salaries issue
-
అపోలో ఫార్మసీలో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ఉద్యోగుల జీతాలను షార్టేజ్ పేరుతో నిలువు దోపిడి చేస్తున్న ఘటన రాచకొండ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో చోటుచేసుకుంది. చాలచాలనీ జీతాలు ఇస్తూ అందులోనూ షార్టేజ్ పేరుతో.. ఎగ్జిక్యూటివ్ సిబ్బంది డబ్బులు కాజేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫార్మసీ ఉద్యోగులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ట్రైనీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న జెస్సీ(బేబీ) ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రతినెలా షార్టేజ్ పేరుతో 5వేల నుంచి 8వేల రూపాయల వరకు కాజేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే జీతంలో మొత్తం డబ్బులు వారే తీసుకుంటే మేము ఎలా బ్రతకాలి..? మా కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించారు. (హైదరాబాద్ పోలీసుల సాహసం..) దీంతో ఫార్మసీ ఉద్యోగులు పోలీసులను కలిసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాఫియాగా ఏర్పడి ఉద్యోగులను వేదిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫార్మసీ ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సెలవులొస్తే జీతం కట్!
సాక్షి, బోథ్(ఆదిలాబాద్) : వారంతా ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే బోధిస్తారు. కాని వేతనా లు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుకుంటున్నట్లు వారు అందుకోరు. సెలవులు వ స్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో ఎ లాంటి మార్పు ఉండదు. కాని హవర్లీ టీచర్లకు మాత్రం ఎటువంటి వేతనాలు ఉండ వు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. సమాన పనికి సమాన వేతనాలను అందించాలని వారు డిమాండ్చేస్తున్నారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం గంటకు వేతనంగా నిర్ణయించి ఉపాధ్యాయులను నియమించింది. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యాబోధన ఉంటుంది. వీరికి ప్రతి గంటకు రూ.140 చెల్లిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయులు కనీసం ఐదు క్లాసులు బోధిస్తారు. ఈ లెక్కన ఉపాధ్యాయులకు ప్రతి రోజు రూ.700 వరకు వేతనం ఉంటుంది. పాఠశాలకు సెలవు నేపథ్యంలో తరగతులు ఉండవు. కాబట్టి వీరికి వేతనాలు అందవు. నెలలో 30 రోజుల్లో నాలుగు ఆదివారాలు, ఒక రెండవ శనివారం పో నూ 25రోజులు పనిదినాలు ఉంటాయి. అంటే సగటున వీరు రోజుకు రూ.700ల వేతనా లను పొందితే 25 రోజులకు రూ.17 వేలా 500 రావాలి. కానీ ప్రభుత్వం నెలకు కేవలం 100గంటల వేతనాలను మాత్రమే చెల్లిస్తోంది. అంటే గరిష్టంగా వీరు రూ.14 వేలు మాత్రమే వేతనాలను పొందుతున్నారు. అది కూడా సెలవులు లేకపోతేనే.. అదే సెలవులు వస్తే వారి జీతాల్లో కోతే. నెలలో మరిన్ని సెలవులు వస్తే ఆ రోజుల్లో వేతనాలను కోల్పోతారు. దీంతో సగటున తమకు 12 వేల రూపాలయ వరకు మాత్రమే అందుతున్నాయని వాపోతున్నారు. అక్టోబర్‌లో అన్నీ సెలవులే.. అక్టోబర్ నెలలో దసరా సెలవులు రావడం, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించడంతో ఒక్క రో జు కూడా పాఠశాలలు పని చేయలేదు. దీంతో వారికి ఈ నెల వేతనాలు అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో 31రోజులుండగా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. 21వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆదివారం, దీపావళికి రెండు రోజుల సెలవులు పోనూ మరో ఆరు రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు అక్టోబర్ నెలలో కేవలం ఆరు రోజుల వేతనాలను మాత్రమే అందుకోనున్నారు. అంటే కేవలం రూ.4200 మాత్రమే వారికి అందుతాయి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వకుండా హవర్టీ బేస్డ్ ఉపాధ్యాయులను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని హెచ్‌బీటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ బతుకులు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 162 మంది ఉపాధ్యాయులు హవర్టీ బేస్డ్ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీరు సగటుగా రూ.12 వేల నుంచి 13 వేల వరకు వేతనాలను పొందుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 1500 మంది హవర్లీ బేస్డ్ టీచర్లుగా పనిచేస్తున్నారని, వారికి సెలవుల్లో వేతనాల్లో కోతలను విధించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యాశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ లింగయ్యను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. సమాన పనిక సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. సెలవులతో సంబంధం లేకుండా వేతనాలివ్వాలి మోడల్ స్కూళ్లో పనిచేసే హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయులకు సెలవులకు సంబంధం లేకుండా వేతనాలను అందజేయాలి. సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సెలవులతో సంబంధం లేకుండా సిలబస్‌ను పూర్తి చేసే భారం తమదే అయినప్పుడు వేతనాలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చౌహాన్ గోవింద్, హవర్లీ బేస్డ్ టీచర్ల సంఘం (మోడల్ స్కూల్), జిల్లా అధ్యక్షుడు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలి గంటకు వేతనం కాకుండా ప్రతీ నెల ఫిక్స్డ్ వేతనాలను అందించాలి. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. సమాన పనికి సమాన వేతనాలను అందించాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలను అందించాలి. సెలవులు వస్తే మా వేతనాల్లో కోతలు ఉంటున్నాయి. – పాలెపు గణేశ్, హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయుడు -
వేతన వెతలు..
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావలంటీర్లతో భర్తీ చేస్తోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందడం వల్ల ఏర్పడిన ఖాళీలతో పాటు.. ఎప్పటి నుంచో ఉన్న పోస్టులను విద్యావలంటీర్లతో నింపుతోంది. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుతో సమానంగా బోధిస్తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. కానీ విద్యా వలంటీర్లకు వేతనాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వీరికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ముగిసి సుమారు 20 రోజులు కావడంతో.. వేతనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 596 మంది విద్యా వలంటీర్లు.. జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 596 ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్లను భర్తీ చేసింది. వీరికి నెలకు రూ.12,000 వేతనం ఇస్తోంది. వీరితో ఉపాధ్యాయులతో సమానంగా పని చేయిస్తున్నారు. కానీ నెలనెలా ఇవ్వాల్సిన వేతనాలు మాత్రం మూడు, నాలు గు నెలలకోసారి చెల్లిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారు. మూ డు నెలలకోసారి వేతనాలు ఇస్తుండడం వల్ల ఆ సమయాల్లో పండుగలు వచ్చినా వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.వాస్తవంగా పాఠశాలలు ముగిసేలోపే వారికి వేతనాలు అందించాలి. కానీ నేటికీ వేతనాలు అందకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.1.50 కోట్ల బకాయిలు.. విద్యా వలంటీర్లకు ఇచ్చే అరకొర వేతనం మూడు నెలలుగా అందించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 596 మంది విద్యా వలంటీర్లకు దాదాపు రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు విడుదల కాలేదు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జూన్ 1 నుంచే పాఠశాలలు పునఃప్రారంభం ఈ విద్యాసంవత్సరంలో జూన్ 1వ తేదీనే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. గతంలో జూన్ 12 నుంచి పాఠశాల పునః ప్రారంభించేవారు. గత సంవత్సరం కూడా జూన్ 1 నుండే పాఠశాలలను పునః ప్రారంభించాలని విద్యా క్యాలెండర్ నిర్ణయించినా ఎండల తీవ్రతతో దాన్నిజూన్ 12కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ ఉండడంతో అప్పటికి పాఠశాలలు ప్రారంభం కాకపోవడం వల్ల తెలంగాణ సంబరాలు అంత ఉత్సాహంగా జరగడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌నే మార్పుచేసి జూన్ 1 నుంచే పాఠశాలలను పునః ప్రారంభిచాలని నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభం కావడానికి ఇంకా 25 రోజులు గడువు ఉంది. ఈలోపైనా వేతనాలు అందుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. -
ఉద్యోగుల నిరసన.. వెనక్కి తగ్గిన జెట్
న్యూఢిల్లీ : ఉద్యోగులు వేతనాలు తగ్గించుకోవాలని... లేదంటే జెట్ ఎగరబోదంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేసిన జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ ఎట్టకేలకు కిందకు దిగొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వేతనాలు తగ్గించుకునేది లేదంటూ ఉద్యోగులు, పైలెట్లు భీష్మించుకుని కూర్చోవడంతో, వేతనాల కోతపై జెట్ ఎయిర్వేస్ వెనక్కి తగ్గింది. నాన్-మేనేజ్మెంట్ స్టాఫ్‌కు 25 శాతం తగ్గించబోతున్న వేతన ప్రతిపాదనను పక్కనపెట్టేసింది. శుక్రవారం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు, చైర్మన్ నరేష్ గోయల్‌తో సమావేశం కావడంతో, ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సమావేశ అనంతరం జూలై నెల వేతనాలను కూడా ఈ విమానయాన సంస్థ శుక్రవారమే ఉద్యోగుల అకౌంట్లలోకి క్రెడిట్ చేసింది. వేతన కోత చర్చ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ జూలై నెల వేతనాలు ఆపివేసిన సంగతి తెలిసిందే. వేతనాల కోతపై ప్రతి ఒక్కర్ని ఒప్పించిన తర్వాత జూలై నెల వేతనాలను వేయాలనుకుంది. కానీ ఎలాంటి వేతన కోత చేపట్టడం లేదని చైర్మన్ భరోసా ఇవ్వడంతో, వెంటనే తమ వేతనాలను తమ అకౌంట్లలోకి క్రెడిట్ చేసినట్టు ఓ జెట్ ఉద్యోగి చెప్పాడు. అయితే జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్ ఇప్పటికే వేతనాలను తగ్గించుకుంది. వేతన కోతపై మీడియాలో పలు రిపోర్టులు రావడంతో, గోయల్ ఈ విమానయాన సంస్థ ఇమేజ్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్‌లైన్ అధికారులు చెప్పారు. ‘మీరు సాయం చేశారు.. నేను ఎప్పటికీ అది మర్చిపోను’ అని గోయల్ ఉద్యోగులకు చెప్పినట్టు తెలిసింది. దేశీయ ఏవియేషన్ మార్కెట్ ఆఫర్లను అందిపుచ్చుకుని ఈ ఎయిర్‌లైన్ ముందజలో నిలుస్తుందని గోయల్, ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ కష్టకాలంలో ఉండటంతో తమకు సాయం చేయాల్సిందిగా జెట్ స్టాఫ్‌ను గోయల్ కోరినట్టు వెల్లడైంది. గోయల్ అభ్యర్థన మేరకు ఎయిర్‌లైన్‌కు మద్దతు ఇవ్వాలని జెట్ పైలెట్ల అసోసియేషన్ కూడా తమ సభ్యులను కోరింది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో, జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 5 శాతం నుంచి 25 శాతం వేతనాలు తగ్గించుకోవాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. వేతన కోతపై జెట్ ఎయిర్వేస్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పైలెట్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లు 2016, 2017ల్లో లాభాల అనంతరం తొలిసారి జెట్ ఎయిర్వేస్ 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.767 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కేవలం జెట్ ఎయిర్వేస్ మాత్రమే కాక, ఇండిగో కూడా భారీగా తన లాభాలను పోగొట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో ఇండిగో కూడా నికర లాభాలు 97 శాతం క్షీణించాయి. -
బోయినపల్లిలో తపాలా ఉద్యోగుల వంటావార్పు
బోయినపల్లి : గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండలకేంద్రం లోని సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట శుక్రవారం తపాల ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యితో వంటలు చేశారు. అనంతరం సామూహిక బోజనాలు చేశారు. ఈ సందర్భంగా తపాల ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కమలేశ్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్న తమకు వేతన సవరణ చేసి, జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏఐజేడీఎస్‌యూ కార్యదర్శి క్రిష్ణ, బోయినపల్లి సబ్ పోస్టాఫీసు పరిధిలోని తడగొండ, విలాసాగర్, అనంతపల్లి, నూకలమర్రి, ఫాజుల్‌నగర్, వట్టెంల, నర్సింగాపూర్, కోరెం గ్రామాల బీపీఎంలు కట్ట కిరణ్, జయప్రకాశ్, శశి, తిరుపతి, మల్లేశం, ప్రభాకర్, వేణు, ఈడీఎంసీలు రాజేందర్, లచ్చయ్య, నాగభూషణం తదితరులున్నారు. -
ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు!
► విచిత్ర పరిస్థితిలో రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ► రెండేళ్లుగా 1,252 మందికి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతాలు ► కేసు సత్వర పరిష్కారానికి ఏజీతో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: ఏ పనీ చేయించుకోకుండా వందలాది మంది ఉద్యోగులకు ప్రతినెలా లక్షల రూపాయల జీతభత్యాలను చెల్లించడాన్ని ఎక్కడైనా చూశారా... ఎక్కడో కాదు మన తెలంగాణలోనే దాదాపు ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ఉద్యోగులను ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నా యి. వీళ్లందరికీ ఇప్పటివరకు ఇలా చెల్లించిన జీతభత్యాల మొత్తం రూ.200 కోట్లకు చేరిపోయింది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు వివాదం పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివాదం పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడానికి ఇరు రాష్ట్రాలు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఏపీ స్థానికత గల 1,252 మంది విద్యుత్ ఉద్యోగులను 2015 జూన్ 10న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు మూకుమ్మడిగా వారి సొంత రాష్ట్రానికి రిలీవ్ చేశాయి. వీరిని ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిరాకరించాయి. రిలీవైన ఏపీ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 52:48 నిష్పత్తిలో రిలీవైన ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలని గతేడాది సెప్టెంబర్ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఏపీ ఉద్యోగులకు తెలంగాణ యాజమాన్యాలే పూర్తి జీతాలు చెల్లించాలని గత ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై రోజువారీగా విచారణ నిర్వహించి 8 వారాల్లో తీర్పు జారీ చేయాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విధించిన 8 వారాల గడువు పూరై్త నా ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో హైకోర్టు నియమించిన కమిటీ సైతం ఇప్పటికే నివేదికను సమర్పించి చాలా కాలమైంది. ఈ పరిస్థితులను నివేదిస్తూ తెలంగాణ విద్యుత్‌సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కోర్టులో కేసు ఎంతకీ తేలకపోవడంతో రిలీవ్ చేసిన ఉద్యోగులకు ప్రతినెలా రూ.12 కోట్ల జీతాలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిపాయి. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో మాట్లాడి హైకోర్టులో కేసు విచారణకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. -
జీతాల గోల
– డీఆర్డీఏలో మూడు నెలలుగా అందని వేతనాలు – ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు – పట్టించుకోని ఉన్నతాధికారులు అనంతపురం టౌన్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లోని ఉద్యోగుల పరిస్థితి. జీతాల కోసం బడ్జెట్ విడుదలైనా ఖాతాల్లో జమ కాకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి Ðð ళ్తే.. డీఆర్డీఏలో ఈఓఆర్డీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఓ, సూపరింటెండెంట్, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లు ఇలా అన్ని క్యాడర్లు కలిపి సుమారు 27 మంది వరకు ఉన్నారు. వీరందరూ మూడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమైన వేళ కొందరు అప్పులు చేసి పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకున్న దయనీయ స్థితి. రెండు నెలల కిందట జీతాల కోసం సెర్ప్ నుంచి బడ్జెట్ విడుదలైంది. ఓ దఫా రూ.22 లక్షలు, మరో దఫా రూ.15.50 లక్షల వరకు వచ్చింది. అయితే జీతాలకు సంబంధించి ట్రెజరీకి బిల్లు పెట్టే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీకి వెళ్లాల్సిన సంబంధిత అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూపు తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక అధికారికి సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగి ట్రెజరీకి వెళ్లే విషయంలో అనాసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గతంలో కలెక్టర్ కోన శశిధర్ చొరవ తీసుకోవడంతోనే జీతాల సమస్య పరిష్కారమైనట్లు సమాచారం. గాడితప్పిన ఈ వ్యవహారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. –––––– రెండు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఉద్యోగులకు మే, జూన్ నెల జీతం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ట్రెజరీకి బిల్లు పెట్టాం. అక్కడి అధికారులతో నేనే స్వయంగా మాట్లాడాను. రూ.22 లక్షలకు ఒకే అయింది. మిగతాది కూడా అవుతుంది. రెండు, మూడ్రోజుల్లో జీతాలు అందుతాయి. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ–వెలుగు పీడీ