వేతన వెతలు..  | Problems Volunteers Faced Salaries Nalgonda | Sakshi
Sakshi News home page

వేతన వెతలు.. 

Published Mon, May 6 2019 12:19 PM | Last Updated on Mon, May 6 2019 12:19 PM

Problems Volunteers Faced Salaries Nalgonda - Sakshi

నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావలంటీర్లతో భర్తీ చేస్తోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందడం వల్ల ఏర్పడిన ఖాళీలతో పాటు.. ఎప్పటి నుంచో ఉన్న పోస్టులను విద్యావలంటీర్లతో నింపుతోంది. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుతో సమానంగా బోధిస్తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. కానీ విద్యా వలంటీర్లకు వేతనాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వీరికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ముగిసి సుమారు 20 రోజులు కావడంతో.. వేతనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

596 మంది విద్యా వలంటీర్లు..
జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 596 ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్లను భర్తీ చేసింది. వీరికి నెలకు రూ.12,000 వేతనం ఇస్తోంది. వీరితో ఉపాధ్యాయులతో సమానంగా పని చేయిస్తున్నారు. కానీ నెలనెలా ఇవ్వాల్సిన వేతనాలు మాత్రం మూడు, నాలు గు నెలలకోసారి చెల్లిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారు. మూ డు నెలలకోసారి వేతనాలు ఇస్తుండడం వల్ల ఆ సమయాల్లో పండుగలు వచ్చినా వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.వాస్తవంగా పాఠశాలలు ముగిసేలోపే వారికి వేతనాలు అందించాలి. కానీ నేటికీ వేతనాలు అందకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూ.1.50 కోట్ల బకాయిలు..
విద్యా వలంటీర్లకు ఇచ్చే అరకొర వేతనం మూడు నెలలుగా అందించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 596 మంది విద్యా వలంటీర్లకు దాదాపు రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు విడుదల కాలేదు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

జూన్‌ 1 నుంచే పాఠశాలలు పునఃప్రారంభం
ఈ విద్యాసంవత్సరంలో జూన్‌ 1వ తేదీనే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. గతంలో జూన్‌ 12 నుంచి పాఠశాల పునః ప్రారంభించేవారు. గత సంవత్సరం కూడా జూన్‌ 1 నుండే పాఠశాలలను పునః ప్రారంభించాలని విద్యా క్యాలెండర్‌ నిర్ణయించినా ఎండల తీవ్రతతో దాన్నిజూన్‌ 12కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ ఉండడంతో అప్పటికి పాఠశాలలు ప్రారంభం కాకపోవడం వల్ల తెలంగాణ సంబరాలు అంత ఉత్సాహంగా జరగడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌నే మార్పుచేసి జూన్‌ 1 నుంచే పాఠశాలలను పునః ప్రారంభిచాలని నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభం కావడానికి ఇంకా 25 రోజులు గడువు ఉంది. ఈలోపైనా వేతనాలు అందుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement