సమ్మెతో పల్లెల్లో చీకట్లు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో ఉద్యోగుల మెరుపు సమ్మెతో పల్లెల్లో చీకట్లు అలుముకున్నాయి. సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడడంతో పవర్ గ్రిడ్ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లెలకు కరెంట్ కట్ చేశారు.
వేతన సవరణ కమిటీ వేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఆదివారం ఉద్యోగుల సెలవురోజు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. సోమవారం నాటికి ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో దాదాపు 2 నుంచి 3 గంటలకు పైగా కోత విధించారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 గంటల పాటు కోత విధించారు. పల్లెల్లో ఉదయం పోయిన కరెంట్ రాత్రి 11 గంటల వరకూ రాలేదు. 63 మండలాల పరిధిలోని పలు పల్లెలో చీకట్లు అలుముకున్నాయి.
శనివారం ట్రాన్స్‌కో ఉద్యోగులతో విద్యుత్ సంస్థలు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. సోమవారం మరోమారు చర్చలు జరుపుతారని, దాదాపు ఈ చర్చలు ఫలిస్తాయని ట్రాన్స్‌కో జిల్లా ఉన్నతాధికారులు భావించినా.. సాయంత్రం వరకు చర్చలు జరపలేదు. పల్లెలకు కరెంట్ సరఫరా నిలిపివేత విషయంపై ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్పత్తి లోటు ఏర్పడడం వలన కరెంట్ సరఫరా చేస్తే లోడ్ ఎక్కువై గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశముందని, దీంతో పల్లెలు, పట్టణాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని వివరించారు. కాగా, సోమవారం రాత్రి చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.