రాజధాని కమిటీ’ విధివిధానాలివీ..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలని.. అన్ని వనరులూ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని సూచించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి విధివిధానాలను ఖరారు చేస్తూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని ఎంపికలో కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. పర్యావరణానికి హాని జరగకుండా, తక్కువ ఖర్చుతో నిర్మించేందుకు అనువుగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా ఉండాలని సూచించారు.
విధివిధానాలు ఇవీ..
1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకు విభిన్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలి. ఏది మేలైన ప్రాంతమవుతుందో సరిపోల్చాలి. దీనిలో భాగంగా అందుబాటులో ఉన్న గణాంకాలు, ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వం, పలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
2. రాజధాని ప్రాంతాలను ఎంపిక చేసేందుకు, సిఫారసులు చేసేందుకు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎ) తగినంత భూమి, నీరు, ఇతర సహజవనరుల లభ్యత ఉండాలి. డిగ్రేడెడ్ అటవీ భూమిని డీరిజర్వేషన్ చేసేందుకు వీలు కలిగి ఉండాలి.
బి) పెరిగే జనాభాకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలి. ముఖ్యంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ఆఫీసు కార్యాలయాలు, అతిథి గృహాలు, నివాస భవనాలు, స్టేడియంలు, సమావేశ మందిరా లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణసంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, సినిమా థియేటర్లు, రిక్రియేషన్, పర్యాటక కేంద్రాలు, పార్కులు, మార్కెట్లు.. ఇలా అన్నింటికీ ఆ ప్రణాళికలో చోటుండాలి.
సి) రాజధానిగా ఏర్పాటయ్యే ప్రాంతం నుంచి వివిధ జిల్లాలకు, ప్రస్తుత ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌కు, ఇతర నగరాలకు రోడ్డు, రైలు, విమానయాన రవాణా వ్యవస్థ కలిగి ఉండాలి. అలాగే రాజధానిగా ఏర్పాటయ్యే నగరంలో ర్యాపిడ్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను వృద్ధిపరిచేందుకు అవకాశం ఉండాలి.
డి) ఈ ప్రాంతంలోని ఇతర ప్రముఖ నగరాలను అనుసంధానం చేస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతికపరమైన మౌలిక వసతులను అభివృద్ధిపరిచేందుకు అవకాశాలను అంచనావేయడం
కమిటీ సిఫారసులు చేసేటప్పుడు ఈ కింది అంశాలను
పరిగణనలోకి తీసుకోవాలి..
ఎ) ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలు తొలగించకుండా చూడాలి. అలా చేపట్టాల్సి వస్తే అది చివరి ప్రత్యామ్నాయమే కావాలి. అలాగే ప్రజలను, ప్రజావాసాలను కూడా తరలించేలా ఉండకూడదు. అలా జరిగినా అది నామమాత్రమే కావాలి.
బి) నీటి వనరులు సహా ఇతర స్థానిక పర్యావరణానికి ఏ మాత్రం హాని కలుగరాదు
సి) ఘనీభవ, ద్రవీభవ కాలుష్యాలను అరికట్టేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ను ఫోకస్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
డి) తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలపై అంచనా ఉండాలి.
ఇ) నిర్మాణ వ్యయం, భూసేకరణకు ఖర్చు తక్కువయ్యేందుకు గల అవకాశాలను అంచనా వేయాలి.