కరెంటు.. ఇక్కట్లు
సాక్షి, కడప : అసలే విద్యుత్ కోతలు, ఆపై విద్యుత్ సమ్మె. వెరసి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సంక్షోభం నెలకొంది. ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆదివారం రాత్రి నుంచే ఆగిపోయింది. దీంతోపాటు రాష్ట్రంలోని వీటీపీఎస్, కేటీపీఎస్, శ్రీశైలం కుడిగట్టు వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు పేర్కొన్నారు.
అయితే సోమవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమ్మె కొనసాగిఉంటే జిల్లాలోని అత్యవసర సేవలకు సైతం తీవ్ర విఘాతం కలిగేది. ఇప్పటికే పరిశ్రమలకు పూర్తి స్థాయిలో అధికారులు కోత విధించారు. జిల్లాకు రావాల్సిన కోటా కంటే 50 శాతం తక్కువగా విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో వాణిజ్య, గృహావసరాలకు సైతం కోతలను పెంచారు. సమ్మె విరమణ జరిగి ఉండకపోతే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉండేదని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
విధులను బహిష్కరించిన ఉద్యోగులు
వేతన సవరణకు సంబంధించి అగ్రిమెంటుపై ప్రభుత్వం తరపున అధికారులు సంతకం చేయాలని విద్యుత్ జేఏసీ చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ నరసింహారావులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఆపరేషన్స్‌కు సంబంధించి రెండు వేల మంది, ట్రాన్స్‌కో ఉద్యోగులు వెయ్యి మంది, ఆర్టీపీపీలో 2500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో కలుపుకుని పూర్తి స్థాయిలో అందరూ సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లా కేంద్రంలోని శంకరాపురం 220 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట, ఆర్టీపీపీలో ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.