Jet Airways chairman Naresh Goyal
-
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటే 18,000 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్ సర్క్యులర్ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల విచారణకు అసరమా అని గుర్తించి నిలిపివేయడం)ను సవాల్ చేయగా, దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది. ‘‘ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ అన్నారు. ఈ ఏడాది మే 25న దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్ను విమానాశ్రయంలో దించేసిన విషయం గమనార్హం. అయితే, తనపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, లుకవుట్ సర్క్యులర్ పేరిట ఈ విధమైన చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది. నిధుల కోసమే... గోయల్ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు. హైకోర్టులో గోయల్ పిటిషన్ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎస్ఎఫ్ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్‌కు సమన్లు అందినట్టు వివరించారు. తమ క్లయింట్లు ఎన్ఆర్ఐ హోదా కలిగిన వారని, జెట్ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్ వెళ్లాలనుకున్నట్టు తెలిపారు. గోయల్‌కు బ్రిటన్ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు. అయితే, నరేష్ గోయల్ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ ఆచార్య వాదనలు వినిపిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్ఎఫ్ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు. -
ఉద్యోగుల నిరసన.. వెనక్కి తగ్గిన జెట్
న్యూఢిల్లీ : ఉద్యోగులు వేతనాలు తగ్గించుకోవాలని... లేదంటే జెట్ ఎగరబోదంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేసిన జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ ఎట్టకేలకు కిందకు దిగొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వేతనాలు తగ్గించుకునేది లేదంటూ ఉద్యోగులు, పైలెట్లు భీష్మించుకుని కూర్చోవడంతో, వేతనాల కోతపై జెట్ ఎయిర్వేస్ వెనక్కి తగ్గింది. నాన్-మేనేజ్మెంట్ స్టాఫ్‌కు 25 శాతం తగ్గించబోతున్న వేతన ప్రతిపాదనను పక్కనపెట్టేసింది. శుక్రవారం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు, చైర్మన్ నరేష్ గోయల్‌తో సమావేశం కావడంతో, ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సమావేశ అనంతరం జూలై నెల వేతనాలను కూడా ఈ విమానయాన సంస్థ శుక్రవారమే ఉద్యోగుల అకౌంట్లలోకి క్రెడిట్ చేసింది. వేతన కోత చర్చ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ జూలై నెల వేతనాలు ఆపివేసిన సంగతి తెలిసిందే. వేతనాల కోతపై ప్రతి ఒక్కర్ని ఒప్పించిన తర్వాత జూలై నెల వేతనాలను వేయాలనుకుంది. కానీ ఎలాంటి వేతన కోత చేపట్టడం లేదని చైర్మన్ భరోసా ఇవ్వడంతో, వెంటనే తమ వేతనాలను తమ అకౌంట్లలోకి క్రెడిట్ చేసినట్టు ఓ జెట్ ఉద్యోగి చెప్పాడు. అయితే జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్ ఇప్పటికే వేతనాలను తగ్గించుకుంది. వేతన కోతపై మీడియాలో పలు రిపోర్టులు రావడంతో, గోయల్ ఈ విమానయాన సంస్థ ఇమేజ్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్‌లైన్ అధికారులు చెప్పారు. ‘మీరు సాయం చేశారు.. నేను ఎప్పటికీ అది మర్చిపోను’ అని గోయల్ ఉద్యోగులకు చెప్పినట్టు తెలిసింది. దేశీయ ఏవియేషన్ మార్కెట్ ఆఫర్లను అందిపుచ్చుకుని ఈ ఎయిర్‌లైన్ ముందజలో నిలుస్తుందని గోయల్, ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ కష్టకాలంలో ఉండటంతో తమకు సాయం చేయాల్సిందిగా జెట్ స్టాఫ్‌ను గోయల్ కోరినట్టు వెల్లడైంది. గోయల్ అభ్యర్థన మేరకు ఎయిర్‌లైన్‌కు మద్దతు ఇవ్వాలని జెట్ పైలెట్ల అసోసియేషన్ కూడా తమ సభ్యులను కోరింది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో, జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 5 శాతం నుంచి 25 శాతం వేతనాలు తగ్గించుకోవాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. వేతన కోతపై జెట్ ఎయిర్వేస్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పైలెట్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లు 2016, 2017ల్లో లాభాల అనంతరం తొలిసారి జెట్ ఎయిర్వేస్ 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.767 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కేవలం జెట్ ఎయిర్వేస్ మాత్రమే కాక, ఇండిగో కూడా భారీగా తన లాభాలను పోగొట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో ఇండిగో కూడా నికర లాభాలు 97 శాతం క్షీణించాయి. -
జెట్ ఎయిర్వేస్కు ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం
► వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాల బాట... ► రూ.5,245 కోట్లకు నికర అమ్మకాలు న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కంపెనీ వరుసగా నాలుగవ క్వార్టర్లోనూ లాభాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ రూ.397 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్లో రూ.1,729 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.5,065 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.5,245 కోట్లకు ఎగిశాయని జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ చెప్పారు. ఇంధన ధరలు తక్కువ స్థాయిలో ఉం డడం, ట్రాఫిక్ అధికంగా ఉండడం, వడ్డీ వ్యయాలు కూడా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.5,596 కోట్ల నుంచి 13 శాతం క్షీణించి రూ.4,848 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం నిర్వహణ వ్యయాల్లో ప్రధాన భాగమైన ఇంధన వ్యయాలు రూ.1,334 కోట్ల నుంచి 25 శాతం క్షీణించి రూ.999 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,814 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,174 కోట్ల నికర లాభం వచ్చిందని నరేశ్ గోయల్ పేర్కొన్నారు. కాగా కంపెనీకి ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం ఇదే. ఇక మొత్తం ఆదాయం రూ.19,573 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.21,167 కోట్లకు ఎగసిందని గోయల్ పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.6,686కోట్ల నుంచి 25 శాతం తగ్గి రూ.5,016 కోట్లకు తగ్గాయని వివరించారు. పటిష్టమైన ఆర్థిక పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,680 కోట్లు తగ్గిందని తెలిపారు. జెట్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్ భాగస్వామ్యం కారణంగా లాభాల బాట పట్టామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేర్ బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.607 వద్ద ముగిసింది.