సమ్మె ముగిసింది | rtc strike end | Sakshi
Sakshi News home page

సమ్మె ముగిసింది

Published Thu, May 14 2015 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

సమ్మె ముగిసింది - Sakshi

సమ్మె ముగిసింది

  •       జూన్ నుంచి ఫిట్‌మెంట్ అమలు..4,300 మంది కాంట్రాక్టు       కార్మికులు నేటి నుంచే రెగ్యులర్
  •      ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో గ్రాంటు ఇస్తామని హామీ
  •      జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 200 కోట్ల సబ్సిడీ
  •      నష్టాల్లో వాటా పంచుకునేలా కేంద్రంపై ఒత్తిడి
  •      బస్సు చార్జీలు పెంచక తప్పదు.. సామాన్యులపై భారం పడకుండా చూస్తాం: కేసీఆర్
  •      ఫిట్‌మెంట్‌తో ఏటా పడే భారం రూ.821 కోట్లు
  •      కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు 1,387 కోట్లు
  •  వారం రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ సమ్మె ముగిసింది. కార్మికులు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగానే ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేకంగా గ్రాంటు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా మేరకు నష్టాలను సైతం పాలుపంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. అయితే ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై పడే భారాన్ని తట్టుకునేందుకు కొంతమేర చార్జీలు పెంచకతప్పదని కేసీఆర్ స్పష్టం చేశారు.    
     
     తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం కేసీఆర్ స్వయంగా కార్మిక సంఘాల ప్రతినిధులు, మంత్రుల ఉపసంఘంతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇతర సంస్థలతో పోలిస్తే ఆర్టీసీ కార్మికులకు చాలా తక్కువగా వేతనాలున్నాయని చెప్పారు. వాళ్లను ఆదుకొనేందుకు చరిత్రలో లేనివిధంగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించామని చెప్పారు. జూన్ నెల నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో 50 శాతం బాండ్ల రూపంలో 50 శాతం నగదు రూపంలో అందిస్తామని తెలిపారు. నగదు రూపంలో చెల్లించే బకాయిలను మూడు భాగాలుగా విభజించి, దసరా పండుగకు మొదటి విడత, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉగాదికి రెండో విడత, తదుపరి దసరాకు మూడో విడత చెల్లిస్తారని చెప్పారు. బాండ్ల రూపంలోని మిగతా సగాన్ని ఐదేళ్ల తర్వాత అందిస్తారని వెల్లడించారు. తాజా సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించి కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్నారు. కార్మికులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించటంతో పాటు కొన్ని చోట్ల జరిగిన సస్పెన్షన్లను ఎత్తివేస్తారని తెలిపారు.

     ఏటా రూ. 821 కోట్ల అదనపు భారం..
     వేతన సవరణ కారణంగా కార్మికులకు రూ.1,387 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. 44 శాతం ఫిట్‌మెంట్‌తో ఏడాదికి రూ.821 కోట్లు అదనపు భారం పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఆర్టీసీలో 4,300 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఆ కాంట్రాక్టు కార్మికులను రేపట్నుంచే రెగ్యులరైజ్ చేస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు. పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికులకు ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.

     ఆదుకునేందుకు గ్రాంట్లు
     గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ భయంకరమైన నష్టాల్లో కూరుకుపోయిందని సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ‘‘సమ్మె చేయిస్తున్నదే కేసీఆర్ అని, చార్జీలు పెంచేందుకే చేయిస్తున్నారని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ల చేతకానితనాన్ని మామీద రుద్దారు. సంస్థను భయంకరమైన నష్టాల్లోకి నెట్టేసింది వాళ్లే. ప్రస్తుతం ఆర్టీసీ రూ.1,900 కోట్లకుపైగా అప్పుల్లో ఉంది. ఏటా రూ.400 కోట్ల పైచిలుకు నష్టాల్లో నడుస్తోంది. ఇదీ వాస్తవ పరిస్థితి. రెండేళ్లుగా కార్మికుల పీఆర్సీని పట్టించుకోలేదు. ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే నష్టాలను అధిగమించేందుకు ప్రతి ఏడాది బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేకంగా గ్రాంట్ కేటాయిస్తాం. ఇక హైదరాబాద్‌లో 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. వాటిపై వచ్చే నష్టాలకు సంబంధించి  జీహెచ్‌ఎంసీ రూ.200 కోట్ల సబ్సిడీని భరిస్తుంది. అందుకు వీలుగా మున్సిపల్ చట్టాన్ని సవరిస్తాం..’’ అని కేసీఆర్ తెలిపారు.

     చార్జీలు పెంచక తప్పదు
     ఆర్టీసీ నష్టాలు, ప్రస్తుత వేతన సవరణ భారాన్ని సర్దుబాటు చేసేందుకు చార్జీలు పెంచక తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘కొంత మేర చార్జీలు పెంచుతం. అది ఆర్టీసీ యాజమాన్యం చూసుకుంటుంది. క్రమపద్ధతిలో చార్జీలు పెంచే ఆలోచనలో ఉన్నం. అయితే సామాన్యులపై భారం ఎక్కువ లేకుండా చూస్తాం. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజలే. లక్షలాది మంది ఆర్టీసీపై ఆధారపడి బతుకుతున్నారు. వారి బాధలను కూడా ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలి..’’ అని విజ్ఞప్తి చేశారు.


     ముక్కుపిండి వసూలు చేస్తం..
     ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం ఈక్విటీ ఉందని, సంస్థ ఇబ్బందుల్లో ఉన్నందున నష్టాలను సైతం పంచుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామని కేసీఆర్ చెప్పారు. సింగరేణిలో లాభాలు వస్తుంటే డివిడెండ్‌ను తీసుకుంటున్న కేంద్రం.. ఆర్టీసీలో నష్టాన్ని పంచుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కేంద్రం ముక్కు పిండి మరీ ఆర్టీసీ నష్టాల్లో వాటాను వసూలు చేస్తామని చెప్పారు. దీనిపై గత ప్రభుత్వాలు కనీసం నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ నెలాఖరులో ఒకరోజంతా కార్మిక నాయకులు, ఆర్టీసీ యాజమాన్యంతో ఈ అప్పులు, నిధులకు సంబంధించిన వ్యూహంపై సమాలోచనలు చేస్తామని తెలిపారు.


     మామీద ఏడుపెందుకు..?  చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
     ‘‘మా ఉద్యోగులకు మేం ఎంతైనా ఇచ్చుకుం టాం. మాతో పోల్చుకునుడు ఎందుకు, మా మీద ఏడ్చుడెందుకు..?’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును ఎద్దేవా చేశారు. ‘‘కచ్చితంగా మాది ధనిక రాష్ట్రం. మేమేం డబ్బా కొట్టుకోవడం లేదు. 14వ ఆర్థిక సంఘమే ఆ విషయం తేల్చి చెప్పింది. మేం మా ఇష్టమున్నట్లు ఫిట్‌మెంట్ ఇచ్చుకుంటం. మాకు కష్టం కల్పించేందుకు ఉద్యోగులకు 43 శాతం ఇచ్చారంటూ బాబు ఏదేదో అంటున్నడు. మా ఉద్యోగులకు మేం ఇచ్చుకుంటం. మా కష్టం మేం పడుతం. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్లు మెదలాలి. కేసీఆర్‌తో ఆయనకు ఏం పని. మాకున్న 24 గంటలే మాకు సరిపోతలేదు..’’ అని ధ్వజమెత్తారు.
     
     ఫిట్‌మెంట్ అంటే..

     ఉద్యోగులు ఇప్పటికే పొందుతున్న మూల (బేసిక్) వేతనానికి.. కొంత శాతం మేరకు అదనంగా ఇచ్చే మొత్తాన్నే ఫిట్‌మెంట్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతమున్న మూల వేతనానికి ప్రకటించిన ఫిట్‌మెంట్‌తో పాటు కరువు భత్యాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. ఈ మొత్తం ప్రక్రియనే వేతన స్థిరీకరణ (పే రివిజన్) అంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులకు నాలుగేళ్లకోసారి కమిటీ (పీఆర్సీ) వేసి ఈ వేతన స్థిరీకరణను ప్రకటిస్తారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది.


     పెంపు ఎలాగంటే..?
     కొత్త బేసిక్‌ను 2013 ఏప్రిల్ 1 నాటి బేసిక్‌కు సవరింపుగానే పరిగణిస్తారు. కొత్త వేతన సవరణ జరగాల్సిన తేదీ అయినందున అప్పటి నుంచి మార్పుచేర్పులు జరగాల్సి ఉంటుంది. ఈ రెండేళ్లలో డీఏ అదనంగా 21.60 శాతం పెరిగింది. కొత్త బేసిక్‌కు ఇది కలుస్తుంది. ఇక 30 శాతం ఇంటి అద్దె భత్యం (ప్రాంతాలవారీగా మారుతుంది) కూడా కలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా రెండు ఇంక్రిమెంట్లు (కేటగిరీలవారీగా మొత్తాల్లో తేడా ఉంటుంది) వచ్చాయి. వాటినీ కలపా ల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇతర భత్యాలు జమ అవుతాయి. స్కేల్ ఫిక్సేషన్ అడ్జస్ట్‌మెంట్ కింద కొంత మొత్తం తోడవుతుంది. ఇవన్నీ జోడిస్తే ప్రస్తుతం ఉద్యోగి పొందుతున్న వేతనం రెట్టింపును మించుతుంది. కొత్త స్కేల్, కొత్త ఇంక్రిమెంట్లు ఎంత ఉండాలో ఇప్పుడు మళ్లీ నిర్ధారించాల్సి ఉంది.


     అధికారులకే అధిక లబ్ధి
     ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్ వల్ల కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్‌లు ఇతర చిన్నస్థాయి ఉద్యోగుల కంటే పైస్థాయి అధికారులకే భారీగా లబ్ధి కలిగింది. 1995లో ఉద్యోగంలో చేరిన డ్రైవర్ మూల వేతనం రూ. 12,400గా ఉంది. దీనికి డీఏ, తాజా ఫిట్‌మెంట్ జోడిస్తే రూ.23,783గా మారింది. కానీ అదే ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల మూల వేతనం రూ.1,21,703కు చేరుకుంది. దీనికి రెండేళ్లలో అదనంగా పెరిగిన డీఏ, ఇంటి అద్దె భత్యం, ఇతర అలవెన్సులు, స్కేల్ కలిపితే ఏకంగా అది రూ.2 లక్షలకు చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement