోట్ల అదనపు భారం పడుతుంది. మొత్తం ఉద్యోగుల్లో 15,152 మంది పదిహేను ఏళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులున్నారు. వీరికి రెండు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. మిగతా 11,742 మంది పదిహేను ఏళ్లకు మించి సర్వీసు ఉండటంతో మూడు ఇంక్రిమెంట్లు పొందుతారు. ఉద్యోగులకు తోడు విద్యుత్ విభాగంలో 19,292 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రస్తుతం రూ.583 కోట్ల పెన్షన్లు ఇస్తున్నారు. సవరించిన వేతనాలతో ఈ కేటగిరిలో రూ.100 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే మధ్యంతర భృతి అమలు చేస్తుండడంతో.. తాజా వేతన సవరణతో ఉద్యోగులకు కేడర్‌ను బట్టి కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
 
 విద్యుత్ సంఘాల జేఏసీ హర్షం..
 
 వేతన సవరణ నిర్ణయంపై విద్యుత్ సంఘాల జేఏసీ హర్షం ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి సహకరించిన టీఎస్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు సన్మానించారు. 27 ఉద్యోగ సంఘాలతో ఏర్పడ్డ జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తాజా నిర్ణయాలు విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో రెట్టింపు ఉత్సాహం నింపిందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం సీఎంకు ధన్యవాదాలు తెలిపింది.
 
 జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో..
 
 మొత్తం ఉద్యోగులు    :    26,894
 ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్ కేడర్    :    8,610
 నాన్ టెక్నికల్ కేడర్    :    18,284
 రెండు ఇంక్రిమెంట్లకు అర్హులు    :    15,152
 మూడు ఇంక్రిమెంట్లకు అర్హులు    :     11,742
 పెన్షనర్లు    :    19,292
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement