విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు చేసిన సమ్మె తీవ్ర ప్రభావం చూపుపింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఇంజినీర్ స్థాయి ఉద్యోగి వరకు విధులు బహిష్కరించడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాలో 200 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోవడంతో పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు ఇళ్లల్లో ఇన్వర్టర్‌లు ఉన్నప్పటికీ అవి ఛార్జ్ అయ్యేందుకు విద్యుత్ సరఫరా లేక మూలకు చేరాయి.
తాగునీటి సరఫరాపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రక్షిత మంచి నీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీరందక జనాలు విలవిలాడారు. విజయనగరం మున్సిపాలిటీకి అధిక శాతం నీరందించే ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకం వద్ద ఇదే పరిస్థితి ఉండడంతో విజయనగరం పట్టణ ప్రజలకు తాగు నీరందక ఇక్కట్లకు గురయ్యారు. ఇదే తరహాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మంచి నీటికోసం ఇబ్బందులు పడ్డారు. బోరుబావులు, నేల బావులు మహిళలతో కిటకిటలాడాయి. ప్రజల ఇబ్బందులు గుర్తించిన ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు.
రెండో రోజూ కొనసాగిన సమ్మె
గతంలో ఇచ్చిన హమీ ప్రకారం విద్యుత్ శాఖ ఉద్యోగులు 27.5 శాతం పీఆర్సీ అమలుచేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండవ రోజు సోమవారం కొ నసాగింది. జిల్లా వ్యాప్తంగా 1185మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎ త్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఐకాస ప్రతినిధులు బి.కె.వి.ప్రసాద్,ఎం.నిర్మల మూర్తి, రాజేంద్రప్రసాద్, వర్మ పాల్గొన్నారు. కాగా రాత్రి 10గంటల సమయం లో విద్యుత్ సంస్థలతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ ఏక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ డి.ఆర్.ఎస్. వరప్రసాద్ తెలిపారు.
ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌లకు కాసుల పంట
విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు పండగ చేసుకుంటున్నారు. ఇళ్లల్లో చిన్న పాటి సమస్యలను పరిష్కరించేందుకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే జూనియర్ లైన్‌మైన్‌లు సమ్మెలోకి వెళ్లడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు ఆశ్రయిస్తున్న వినియోగదారులు చేతి చమురు వదలించుకుంటున్నారు.
అంధకార బందురం
Published Tue, May 27 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement