
తెలంగాణకు మళ్లీ చుక్కెదురు
విద్యుత్ ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల విభజన విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం జరగలేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో కేంద్ర హోం శాఖ ఏకీభవించింది. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల ఉద్యోగుల విషయంలో విభజనకు పూర్వం, అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న స్థితిని కొనసాగించాల్సిందిగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను తాజాగా ఆదేశించింది. కేంద్ర హోం శాఖ డెరైక్టర్ అశుతోష్ జైన్ తాజాగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు.
ఏపీ స్థానికత ఉన్న 1250 మంది ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు జూన్ 9న మూకుమ్మడిగా ఏపీకి రిలీవ్ చేయడంతో వివాదం రేకెత్తిన విషయం తెలిసిందే. పుట్టిన ప్రాంతం ఆధారంగా ఉద్యోగులను విభజిస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో ఏకపక్షంగా మార్గదర్శకాలు రూపొందించిందని, ఇది విభజన చట్టానికి విరుద్ధమని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాశారు. దానికి స్పందనగానే కేంద్ర హోంశాఖ తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థల్లోని ఉద్యోగులను విభజన తర్వాత ఏడాది దాకా ఆయా సంస్థల్లోనే కొనసాగించాలని, వారి కేటాయింపుకు సంబంధించి సదరు సంస్థల పాలకవర్గాలు ఈ లోపు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 82 స్పష్టం చేస్తోందని కేంద్ర హోంశాఖ గుర్తు చేసింది. విద్యుత్ సంస్థల పాలక మండళ్లు ఈ నిబంధనను పాటించలేదంది. అవసరమైతే కేంద్రమే జోక్యం చేసుకుని పీఎస్‌యూల ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొదించవచ్చని సెక్షన్ 80 పేర్కొంటోందని ప్రస్తావించింది.
పీఎస్‌యూల ఉద్యోగుల కేటాయింపుల్లో మూడు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. వాటిపై శనివారంలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఇరు రాష్ట్రాలకు సూచించింది.
పీఎస్‌యూ ఉద్యోగుల విభజనపై కేంద్రం సూచించిన మూడు ప్రత్యామ్నాయాలు
1) విభజన చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం పీఎస్ యూ ఉద్యోగుల విభజన బాధ్యతలను కమల్‌నాథన్ కమిటీకిగానీ, షీలా భిడే కమిటీకి గానీ కేంద్రం అప్పగిస్తుంది
2) మూడు నెలల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి
3) కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారం గా పీఎస్‌యూల ఉద్యోగులవిభజన మార్గదర్శకాలు రూపొందించాలి. వివాదాలపై నిర్ణయాధికారం ఆ కమిటీకే అప్పగించాలి.
ఉద్యోగసంఘాల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, వాటికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలైన విషయం విదితమే. అయితే, వీటిలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ టీవిద్యుత్ ఉద్యోగుల సంఘం, టీవిద్యుత్ అకౌంట్స్ అధికారుల సం ఘం వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. వీరి వాదనలు వినాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.