ఉద్యోగుల నిరసన.. వెనక్కి తగ్గిన జెట్‌ | Jet Airways Shelves Pay Cut Proposal Of Up To 25% For Staff  | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల నిరసన.. వెనక్కి తగ్గిన జెట్‌

Published Mon, Aug 6 2018 12:14 PM | Last Updated on Mon, Aug 6 2018 4:23 PM

Jet Airways Shelves Pay Cut Proposal Of Up To 25% For Staff  - Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు

న్యూఢిల్లీ : ఉద్యోగులు వేతనాలు తగ్గించుకోవాలని... లేదంటే జెట్‌ ఎగరబోదంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మేనేజ్‌మెంట్‌ ఎట్టకేలకు కిందకు దిగొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వేతనాలు తగ్గించుకునేది లేదంటూ ఉద్యోగులు, పైలెట్లు భీష్మించుకుని కూర్చోవడంతో, వేతనాల కోతపై జెట్‌ ఎయిర్‌వేస్‌ వెనక్కి తగ్గింది. నాన్‌-మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌కు 25 శాతం తగ్గించబోతున్న వేతన ప్రతిపాదనను పక్కనపెట్టేసింది. శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, చైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో సమావేశం కావడంతో, ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సమావేశ అనంతరం జూలై నెల వేతనాలను కూడా ఈ విమానయాన సంస్థ శుక్రవారమే ఉద్యోగుల అకౌంట్లలోకి క్రెడిట్‌ చేసింది. 

వేతన కోత చర్చ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ జూలై నెల వేతనాలు ఆపివేసిన సంగతి తెలిసిందే. వేతనాల కోతపై ప్రతి ఒక్కర్ని ఒప్పించిన తర్వాత జూలై నెల వేతనాలను వేయాలనుకుంది. కానీ ఎలాంటి వేతన కోత చేపట్టడం లేదని చైర్మన్‌ భరోసా ఇవ్వడంతో, వెంటనే తమ వేతనాలను తమ అకౌంట్లలోకి క్రెడిట్‌ చేసినట్టు ఓ జెట్‌ ఉద్యోగి చెప్పాడు. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే వేతనాలను తగ్గించుకుంది. వేతన కోతపై మీడియాలో పలు రిపోర్టులు రావడంతో, గోయల్‌ ఈ విమానయాన సంస్థ ఇమేజ్‌ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్‌లైన్‌ అధికారులు చెప్పారు. ‘మీరు సాయం చేశారు.. నేను ఎప్పటికీ అది మర్చిపోను’ అని గోయల్‌ ఉద్యోగులకు చెప్పినట్టు తెలిసింది. దేశీయ ఏవియేషన్‌ మార్కెట్‌ ఆఫర్లను అందిపుచ్చుకుని ఈ ఎయిర్‌లైన్‌ ముందజలో నిలుస్తుందని గోయల్‌, ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ కష్టకాలంలో ఉండటంతో తమకు సాయం చేయాల్సిందిగా జెట్‌ స్టాఫ్‌ను గోయల్‌ కోరినట్టు వెల్లడైంది. 

గోయల్‌ అభ్యర్థన మేరకు ఎయిర్‌లైన్‌కు మద్దతు ఇవ్వాలని జెట్‌ పైలెట్ల అసోసియేషన్‌ కూడా తమ సభ్యులను కోరింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో, జెట్ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 5 శాతం నుంచి 25 శాతం వేతనాలు తగ్గించుకోవాలని మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. వేతన కోతపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పైలెట్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లు 2016, 2017ల్లో లాభాల అనంతరం తొలిసారి జెట్‌ ఎయిర్‌వేస్‌ 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.767 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కేవలం జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రమే కాక, ఇండిగో కూడా భారీగా తన లాభాలను పోగొట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఇండిగో కూడా నికర లాభాలు 97 శాతం క్షీణించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement