ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు! | telugu states electricity employees salaries issue | Sakshi
Sakshi News home page

ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు!

Published Mon, Nov 7 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు!

ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు!

విచిత్ర పరిస్థితిలో రిలీవైన ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు
రెండేళ్లుగా 1,252 మందికి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతాలు
కేసు సత్వర పరిష్కారానికి ఏజీతో సంప్రదింపులు

సాక్షి, హైదరాబాద్‌:
ఏ పనీ చేయించుకోకుండా వందలాది మంది ఉద్యోగులకు ప్రతినెలా లక్షల రూపాయల జీతభత్యాలను చెల్లించడాన్ని ఎక్కడైనా చూశారా... ఎక్కడో కాదు మన తెలంగాణలోనే దాదాపు ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు 1,252 మంది ఏపీ ఉద్యోగులను ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నా యి. వీళ్లందరికీ ఇప్పటివరకు ఇలా చెల్లించిన జీతభత్యాల మొత్తం రూ.200 కోట్లకు చేరిపోయింది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపు వివాదం పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివాదం పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడానికి ఇరు రాష్ట్రాలు ససేమిరా ఒప్పుకోవడం లేదు.

ఏపీ స్థానికత గల 1,252 మంది విద్యుత్‌ ఉద్యోగులను 2015 జూన్‌ 10న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు మూకుమ్మడిగా వారి సొంత రాష్ట్రానికి రిలీవ్‌ చేశాయి. వీరిని ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిరాకరించాయి. రిలీవైన ఏపీ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 52:48 నిష్పత్తిలో రిలీవైన ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలని గతేడాది సెప్టెంబర్‌ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ విద్యుత్‌ సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఏపీ ఉద్యోగులకు తెలంగాణ యాజమాన్యాలే పూర్తి జీతాలు చెల్లించాలని గత ఏప్రిల్‌ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై రోజువారీగా విచారణ నిర్వహించి 8 వారాల్లో తీర్పు జారీ చేయాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు విధించిన 8 వారాల గడువు పూరై్త నా ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో హైకోర్టు నియమించిన కమిటీ సైతం ఇప్పటికే నివేదికను సమర్పించి చాలా కాలమైంది. ఈ పరిస్థితులను నివేదిస్తూ తెలంగాణ విద్యుత్‌సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కోర్టులో కేసు ఎంతకీ తేలకపోవడంతో రిలీవ్‌ చేసిన ఉద్యోగులకు ప్రతినెలా రూ.12 కోట్ల జీతాలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిపాయి. తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డితో మాట్లాడి హైకోర్టులో కేసు విచారణకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement